ఐదింటికి మూడు మ్యాచ్‌లు హంట‌ర్స్ కైవ‌సం

carolina
carolina

గువహటి: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌)ను హైదరాబాద్‌ హంటర్స్‌ అద్భుతంగా ప్రారంభించింది. ఆదివారం జరిగిన తమ తొలి పోరులో గ్రాండ్‌ విక్టరీ సాధించింది. నార్త్‌ ఈస్ట్‌ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒలింపిక్‌ చాంపియన్‌ కరోలినా మారిన్‌ సారథ్యంలోని హంటర్స్‌ జట్టు 5-2తో గెలుపొందింది. మొత్తం ఐదు మ్యాచ్‌లకుగాను ఆరంభం నుంచి వరుసగా మూడు మ్యాచ్‌లను హంటర్స్‌ కైవసం చేసుకుంది. దీంతో హంటర్స్‌ గెలుపు ఖరారవడంతో మిగిలిన రెండు మ్యాచ్‌లు నామమాత్రమయ్యాయి. హంటర్స్‌ ట్రంప్‌ మ్యాచ్‌గా ఎంచుకున్న మహిళల సింగిల్స్‌లో ఒలింపిక్‌ చాంపియన్‌ కరోలినా మారిన్‌ 15-9, 15-11తో మిషెల్లి లీపై గెలిచి తన జట్టుకు 2 పాయింట్లు అందించింది. అంతకు ముందు పురుషుల డబుల్స్‌లో మార్కిస్‌ కిడో/యూ యెన్‌ సియోంగ్‌ జోడీ 15-10, 13-15, 15-13తో వారియ ర్స్‌ జంట కిమ్‌/షిన్‌పై నెగ్గి హంటర్స్‌కు తొలి పాయింట్‌ను అందించింది. ఆ తర్వాత పురుషుల సింగిల్స్‌లో లీ హ్యూన్‌ 15-13, 11-15, 15-6తో వారియర్స్‌ ఆటగాడు అజయ్‌ జయరామ్‌ను ఓడించడంతో హంటర్స్‌ 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఇక మూడోదైన తమ ట్రంప్‌ మ్యాచ్‌లో మారిన్‌ గెలవడంతో హంటర్స్‌ ఏకంగా 4-0 ఆధిక్యంతో గెలుపును ఖాయం చేసుకుంది. ఆ తర్వాత నామమాత్రమైన రెండో పురుషుల సింగిల్స్‌లో వీ తీన్‌ వీ 2-1తో సాయి ప్రణీత్‌ను ఓడించడంతో వారియర్స్‌కు తొలి పాయింట్‌ దక్కింది. ఇది వారియర్స్‌కు ట్రంప్‌ మ్యాచ్‌. దీంతో హంటర్స్‌ ఆధిక్యం 4-2కు పడిపోయింది. ఇక చివరిదైన మిక్స్‌డ్‌ డబుల్స్‌లో హంటర్స్‌ జోడీ రాంకీ రెడ్డి-బెర్నాడెత్‌ 1-0తో చియోల్‌-సావంత్‌ జంటపై నెగ్గడంతో మారిన్‌ బృందం 5-2తో తన ఆధిక్యాన్ని పెంచుకుంది.