ఏడాది దాటినా అతీగతీలేని మాదకద్రవ్యాల కేసులు

ఏడాది దాటినా అతీగతీలేని
మాదకద్రవ్యాల కేసులు

భారీగా డ్రగ్స్‌ స్వాధీనం..17 మంది అరెస్టు
చార్జిషీటుపై నోరెత్తని అబ్కారీ శాఖ..
నిందితులు తప్పించుకునేందుకు ఆస్కారం
బడా బాబుల ఒత్తిడితో వెనుకంజ..?

హైదరాబాద్‌: రాష్ట్రంలో సంచలనం రేపిన మాదకద్రవ్యాల మాఫియాపై అబ్కారీ శాఖ విచారణ ఏడాది దాటినా అతీగతీ లేకుండా వుంది. 2017 జూలై నెలలో నైజీరియన్‌ కెల్విన్‌, లోకల్‌ డాన్‌ పీయూష్‌ల అరెస్టుతో వెలుగుచూసిన డ్రగ్స్‌ మాఫియా కదలికలు డచ్‌ నేరగాడు కమింగ పట్టుబడిన తరువాత వేగం పుంజుకుని టాలీవుడ్‌ ప్రముఖులకు ఉచ్చు బిగుసుకున్నట్లు వార్తలు వచ్చినా చివరకు దీనిపై నమోదైన మూడు కేసుల విచారణ ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లుగా పడివుంది.

ఈ కేసులకు సంబంధించి అప్పట్లో అబ్కారీ శాఖ చేసిన హైరానా, హడావిడి అంతా ఇంతా కాదు. టాలీవుడ్‌ ప్రముఖుల విచారణ, వారితో పాటు ఇంకొంద రు ప్రైవేటు వ్యక్తుల దర్యాప్తు అంతా సినిమా సెట్టింగ్‌లను తలపించేది. చివరకు ఇంత హంగామాగా సాగిన విచారణ పూర్తయి, దీనిపై త్వరలో చార్జిషీటు దాఖలు చేస్తామని ఎక్సైజ్‌ శాఖ అడపదడపా ప్రకటనలు చేయడం మిన హా 13 నెలలుగా సాధించిందేమీ లేదని చెప్పాలి. ఈ కేసుల్లో కెల్విన్‌, పీయూష్‌, కమింగాలకు సహకరిం చిన పలువురు లోకల్‌ నేరగాళ్లు పట్టు బడినా దాని తరువాతి పరిణామాలు ఏమయ్యాయనేది తెలియరాలేదు. ఈ కేసుకు సంబంధించి చార్జిషీటు దాఖలు చేసే విషయంలో జరుగుతున్న తాత్సారం నిందితులు సులభంగా తప్పించుకునేందుకు వీలు కలిగించేలా వుందని విశ్రాంత అధికారులు అంటున్నారు.

డ్రగ్స్‌ మాఫియా విషయంలో అబ్కారీ శాఖ వెనుకంజ వేయడం వెనుక కొందరు బడాబాబుల ఒత్తిడి తీవ్రంగా వుందనే వాదనలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌ కేంద్రంగా గత ఏడాది జూలై నెలలో వెలుగు చూసిన డ్రగ్స్‌ మాఫియాపై అబ్కారీ శాఖ విచారణ ఒక అడుగు ముందుకు పది అడుగులు వెనక్కు అన్న ట్లుగా సాగుతోంది.

2017 జూలై రెండవ తేదీన బోయిన్‌పల్లి ప్రాంతంలో నైజీరియన్‌ కెల్విన్‌ మార్కన్సన్‌ అలియాస్‌ కెల్విన్‌ ముఠా మొదటగా పట్టుబడిన తరువాత వెలుగు చూసిన మాదకద్రవ్యాల మాఫియా గుట్టు ఆ తరువాత రోజుకోమలుపూ తిరిగి చివరకు టాలీవుడ్‌ ప్రముఖులకు ఉచ్చులా బిగుసుకునే వరకు వెళ్లింది.

కెల్విన్‌ ముఠాలో స్థానిక నేరగాళ్లు జీషాన్‌, అబ్దుల్‌ వాహీద్‌, అబ్దుల్‌ కుద్దూస్‌లతో మరో నలుగురు వున్నారని తేలింది.