ఎస్‌బిఐ ఎటిఎంకు వెళ్తే జేబులు గుల్ల

SBI
SBI

ఎస్‌బిఐ ఎటిఎంకు వెళ్తే జేబులు గుల్ల

ముంబయి, మే 12: భారతీయస్టేట్‌ బ్యాంకు ఖాతాదారులకు ఇకపై ఎటిఎంల నుంచి విత్‌డ్రా చేసుకుంటే జేబులు గుల్లవుతాయి. జూన్‌ ఒకటవ తేదీ నుంచి ఎటిఎం నుంచి చేసే ప్రతి విత్‌డ్రాకు రూ.25 చొప్పున ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా పాతనోట్లు, చినిగిన నోట్లు వంటివి రూ.5వేలకు మించి తీసుకుంటే వాటికి కూడా ఛార్జీలు విధిస్తామని వెల్లడించింది. పెద్దనోట్ల రద్దు తర్వాత కేంద్రం ప్రకటించిన ఈ విధానంతో బ్యాంకర్లు రానురాను కస్టమర్లను ఛార్జీలతో బాదేస్తున్నారు. అందులో భారతీయస్టేట్‌బ్యాంకు మరింత దారుణంగా బాదేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని, పెద్దనోట్ల రద్దుసమయం నుంచి కూడా కేంద్రం ప్రజలతో ఆడుకుంటున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సిపిఐఎం లోక్‌ సభ సభ్యులు ఎంబి రాజేష్‌ మాట్లాడుతూ ఈ ఛార్జీల బాదుడు అంశా న్ని పార్లమెంటులో లేవనెత్తుతామని ఆయన వెల్లడించారు. కేరళలో వెనువెంటనే ఈ ఛార్జీల పెంపుపై తీవ్ర నిరసన లేవనెత్తారు. జూన్‌ నెలనుంచి ఎటిఎం విత్‌డ్రాలపై విధించే ఛార్జీలు అత్యంత దారుణమని ప్రముఖ నటుడు శోభి తిలకన్‌ పేర్కొన్నారు. కేంద్రం ప్రజావ్యతిరేక విధానాలు అనుసరిస్తోందని అన్నారు.

స్థానిక వడ్డీ వ్యాపారులకంటే భారతీయ స్టేట్‌బ్యాంకు దారుణంగా వ్యవహరిస్తోందని ఆయన విమ ర్శించారు. సగటు మానవునికి బ్యాంకింగ్‌ వ్యవస్థను దూరంచేస్తోంద న్నారు. ఈ జులుం, బాదుడుపై ప్రజానిరసన పెల్లుబుకుతుందని ఆయన స్పష్టంచేసారు ఇప్పటికే కొన్ని బ్యాంకుల వద్ద ప్రజలు తమ నిరసనను వ్యక్తంచేస్తున్నారు. కేంద్రంప్రజలను మోసం చేసిందని, అలాగే కేరళ ప్రజలకోసం ఏర్పాటుచేసిన స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావన్‌కూర్‌ను సైతం ఎస్‌బిఐలో విలీనంచేసి బ్యాంకింగ్‌ సేవలు మరింత ప్రియం చేసిందన్నారు. కేరళ లోని 141మంది సభ్యులున్న అసెంబ్లీలో బిజెపికి చెందిన ఎమ్మెల్యేలు సైతం ఈ విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఒక తీర్మానం కూడా ఆమో దించారు. బ్యాంకులు ఇదే వైఖరి అనుసరిస్తే ఇక సామాన్య మానవుని జేబులు గుల్ల అవుతాయన్నారు.
బిజెపి నేతలే దీనిపై వివరణ ఇవ్వాల ని ప్రజలకు జవాబుదారి కావాలనిఅన్నారు. కేరళలోని 880 ఎస్‌బిటి శాఖలవద్ద తీవ్రనిరసన వ్యక్తంచేసారు. 400శాఖలకుపైగా మూతపడ్డా యి. ప్రస్తుతం 800కుపైగా ఎస్‌బిఐ శాఖలు రాష్ట్రంలో ఉన్నాయి. ప్రతి భారతీయుని బ్యాంకరుగా చెప్పుకుంటున్న భారతీయ స్టేట్‌ బ్యాంకు ఈ ఛార్జీల జులు విదిలించుకోకపోతే ప్రజానిరసన ఎదుర్కొ నక తప్పదని బ్యాంకుశాఖల వద్ద కస్టమర్లు నిరసన గళం విప్పుతు న్నారు. కొద్దిరోజుల క్రితమే ఎస్‌బిఐ కనీసనిల్వల మొత్తాలు లేని ఖాతాల నుంచి ఛార్జీలు వసూలుచేస్తామని ప్రకటించింది.మెట్రో నగరా ల్లో ఐదువేలు, ఒకమోస్తరు నగరాలు పట్టణాల్లో మూడువేలు, పట్టణ కేంద్రాల్లో రెండువేలు, గ్రామీణప్రాంత బ్యాంకుల్లో వెయ్యిరూపాయలు కనీస నిల్వ ఉండాలన్న నిబంధనలు విధించింది. ఇవిలేని పక్షంలో వెనువెంటనే 25 రూపాయల నుంచి 100రూపాయల వరకూ ఛార్జీలు విధిస్తోంది.

అలాగే డెబిట్‌ట్రాన్షఫర్‌ పేరిట అనునిత్యం ఖాతాదారుల ఖాతాలకు రూ.11.50ఖర్చురాస్తోంది. ఇకపోతే ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌లు, బ్యాంకుఖాతాల నిల్వలు తెలుసుకోవాలంటే వాటికి ఛార్జీలున్నాయి. అలాగే ఎటిఎంకార్డు ఛార్జీలను కొన్ని బ్యాంకులు వార్షిక, త్రైమాసిక పద్ధతిలో వసూలుచేస్తున్నాయి. అదేమంటే బ్యాంకులకు నష్టాలొస్తు న్నాయని వాటిని పూడ్చుకునేందుకే ఈ కార్యచరణ అమలవుతోందని సమర్ధించుకుంటున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకులన్నింటికంటే ప్రస్తు తం సామాన్యమానవుని బ్యాంక్‌గాచెపుతున్న ఎస్‌బిఐ విధించే ఛార్జీలు సగటుజీవికి మరింతభారం కాకతప్పదు. డిజిటల్‌ లావాదేవీలవైపు ప్రోత్స హించాలన్న ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా బ్యాంకు కొత్తగా ఎస్‌బిఐ ఆధార్‌పే పేరిట కొత్తయాప్‌ను విడుదల చేసింది. కేవలం ఆధార్‌ నంబరుసాయంతో నగదుబదిలీచేసుకునే విధానం అమలుకు తెచ్చింది.