ఏపిలో కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల పోలింగ్‌

12 జిల్లాలలో తొలి విడత ఎన్నికలు

అమరావతి: ఏపీలో పంచాయతీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. 12 జిల్లాల్లో 2,723 గ్రామ పంచాయతీల్లో తొలి దశ ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో 7,506 మంది పోటీ చేస్తున్నారు. ఇందులో 20,157 వార్డు సభ్యుల స్థానాలకు 43,601 మంది బరిలో ఉన్నారు. తొలిదశ ఎన్నికల కోసం 29,732 పోలింగ్ కేంద్రాలు ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే 525 పంచాయతీలు, 12,185 వార్డులు ఏకగ్రీవం కాగా..పంచాయతీ ఎన్నికల్లో తొలిసారి నోటాకు అవకాశం ఉంది. ఎన్నికలు మధ్యాహ్నం 3:30 వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు తర్వాత.. ఫలితాలను వెల్లడిస్తారు. ఫలితాల అనంతరం ఉపసర్పంచ్ ఎన్నిక ఉంటుంది.


కాగా, ఉదయం 8.30 గంటల వరకు 18 శాతం పోలింగ్ నమోదయ్యింది. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారి గిరిజా శంకర్ పర్యవేక్షిస్తున్నారు. సెన్సిటివ్‌, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌ కెమెరాలు ఏర్పాటు చేశారు. సుమారు 7 వేల కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు. వెబ్‌ కాస్టింగ్ ద్వారా గిరిజా శంకర్‌‌ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం ఉదయం 6.30 ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. విజయనగరం మినహా మిగిలిన 12 జిల్లాల పరిధిలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో తొలిసారిగా ‘నోటా’ను అందుబాటులోకి తెచ్చారు. పోలింగ్‌ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు జరగనుంది. కరోనా పాజిటివ్‌ బాధితులకు పీపీఈ కిట్లతో చివరిలో గంటసేపు అవకాశం కల్పించనున్నారు.