ఎస్బీఐలో రూ.3కోట్ల మోసం

SBI
SBI

చెన్నై: ఇప్పటికే మోసగాళ్ల బారిన పడిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఉదంతం ఓ కొలిక్కి రాకముందే ఇతర బ్యాంకుల్లో జరిగిన మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా ప్రపంచంలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో సుమారు రూ.3.3కోట్ల మేర మోసం జరిగినట్లు అధికారులు గుర్తించారు. కార్లు కొనుగోలు చేసేందుకని రుణాలు తీసుకుని వాటిని ఓ తమిళ సినిమా నిర్మించేందుకు ఉపయోగించినట్లు ఎస్‌బీఐ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఆ సినిమా విడుదలపై స్టేను కోరుతూ ఎస్‌బీఐ అధికారులు మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి సీవీ కార్తికేయన్‌ సినిమా విడుదలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 16, 2018 వరకు సినిమా విడుదల చేయొద్దంటూ నిర్మాతలకు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కబడ్డీ ఆటగాడు రాజాతో సహా మరో 13 మంది కార్లు కొనుగోలు చేసేందుకు రుణాలు కోరుతూ ఎస్‌బీఐను ఆశ్రయించారు. రాజా వైట్‌ స్క్రీన్‌ ప్రొడక్షన్స్‌(డబ్ల్యూఎస్‌పీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కార్లు కొనుగోలు చేసేందుకు వీరందరూ ఎస్‌బీఐ నుంచి దాదాపు రూ.3,29,71,000 మేర రుణాలు తీసుకున్నారు. కానీ వాటిని కార్లు కొనుగోలు చేసేందుకు ఉపయోగించకుండా తమిళ సినిమాను నిర్మించేందుకు ఉపయోగించారు. ఆటోలోన్‌ కౌన్సిలర్‌ చిత్ర సహాయంతో బ్యాంకు కంప్యూటర్లను హ్యాక్‌ చేసినట్లు అధికారులు గుర్తించారు.