ఓటర్ల జాబితా సవరణపై రాజకీయ పార్టీలతో సిఈఓ సమావేశం

RAJATH KUMAR
RAJATH KUMAR

ముందస్తు ఎన్నికలపై ఎలాంటి సమాచారం లేదు
2018 ఓటర్లు లిస్టు ప్రకారం ఎన్నికలు
హైదరాబాద్‌: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై తమకు ఎలాంటి సమాచారం లేదని సిఈఓ రజత్‌కుమార్‌ స్పష్టం చేశారు. బుధవారం రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలతో ఉదయం సమావేశం అయ్యారు. రాజకీయ పార్టీలతో సమావేశం ముగిసిన అనంతరం రజత్‌కుమార్‌ మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై మాత్రమే రాజకీయ పార్టీలతో చర్చించామని తెలిపారు. ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఊహాగానాలు మాత్రమే వస్తున్నాయని, షెడ్యూలు ప్రకారం జరగాల్సిన ఎన్నికలకు తాము సిద్దం అవుతున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇది సాధారణ సమావేశం అన్నారు. ఎన్నికల కమిషన్‌ను సంప్రదించిన తరువాతే ఎన్నికలు వెళ్తామన్నారు. ఒకవేళ టిఆర్‌ఎస్‌ ముందస్తు ఎన్నికలకు పిలుపునిచ్చినా తాము సిద్దమేనని వెల్లడించారు. బ్యాలెట్‌ మిషన్లు, వివి పాట్‌ మిషన్లు నవంబర్‌ నాటికి సిద్దంగా ఉంటాయన్నారు. ఎన్నికలు ముందుగా వచ్చిన 2018 జనవరి ఓటర్లు లిస్టు ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. నామినేషన్లకు పది రోజుల ముందువరకు ఓటర్ల నమోదుకు అవకాశం ఉందన్నారు. 2019 జనవరి 1వ తేది నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఓటు హక్కు పొందవచ్చునని తెలిపారు. సిఈఓ కార్యాలయానికి అవసరమైన సిబ్బందిని ఇప్పుడిప్పుడే ఇస్తున్నారరన్నారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్‌ సిద్దం: మర్రి
టిఆర్‌ఎస్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తుందనే ప్రచారం జోరుగా సాగుతుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ కూడా ముందస్తు ఎన్నికలకు సిద్దంగా ఉందన్నారు. అక్రమ ఓటర్లను తొలగించాలని ఈసిని కోరామన్నారు. ఆదిలాబాద్‌ జిల్లా దంతాలపల్లిలో టిఆర్‌ఎస్‌ మద్దతుదారుల కాకుండా మిగిలిన వారి ఓట్లను తొలగించారని ఆరోపించారు. బదిలీ చేసిన ఏడు మండలాలలో ప్రజలు ఇంకా తెలంగాణ ఓటర్లుగా ఉన్నారన్నారు. ఇవన్ని పక్కకు పెట్టి ముందస్తు ఎన్నికలకు వెళ్తారని అనుకోవడం లేదన్నారు.
ముసాయిదాపై అభ్యంతరాలు చెప్పమన్నారు: వెంకటరెడ్డి
జూలై 28న ఇచ్చిన ఓటర్ల జాబితా ముసాయిదాపై అభ్యంతరాలు చెప్పామని అడిగారని, అందుకే సమావేశానికి వచ్చినట్లు బిజెపి అధికార ప్రతినిది వెంకటరెడ్డి అన్నారు. ముందస్తు ఎన్నికలపై సిఈఓను అడగగా తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్పినట్లు ఆయన వెల్లడించారు.
ఆధునిక సమాచార వ్యవస్థ ద్వారా మెసేజ్‌ ఇస్తే సమంజసంగా ఉంటుంది : రావుల
ఓటర్ల సవరణకు ఎన్నికల సంఘం ఆధునీక సమాచార వ్యవస్థ ద్వారా మెసేజ్‌లు ఇస్తే సమంజసంగా ఉంటుందని రాష్ట్ర సిఈఓ తాను చెప్పానని, ఇందుకు ఆయన సుముఖత వ్యక్తం చేసారని టిడిపి అధికార ప్రతినిధి రావుల చంద్రశేఖరరెడ్డి తెలిపారు. జాతీయ స్థాయిలో ఓటర్ల సవరణ విషయమై కేంద్ర ఎన్నికల సంఘం వద్ద జరిగిన సమావేశానికి తెలుగుదేశం పార్టీ తరుపున హాజరు అయినట్లు తెలిపారు. ఈ మీటింగ్‌లో పలు విషయాలను వెల్లడించినట్లు తెలిపారు. సెల్‌ఫోన్‌ ద్వారా 18 సంవత్సరాలు దాటిని ఓటర్లందరికి వెబ్‌సైట్‌లో తమ పేరును పరిశీలించుకుంటే, వాటు ఓటు హక్కు ఉందో లేదో తెలుస్తుందన్నారు. ఈ మేరకు అన్ని ఫోన్‌ నెంబర్ల డాటా ఎలా లభిస్తుందని సిఈఓ ప్రశ్నించగా, టెలిఫోన్‌ సంస్థలు ఎన్నికలు సంఘం కోరితే ఈ డాటాను అందిస్తాయన్నారు.