ఏపి జేఏసి తెలంగాణ కోసం ప‌నిచేస్తుందిః ప‌వ‌న్‌

pawan, JP
pawan, JP

హైద‌రాబాద్ః ఏపీలో జేఏసీ ఏర్పాటుపై పావులు చకచకా కదులుతున్నాయి. బుధవారం జేఏసీ గురించి మాట్లాడిన జనసేన అధినేత.. గురువారం నుంచే పని మొదలు పెట్టారు. ఇవాళ లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణతో సమావేశమయ్యారు. ఈ భేటీ తర్వాత వారిద్దరూ మాట్లాడిన తీరు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త చర్చకు దారితీస్తోంది. ఏపీలో ఏర్పాటు కానున్న జేఏసీ.. కేవలం ఆ రాష్ట్ర డిమాండ్ల కోసమే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో డిమాండ్ల పరిష్కారానికి కృషి చేయనున్నట్టు ఇద్దరు నేతలు తెలిపారు. గంభీరమైన, ఉద్వేగాల సమయంలో ఏపీ విభజన జరిగిందన్నారు. అయితే నేతల తీరుమాత్రం ఏరుదాటాక తెప్ప తగలేసినట్టు మారిందన్నారు. చట్టసభలపై నమ్మకం పోయిందని పవన్, జేపీ ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ సాక్షిగా చాలా రచ్చ, చర్చ, రభస జరిగాక ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆర్థిక లోటులో, రైల్వేజోన్ విషయంలో, అభివృద్దిలో ఏపీకి అండగా నిలవాలని.. తెలంగాణకు పరిశ్రమలు, ఎయిమ్స్ విషయంలో సాయం అందించాలని కోరారు. ఇలా ప్రతి అంశంలో రెండు రాష్ట్రాల మేధావులతో చర్చించి తమ జేఏసీ ముందుకెళుతుందని తెలిపారు. జేపీ, పవన్ చేసిన ఈ ప్రకటన ఇరు రాష్ట్రాల్లో కొత్త తరహా రాజకీయం ఏర్పాటుకు దారితీసే అవకాశముందన్న వాదనలు అప్పుడే వినిపిస్తున్నాయి.