ఏపి రైతుల కోసం 20 లక్షల డాలర్ల గ్రాంట్‌ :వాల్‌మార్ట్‌

walmart
walmart

న్యూఢిల్లీ: భారతదేశంలోని సన్నకారు రైతులకు తోడ్పడానికి, తమ ఉత్పత్తులను ఇతర రంగాలకు మళ్లించడానికి అగ్రిబిజినెస్‌ సిస్టమ్స్‌ ఇంటర్నేషనల్‌
(ఎఎస్‌ఐ) స్వచ్ఛంద సంస్థకు 20 లక్షల డాలర్ల గ్రాంటును వాల్‌మార్ట్‌ ఫౌండేషన్‌ బుధవారం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో రైతు మార్కెట్‌ సంసిద్ధత
ప్రాజెక్టును అమలు చేయడం కోసం ఎఎస్‌ఐకి ఆర్థిక మద్దతు అందించడం కోసం ఈ నిధులను ఇస్తున్నట్లు ఫౌండేషన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. రాబోయే రెండేళ్లలో 15వేల మంది రైతులు, వారి కుటుంబ సభ్యుల జీవితాలు మెరుగుపరచడం ఈ నిధుల ఉద్దేశమని కూడా ఆ ప్రకటన తెలిపింది. రైతులకు మార్కెట్ల పట్ల అవగాహన, వనరులు, సేవలను అందించడం ద్వారా వారి మార్కెట్‌ సన్నద్ధతను పెంచడం వాటికి వారు చేరువకావడం ఈ ప్రాజెక్టు లక్ష్యమని ఆ ప్రకటన తెలిపింది. పంట వేయడానికి ముందే మార్కెట్‌ స్థితిగతులు, డిమాండ్‌, ధరలు లాంటి వాటిపై అవగాహన కల్పించడం కోసం రైతులు, వివిధ రంగాలకు చెందిన కొనుగోలుదారుల మధ్య సమావేశాలు ఏర్పాటు చేయడం ద్వారా వారి మధ్య సన్నిహిత సంబంధాలను నెలకొల్పడానికి ఎఎస్‌ఐ ప్రయత్నిస్తుంది. అంతేకాకుండా లాభాలు పెంచుకోవడం కోసం పంట మార్పిడిని కూడా ప్రోత్సహిస్తుందని ఆ ప్రకటన తెలిపింది. రైతులకు తోడ్పాటును అందించడంలో సంస్థలు మొదలుకొని వ్యాపార సంస్థల దాకా పలు రంగాలకు చెందినవారు ఎలా పాలుపంచుకునేలా చేయాలనే విషయంలో ఎఎస్‌ఐ కృషి చేస్తోందని వాల్‌మార్ట్‌ ఫౌండేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జూలి గెర్కి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిన్న కమతాల రైతులకు వాల్‌మార్ట్‌ ఫౌండేషన్‌ అందించే సహాయం వారి జీవితాలను మెరుగుపరిచి, ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల భాగస్వాములతో రాబోయే తరాలు నిలకడైన, పారదర్శక భాగస్వామ్యాలను నెలకొల్పుకోవడంపై దృష్టి పెట్టేలా చేస్తుందని భారతదేశంలో ఎఎస్‌ఐ ప్రతినిధి అమిత్‌ సింగ్‌ అన్నారు.