ఒక్క పరుగివ్వకుండా 10 వికెట్లు

  Cricket Stadium
Cricket Stadium

ఒక్క పరుగివ్వకుండా 10 వికెట్లు

న్యూఢిల్లీ: టీ20 అంటేనే బ్యాట్స్‌మెన్‌ గేమ్‌.ఎంత గొప్ప బౌలరైనా టీ20కి వచ్చే సరికి పరుగులు ఇవ్వక తప్పదు. ఒక్కోసారి బ్యాట్స్‌మెన్‌ బాదుడు తట్టుకోలేక తలపట్టు కుంటారు బౌలర్లు. కానీ 15 ఏళ్ల రాజస్తాన్‌ బౌలర్‌ దీన్ని తలకిందులు చేశాడు. టీ20 క్రికెట్‌లో ఇప్పట ివరకు చూడని బౌలింగ్‌ ప్రదర్శనను ఇచ్చాడు. తన లెఫ్ట్‌ ఆర్మ్‌ మీడియం పేస్‌ బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టును ఉక్కిరి బిక్కిరి చేశాడు. జట్టులో ఏ ఇతర బౌలర్‌కు అవకాశమివ్వకుండా మొత్తం 10 వికెట్లు ఒక్కడే తీశాడు. అతను ఆకాశ్‌ చౌదరి. స్థానికంగా జరిగిన టీ20టోర్నీలో 4-4-0-10 గణాంకా లతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. జైపూర్‌లో జరిగిన లేట్‌ భవేర్‌ సింగ్‌ టీ

20 టోర్నమెంట్‌లో దిశా క్రికెట్‌ అకాడమీ తరుపున ఆడిన ఆకాశ్‌ బుధవారం ఈ అద్భుతమైన బౌలింగ్‌ గణాంకాలను నమోదు చేశాడుపెర్ల్‌ అకాడమీ జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసిన ఆకాశ్‌…నాలుగు మెయిన్లు, సున్నా పరుగులు, 10 వికెట్లతో జట్టును గెలిపించాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన దిశా అకాడమీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 156 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు వచ్చిన పెర్ల్‌ అకాడమీ జట్టు…ఆకాశ్‌ ధాటికి 36 పరుగులకే చాప చుట్టేసింది. తొలి ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన ఈ లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌…రెండు, మూడో ఓవర్లలోనూ చెరో రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక ఆఖరి ఓవర్‌లో ఏకంగా నాలుగు వికెట్లు తీసి మొత్తం 10 వికెట్లను తన ఖాతాలో వేసేసుకున్నాడు. ఆఖరి ఓవర్‌లో హ్యాట్రిక్‌ కూడా సాధించాడు. ఇలాంటి గణాంకాలు చూడటం ఇదే తొలిసారి అని చాలా మంది క్రికెట్‌ విశ్లేషకులు అంటున్నారు. ఒక్క పరుగు ఇవ్వకుండా రెండు, మూడు వికెట్లు తీసిన సందర్భాలు అంతర్జాతీయ క్రికెట్‌లో ఉన్నాయి. కానీ…సున్నా పరుగులతో మొత్తం 10 వికెట్లు తీసిన మ్యాచ్‌లు చూడలేదని అంటున్నారు.