ఏకైక వాంఛ

SUNDARA CHAITANYANANDA
SUNDARA CHAITANYANANDA

ఏకైక వాంఛ

దీర్ఘకాల సుఖాన్ని ఒకవైపు ఆశిస్తూ, శీఘ్రకాల ఫలితాల కొరకు మరోవైపు శ్రమించటమే మానవ్ఞని జీవన విధానంలోని లోపాన్ని సుస్పష్టం చేస్తూ ఉంది. విద్యార్థి దశలోనే విద్యార్జనకు స్వస్తి పలికి, అవసరం లేకపోయినా ధనార్జన వైపు మరలుతున్న విద్యార్థులు ఎలాంటి భవిష్యత్తును ఊహిస్తున్నారో? మంచి చదువ్ఞ, అంతకు మించిన ఉద్యోగము ఉండినా, కోటికి పడగలెత్తాలనే ఉబలాటంతో అక్రమసంపాదనకు అలవాటు పడి తరతమ భేదాలను కూడా పాటించక, సమాజ రుధిరాన్ని జలగల్లాగా పీల్చుకొంటున్న అవినీతిపరులు ఈ సృష్టిలో ధర్మాలే లేవని భావిస్తున్నట్లేనా? తమ వర్తమానం భవిష్యత్తుకు అందేది కాదని నిశ్చయించుకున్నట్లేనా?

పదికాలాల పాటు సుఖపడాలని కళ్యాణవేదికపై కాలుపెట్టి, తాళికట్టిన మరుక్షణం నుండి కట్నాలు, కానుకలంటూ కాంతలను కష్టపెట్టే కలి మానవులకు వివాహము విశిష్టత అర్థమైనట్లేనా? గుండెను పగలగొట్టి బండినెక్కి ఊరేగితే ఒరిగేదేమిటో? సర్వబంధ విముక్తులు కావాలని, సర్వోపద్రవ రహిత స్థితియైన మోక్షాన్ని పొందాలని తత్వశాస్త్రాన్ని తాత్విక మార్గాన్ని ఎంచుకున్న ముముక్షువ్ఞలు జిజ్ఞాసను గాలికి వదలి, విత్తానికి ఏ మంత్రం? పదవికి ఏ తంత్రం? వ్యాపారాభివృద్ధికి ఏ యంత్రం? అని దారినపోయే దానయ్య మొదలు, దారిలో పడని సన్యాసి వరకు కాలికి బలపం కట్టుకుని తిరుగుతూ ఉన్నారంటే, మతి చెడిన ఈ ముముక్షువ్ఞలు ఏమి పొందాలనుకుంటున్నారు? వీరిని ప్రేరేపించి, ప్రోత్సహించే జ్ఞ్ఞానహీనులు ఏమి సాధించాలను కుంటున్నారు? దీర్ఘకాలం కళకళలాడాలనే కాంక్ష అందరికీ ఉన్నా, శీఘ్రకాలంలో అందుతున్నాయని వెలవెలపోయే తళతళలను తలకెక్కించుకుని తైతక్కలాడటం వలన తలలు బరువెక్కుతాయే గాని జీవితాలు తేలికపడవు.

రాముణ్ణి ప్రక్కనే పెట్టుకుని బంగారు జింకను ఆశించిన సీతమ్మ బంగారు బ్రతుకును బండ బ్రతుకుగా ఎలా మార్చుకొన్నదో మనకు తెలియని విషయం కాదు. పావనాత్ముడైన శ్రీకృష్ణ పరమాత్మను కాలదన్ని పారిజాత పరిమళాల వైపు పరుగులెత్తిన సత్యభామకు ఒరిగిందేమిటో మనకు తెలిసిందే. చదువ్ఞ ఉన్నంత మాత్రాన సంస్కారం తోడౌతుందని చెప్పలేం. సంస్కారం ఉంటే మాత్రం చదువ్ఞ దివ్యంగా పరిమళిస్తుంది. అందుకనే, చదువ్ఞ సంస్కారం ఉండాలి అంటుంటారు పెద్దలు. సంస్కారము అనేది వయస్సుకు పరిమితం కాదు. దానికి లింగభేదం లేదు. రూపభేదం లేదు. అది హాయిగా వీచే గాలిలాంటిది. చల్లగా పారేనది లాంటిది.

‘శబరీ! ఏమి కావాలో కోరుకో? అన్నాడు రాముడు. ‘సుదామా! నీ వాంఛను చెప్పు. తీరుస్తాను అన్నాడు శ్యాముడు. ‘ఎంత తపస్సు చేశావ్ఞ ఉమా? ఏ ఫలం కావాలి? అన్నాడు శివ్ఞడు. ‘ప్రహ్లాదా! చెప్పు నీకు ఏం కావాలి? అన్నాడు వెన్నుడు. ‘నచికేతా? ఏదైనా ఇస్తాను అని ముందడుగు వేశాడు యముడు. అందరికీ ఒకే ప్రశ్న. సంస్కారవంతులు కనుక అందరిదీ ఒకే సమాధానం. మోక్షమే భూయాత్‌ ‘మాకు మోక్షమే కావాలి. తాపసమందారా! మాకు ఇదొక్కటి చాలు. పురుషోత్తముని మీది బుద్ధిబుద్ధి. ఇదే చదువ్ఞలలో మర్మము. ఇదే మర్మమైన చదువ్ఞ. రాజవిద్యఇదే. రాజగుహ్యమిదే. మెరిసే వాటి మధ్య మురిసిపడే కన్నా, వలచినదానిని, కావలసిన దానిని పొందే ప్రయత్నమే శ్రేయస్కరము. దేహికి, దేశానికి ఇదే శ్రీరామరక్ష. దేశోయం క్షోభరహితః

– స్వామి సుందర చైతన్యానంద