ఏపి సిఎం నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించాలి

vasireddy PADMA
vasireddy PADMA

వేలకోట్లను దుబారా చేస్తున్నారు
వైఎస్సార్సీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ
హైదరాబాద్‌: ప్రజల నుంచి పన్నుల రూపంలో విపరీతంగా సేకరిస్తున్నారు మరోవైపు అప్పులు పెరిగాయని ప్రజా సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగా మారిందని వైఎస్సార్సీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుర్చి దిగేనాటికి అప్పులు రూ.2.50లక్షల కోట్లకు చేరుతుందని అంచానాలు ఉన్నాయన్నారు. ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఎక్కడి వెళ్లాయని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి నెరవేరలేదన్నారు. ప్రమాణా స్వీకారం రోజు చంద్రబాబు సంతకాలు చేసిన ఐదు సంతకాలకు దిక్కులేదన్నారు. రూ.87కోట్ల వ్యసాయ రుణమాఫి, రూ.14వేల కోట్లకుపైగా ఉన్న డ్వాక్రా రుణాల మాఫీ అని 2014 ఎన్నికలప్పుడు నోటికి వచ్చినప్పుడు వాగ్దానాలు ఇస్తుంటే వాటిని ఎలా నెరవేరుస్తారని టిడిపిని ఎన్నికల సంఘం ప్రశ్నిస్తే టిడిపి అఫిడవిట్‌ వేసి మరి తన అనుభవంతో నెరవేర్చనున్నట్లు గొప్పలు చెప్పుకున్నారన్నారు. ఎన్‌టిఆర్‌ పేరుతో పథకం పెట్టి ఇంటింటికి మంచినీరు ఇవ్వని దౌర్భాగ్య పాలన చేస్తున్నారని, రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎక్కడికి వెళ్తుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బాగుపడుతున్నారే తప్ప తెలుగువారు ఎవరూ బాగుపడటం లేదన్నారు. భూముల పంపిణీ, కాంట్రాక్ట్‌ల కేటాయింపులకే కేబినెట్‌ సమావేశాలు తప్ప ప్రజలకు సంబంధించిన అంశాలపై ఎక్కడి కూడా చర్చకు రావడం లేదన్నారు. బాబు దుబారా ఖర్చులు చూసి నేషనల్‌ మీడియా ఆశ్చర్యపోతుందన్నారు. నాలుగు సంవత్సరాలలో రూ.3000కోట్ల దుబారాకే ఖర్చుచేశారన్నారు. రాజధాని శంకుస్థాపన పేరుతో రూ.250కోట్లతో మొదలైన దుబారా ఇంకా సాగుతుందన్నారు. సొంత ఇంటి నిర్మాణ సమయంలో హైదరాబాద్‌లో హోటల్‌లో ఉండేందుకు భారీగా నిధులు ఖర్చు చేశారన్నారు. ప్రత్యేక ఫ్లైట్లు, మందీ మార్బలమంటూ భారీగా ఖర్చుచేసారని, దీనిపై చంద్రబాబు, ఆర్థిక మంత్రి సమాధానం చెప్పాలన్నారు. దుబారా ఖర్చులు మొత్తం విచారణ చేస్తే టిడిపి నేతల అంతా దోషులుగా నిలబడతారు. బోనులో నిలబడాల్సి వస్తుంది. రూ.3000కోట్ల దుబారాపై ఏదో ఒక దశలో చంద్రబాబు విచారణ ఎదుర్కొవాల్సి వస్తుందని ఆమె అన్నారు.