ఒంట‌రిగానే పోటీ

ఒంట‌రిగానే పోటీ

KCR
KCR

సెప్టెంబర్‌లోనే అభ్యర్థుల ప్రకటన
ముందస్తు కాదు, ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్దం
సెప్టెంబర్‌ 2న ప్రగతి నివేదిక భారీ బహిరంగ సభ
కేంద్రం రాష్ట్రాలను మున్సిపాలిటీలుగా చూస్తోంది
నరేంద్ర మోడీ మాటలకు, చేతలకు పొంతన లేదు
9 తీర్మానాలను ఆమోదించిన టిఆర్‌ఎస్‌ కార్యవర్గ భేటీ
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలి
తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కెసిఆర్‌
హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం టిఆర్‌ఎస్‌ సృష్టించింది. ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు ఉండదని, ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేసింది. తెలంగాణ భవన్‌లో సోమవారంనాడు పార్టీ అధినేత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన జరిగిన టిఆర్‌ఎస్‌ కార్యవర్గ సమావేశంలో 9 కీలక తీర్మానాలు చేశారు. పార్టీ నిర్వహించిన సర్వే ఫలితాల ఆధారంగా ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేయడంతో పాటు పార్టీ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల నిర్వహణ, విస్తృత స్థాయి ప్రచారం లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముందస్తు అయినా, గడవు మేరకు అయినా ఎన్నికలెప్పుడు వచ్చినా టిఆర్‌ఎస్‌ సిద్దంగా ఉండేందుకు సెప్టెంబర్‌లోనే అభ్యర్థులను ప్రకటించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. టిఆర్‌ఎస్‌ కార్యవర్గ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్‌ 2వ తేదిన హైదరాబాద్‌లో ప్రగతి నివేదిక పేరుతో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులందరినీ కూడా సెస్టెంబర్‌లోనే ప్రకటిస్తామని,అభ్యర్థుల ఎంపిక కోసం పార్టీ కార్యవర్గం ద్వారా కసరత్తులు చేస్తామన్నారు. టిఆర్‌ఎస్‌ కార్యవర్గం చేసిన తీర్మానాలు విభజన చట్టం కచ్చితంగా కేంద్రం అమలు చేయాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని ఒకవేళ ప్రకటించడం కుదరకపోతే కనీసం రూ.20వేల కోట్లను కేంద్ర సహాయం అందించాలి. వరిధాన్యం, మొక్కజొన్న ధాన్య ధరలు కనీసంగా 2వేల ఉండేలా కేంద్రం చర్యలు తీసుకోవాలి. నరేగా పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి. ఎస్సీ వర్గీకరణ చేయాలి. ఎస్టీ,మైనారిటీల రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కేంద్రం అమోదించాలి. తమిళనాడు రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చినట్లే తెలంగాణ రిజర్వేషన్ల అంశాన్ని కూడా చేర్చాలి. అన్ని రాష్ట్రాల్లో 50శాతం పైగా ఉన్న బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖలు ఉన్నాయి, కేంద్ర మంత్రివర్గంలో ప్రత్యేకంగా బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. బీసీలకు, మహిళలకు చట్టసభల్లో కేంద్రం రిజర్వేషన్లు కల్పించాలి- అంటూ టిఆర్‌ఎస్‌ కార్యవర్గం చేసిన తీర్మానాలను తెలియజేశారు. ఈ సందర్భంగా కేంద్రం అనుసరిస్తున్న ధోరణిపై మండిపడ్డారు. తాము కేంద్ర ప్రభుత్వాన్ని గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, చట్టబద్దంగా రావాల్సినవే అడుగుతున్నామని సిఎం కెసిఆర్‌ అన్నారు.
‘నీతి అయోగ్‌ అసలు ఉద్దేశం వేరు. కేంద్రం అనుసరిస్తున్న పద్దతి వేరు. నీతి అయోగ్‌ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది. కాంగ్రెస్‌ పాలన మొఘల్‌ పాలకుల వలే ఉండేది. ప్రస్తుత బిజెపి పాలన కూడా కూడా అలాగే ఉంది. బీసీలు,మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఇప్పటికే చాలా సార్లు కోరాం. ఇప్పుడు ఉన్న ఎంపీల సంఖ్య 33 కోట్ల జనాభా ఉన్నప్పుడు ఏర్పాటు చేసుకున్నది. ఇప్పుడు పెరిగిన దేశ జనాభాకు అనుగుణంగా పార్లమెంట్‌ స్థానాలు పెంచాలి. కేంద్రం సమాఖ్య విధానానికి తూట్లు పొడుస్తోంది. అధికార కేంద్రీకరణ చేస్తూ రాష్ట్రాలను మున్సిపాలిటీల్లాగా చూస్తున్నారు. రాష్ట్రాలకు మరింత స్వేచ్చ కావాలని గట్టిగా చెబుతున్నాం. వైద్యం, విద్య,వ్యవసాయం రాష్ట్రాన్ని బట్టి మారుతుంటాయి. మోదీ ప్రభుత్వం చెబుతున్న మాటలకు, చేస్తున్న పనులకు పొంతన లేదు. ఈ మధ్య పేపర్లలో ఊహాగానాలు ఎక్కువవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ పొత్తులు ఉండవు. ఇది పార్టీ ఏకగ్రీవ నిర్ణయం. సెప్టెంబర్‌లోనే ఎన్నికల అభ్యర్థులను ప్రకటిస్తాం.మూడు నియోజకవర్గాలకు ఒకటి చొప్పున స్క్రీనింగ్‌ కమిటీలు ఏర్పాటు చేస్తాంఅని సిఎం తెలిపారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా వందకు పైగా స్థానాల్లో టిఆర్‌ఎస్‌ గెలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ‘నిర్ణీత సమయానికి ఆరు నెలల ముందు జరిగే ఎన్నికలు ముందస్తు ఎన్నికలు కాదు, ఇప్పటికే ఎన్నికల సమయంలోకి వచ్చాం. ఎన్నికల గురించి ఇప్పటికే 6 సర్వేలు చేయించాను.వచ్చే ఎన్నికల్లో వందకు పైగా స్థానాల్లో టిఆర్‌ఎస్‌ విజయం సాధిస్తుంది. కాంగ్రేస్సేతర,బిజెపేతర కూటమి ఏర్పాటులో నా ప్రయత్నం ఆగదు. విద్వేషాలు రెచ్చగొట్టడానికి కాంగ్రెస్‌ నేతలు ప్రయత్ని స్తున్నారు.హైదరాబాద్‌ ఒక కాస్మోపాలిటిన్‌ సిటీ, మాకందరూ ఒకటే, ప్రధాని కావాలని అందరికీ ఉంటుంది. కానీ నిర్ణయించేది మాత్రం ప్రజలు, బిజెపి,కాంగ్రెస్‌ పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని కచ్చితంగా చెబుతున్నాను. నేను ప్రయత్నిస్తున్న ఫెడరల్‌ ఫ్రంట్‌ కచ్చితంగా ఏర్పడి తీసుకుంది అని పేర్కొన్నారు. తెలంగాణ నెలసరి ఆదాయం సగటున రూ.10,500 కోట్లని, రాష్ట్ర ఆదాయం బట్టే ఖర్చులు,పథకాలు ఉంటాయని సిఎం కెసిఆర్‌ స్పష్టం చేశారు.