ఐపిఎల్‌ ఆతిథ్యంపై ఇంకా అనిశ్చితి

sunrise
sunrisers

ఐపిఎల్‌ ఆతిథ్యంపై ఇంకా అనిశ్చితి

న్యూఢిల్లీ: ఉప్పల్‌ మైదానంలో ఐపిఎల్‌ మ్యాచ్‌ల పర్యవేక్షణకు ఇద్దరు పరిపాలకులను నియమిస్తూ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఎఆర్‌ ధవే.హైకోర్టు మాజీ న్యాయమూర్తి సీతాపతిని పరిపాలకులుగా నియమించింది.

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం(హెచ్‌సిఎ)లో లోథా బృందం సంస్కరణలు అమలు చేయాలని భారత్‌,బంగ్లాదేశ్‌ టెస్టు సమయంలో గోవిందరెడ్డి అనే న్యాయవాది హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రస్తుతం హెచ్‌సిఎ పాలకవర్గం లేకపోవడంతో పరిపాలకులను నియమించాలని ఈ సందర్భంగా బిసిసిఐ హైకోర్టును కోరింది. బిసిసిఐ అభ్యర్థన మేరకు హైకోర్టు ఇద్దరు న్యాయమూర్తులను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.హైకోర్టు హెచ్‌సిఎ పరిపాలకులను నియమించినా ఉప్పల్‌లో ఐపిఎల్‌-10 ప్రారంభ వేడుకలు నిర్వహిస్తారా లేదా అన్న అనుమానాలు వీడలేదు.షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 4న ప్రారంభ వేడుకలు నిర్వహించాలి.

డిఫెండింగ్‌ చాంపియన్‌ సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌,రన్నరప్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మధ్య ఏప్రిల్‌ 5న తొలి మ్యాచ్‌ జరగాలి.అయితే హెచ్‌సిఎ సిబ్బంది,గ్రౌండ్‌మెన్‌ సమ్మె చేయడంతో ఆతిథ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి.సమ్మె విరమించాలని హెచ్‌సిఎ పెద్దలు కోరుతున్నా సిబ్బంది ససేమిరా అంటున్నారు. జీతాలు,ఇతర బిల్లులు కలుపుకొని సుమారు 1.20 కోట్లు సిబ్బందికి రావాల్సి ఉంది.ప్రస్తుతం హెచ్‌సిఎ ఖాతాలో ఒక్కపైసాలేదు. పైగా 100కోట్ల గోల్‌మాల్‌ జరిగినట్లు డెలాయిట్‌ నివేదికలో తేలింది. ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. ఈ పరిణామాలతో సన్‌రైజర్స్‌ యాజమాన్యం అసంతృప్తితో ఉంది.