ఏప్రిల్‌ 1 నుండి డీలర్‌ వద్దే వాహనాల రిజిస్ట్రేషన్లు

VEHICLES
VEHICLES

మార్గదర్శకాలు సిద్ధం
హైదరాబాద్‌: కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు ఇక నుండి సంబంధిత డీలర్ల వద్దే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానం ఏప్రిల్‌ 1వ తేదీ నుండి అమల్లోకి రానుంది. దీనికి సంబంధించి రవాణా శాఖ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇందులోభాగంగా ఇప్పటికే మార్గదర్శకాలను సంబంధిత శాఖ అధికారులు రూపొందించారు. వాహనాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను డీలర్లకే అప్పగించాలని కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో తొలుత రవాణేతర వాహనాల రిజిస్ట్రేషన్లు డీలర్ల దగ్గరే నిర్వహించేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ఈ విధానంతో రవాణా శాఖ కార్యాలయాల వద్ద ఏజెంట్ల మోసాలు, అవినీతిని తగ్గించేందుకు అవకాశాలు ఉన్నాయనేది అధికారుల వాదన. అలాగే రిజిస్ట్రేషన్‌ కోసం ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరగాఇ్సన అవసరం తప్పుతుంది. దీనికి సంబంధించిన జిఒ 83ను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విధానంలో తొలుత వ్యక్తిగత వాహనాలైన కార్లు, బైకులను విక్రించే డీలర్ల వద్దే రిజిస్ట్రేషన్‌ చుకునే వీలు కల్పిస్తూ మార్గదర్శకాలు రూపొందించారు. అయితే ఫ్యాన్సీ నెంబర్‌ కావాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా రవాణా శాఖ కార్యాలయాలకు రావాల్సి ఉంటుంది. కాగా వాహన రిజిస్ట్రేషన్లకు నిర్దేశించిన మొత్తం కన్నా ఎక్కువగా వసూలు చేసే డీలర్లకు భారీ జరిమానా విధించడంతోపాటు, డీలర్‌షిప్‌ను కొన్ని నెలల పాటు సస్పెండ్‌చేయనున్నారు. హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ ప్లేట్లను డీలర్లే అమర్చాల్సి ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. హెచ్‌ఎష్‌ఆర్సీ లేకుండా వాహనం బయటకు వస్తే భారీగా జరిమానా విధించనున్నారు. అలాగే నెల రోజుల పాటు రిజిస్ట్రేషన్లు చేయకుండా సదరు వాహన డీలర్‌పై నిషేధం విధించనున్నారు. రెండో దఫా కూడా ఇదే తప్పు చేస్తే మూడు నెలల పాటు డీలర్‌ రిజిస్ట్రేషన్‌ లైసెన్స్‌ను సస్పెన్షన్‌లో పెట్టడంతోపాటు, 5 లక్షల రూపాయల వరకూ జరిమానా వసూలు చేస్తారు. ఇదే తప్పు మళ్లీ మళ్లీ చేస్తే రిజిస్ట్రేషన్‌ లైసెన్సు రద్దు చేసి డీలర్‌పై కేసులు నమోదు చేయనున్నారు. అలాగే ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు కంటే ఎక్కువగా వసూలు చేస్తే సంబంధిత డీలర్లకు 2 లక్షల రూపాయల నుండి 5 లక్షల రూపాయల వరకూ జరిమానా విధించేలా మార్గదర్శకాలను రూపొందించారు. కొత్త విధానం అమలుకు ప్రస్తుతం ఉన్న వ్యవస్థను సమూలంగా మార్చాల్సి వస్తోందని రవాణా శాఖ అధికారవర్గాలు వెల్లడించాయి. డీలర్ల వద్ద వాహనాల రిజిస్ట్రేషన్లు చేపట్టేందుకు ప్రత్యేక ఆన్‌లైన్‌ వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉంటుంది. ఇందుకోసం దాదాపు 11 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని రవాణా శాఖ అధికారవర్గాలు అంచనా వేశాయి.