ఎవరి ధీమా వారిదే

గ్రేటర్‌పై అన్ని పక్షాల ఆశలు.. ఏకపక్షం అంటున్న టిఆర్‌ఎస్‌
గతంలో కంటే స్థానాలు పెరుగుతాయని ఎంఐఎం
అధిక స్థానాలపై టిడిపి-బిజెపి కూటమి అంచనా
ఓటములు దాటుతూ కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం
హైదరాబాద్‌ : రాష్ట్ర రాజధాని నగరం గ్రేటర్‌ మున్సిపల్‌ ఎన్నికల నగరా మోగుతున్న నేపథ్యంలో దాదాపు అన్ని రాజకీయ పక్షాలు ఎవరి ధీమాతో అవి ఉన్నాయి. వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నికల ఫతితాలతో మంచి ఊపుమీద ఉన్న టిఆర్‌ఎస్‌ అదే విజయ పరంపర గ్రేటర్‌లోనూ కొనసాగుతుందని, అంతా ఏకపక్షమేననే విశ్వాసంతో ముందస్తు గెలుపు ఉత్సాహంతో ముందుకు పోతున్నది. గత గ్రేటర్‌ ఎన్నికల్లో ఎక్కువ సీట్లే కైవసం చేసుకొని అధిక సమయం మేయర్‌ పదవిని కూడా అనుభవించిన మజ్లిస్‌ పార్టీ అప్పటి కంటే అధిక సీట్లు సాధించుకుంటామనే నమ్మకంతో ఉంది. ప్రస్తుత ఎన్నికల తర్వాత కూడా తమ మద్దతు లేకుండా ఏ పార్టీకి గ్రేటర్‌లో మేయర్‌ స్థానం లభించదని, తమ భాగస్వామ్యం తప్పనిసరనేది ఎంఐఎం నేతల అభిప్రాయంగా ఉంది. కాగా వరంగల్‌ ఉప ఎన్నికల్లో చతికల పడినప్పటికీ ఇటీవలి శాసనమండళి ఎన్నికల్లో పరిస్థితి కొంత ఆశావహంగా కనిపించడంతో కాంగ్రెస్‌ పార్టీ కూడా గ్రేటర్‌ ఎన్నికలలో కదన కుతూహలం ప్రదర్శిస్తున్నది. జంటనగరాల్లోఉన్న సీమాంధ్ర ఓటర్లు లేదా సెటిలర్స్‌తోపాటు కేంద్ర ప్రభుత్వం అండదండల ప్రభావం వల్ల టిడిపి-బిజెపి కూడా అత్యధిక సీట్లను ఆశిస్తున్నది. పార్టీల వారీగా అభ్యర్థులు బరిలోకి దిగుతున్నప్పటికీ ఆయా కార్పొరేటర్ల నియోజక వర్గాల్లో రాజకీయ పార్టీలతోపాటు వారి వారి వ్యక్తిగత పలుకుబడి, స్వంత బలం-బలగం కొన్ని చోట్లో కులం, మతం కూడా గెలుపు-ఓటములపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయి. కార్పొరేటర్ల సీట్లకు ఆయా రాజకీయ పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహించినప్పటికీ వారి ధనబలం ప్రాతిపదికను పరిశీలించి ఆయా పార్టీలు టికెట్స్‌ ఇచ్చేందుకు నిర్ణ యించుకున్నందున గ్రేటర్‌ పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది. రాష్ట్ర విభజనకు ముందు జంట నగరాల్లో కనీస బలంలేని స్థితిలో గతంలో జరిగిన గ్రేటర్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో కనీసం ఒక్క అభ్యర్థిని కూడా బరిలో దింపేందుకు తెలంగాణ రాష్ట్ర సమితీ సాహసం చేయలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టిఆర్‌ఎస్‌ పార్టీకి గ్రేటర్‌ పరిధిలో పెద్దగా బలం పెరగలేదు. మొత్తంగా గ్రేటర్‌ మున్పిపల్‌ ఏరియా పరిధిలో 23 శాసనసభ నియోజక వర్గాలుండగా, టిఆర్‌ఎస్‌ అతి తక్కువగా కేవలం రెండు సీట్లు మాత్రమే గెలుచుకొని పేలవమైన పరిస్థితిలో ఉండిపోయింది. ఇతర జిల్లా ల్లో అధిక సీట్లు రావడంతో తెలంగాణలో ప్రభుతం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధ్యమైంది. ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఆయా పార్టీల నుంచి కొందరు ఎమ్మెల్యేలు కూడా టిఆర్‌ఎస్‌లోకి దూకేయడంతో పార్టీ బలం క్రమంగా పుంజుకుంది. పైగా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేస్తూ గ్రేటర్‌ను కైవసం చేసుకునేందుకు టిఆర్‌ఎస్‌ వ్యూహరచన చేస్తున్నది. దీనికితోడు ఒక్కో కార్పొరేటర్‌ నియోజక వర్గానికి ఒక ఎంఎల్‌ఎను, అసెంబ్లీ నియోజక వర్గానికి ఒక మంత్రిని ఇన్‌చార్జీగా నియమించి, ఎలాగైనా గ్రేటర్‌ మేయర్‌ పదవిలో టిఆర్‌ఎస్‌ పాగా వేయాలనే లక్ష్యంతో పార్టీ పావులు కదుపుతున్నది. వరంగల్‌ ఉప ఎన్నికల తర్వాత పార్టీ మరింత వేగంగా కదిలి గ్రేటర్‌కు ఎప్పుడు ఎన్నికలు జరిగినా టిఆర్‌ఎస్‌ విజయం సాధించేలా కార్యాచరణకు ముందస్తు రూపకల్పన చేసుకొని ప్రణాళిక రచన చేశారు. ఈ మేరకు ఫీల్‌గుడ్‌ ఫ్యాక్టర్‌ అంటూ టిఆర్‌ఎస్‌ విజయపరంపరను ప్రచారం చేస్తుకుంటోంది. స్వయంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌ చొరవ తీసుకొని ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి మార్గదర్శనం చేశారు.

దీంతోపాటు కెసిఆర్‌ కుమారుడు, రాష్ట్ర మంత్రి కె. తారక రామారావు తనకిచ్చిన గ్రేటర్‌ ఇన్‌చార్జీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఇతర పార్టీ అగ్రనేతలందరికంటే ముందుగా ప్రచారాన్ని ప్రారంభించారు. మారుతున్న పరిస్థితుల్లో తమ విజయం ఖాయమని ఎవరి మద్దతు లేకుండానే పార్టీ మేయర్‌ సీటును గెలుచుకునేందుకు అవసరమైన మెజారిటీని సాధించుకుంటుందనే ధీమాతో పార్టీ నేతలున్నారు. కార్పొరేటర్ల గెలుపుతోపాటు గ్రేటర్‌ పరిధిలోని ఎంఎల్‌ఎలు( ఇతర పార్టీల నుంచి చేరిన వారితో సహా) ఎంఎల్‌సిలు, రాజ్యసభ సభ్యులు, లోక్‌సభ సభ్యులు చివరికి కో-ఆఫ్సన్‌ సభ్యులందరినీ కలుపుకుంటే స్వయంగా మెజారిటీ సాధించుకోవడం పెద్ద కష్టమేమీ కదని వారు లెక్కలు వేసుకుంటున్నారు.

గ్రేటర్‌లో ప్రస్తుత పరిస్థితి టిఆర్‌ఎస్‌కు ఎంతో అనుకూలంగా ఉందని, ఎక్స్‌ అఫిసియో సభ్యులందరిని కలుపుకుంటే ఆధిక్యత సులువుగా వస్తుందని కూడా వాదిస్తున్నారు. పైగా మజ్లిస్‌ పార్టీతో సయోధ్య ఎలాగూ ఉంటుందనేది వారి విశ్వాసం.

సయోధ్యకాదు స్వంత బలంపైనే మజ్లిస్‌ విశ్వాసం
మజ్లిస్‌ పార్టీ ఇప్పటికే తమకు పట్టు ఉన్న ప్రాంతాల్లో ప్రచారం ప్రారంభించింది. హైదరాబాద్‌ అభివృద్ధికి మజ్లిస్‌ ఎంతో కృషి చేస్తున్నదని ప్రతి సమయంలోనూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి పాత బస్తీలో అనేక కార్యక్రమాలు అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా పార్టీ వాదిస్తున్నది.ఈ దఫా కూడా ఎంఐఎం 40 సీట్లకు పైగా గెలుచుకుంటుందని, మేయర్‌ అభ్యర్థిగా ఏ పార్టీ వచ్చే అవకాశాలున్నా, అది మజ్లిస్‌ తోడ్పాటు లేకుండా సాధ్యంకాదని కూడా వారు భావిస్తున్నారు.
టిఆర్‌ఎస్‌తో పొత్తు లేకపోయినా ఏదో విధంగా ఆ పార్టీతో సయోధ్యకు ఎంఐఎం వ్యతిరేకం కాదనే ప్రచారం ఉంది. ఇది ఇరు పార్టీలకు ఉపకరిస్తుందని భావిస్తున్నారు. పార్టీలో గెలుపు గుర్రాలను ఎంపిక చేసి మరిన్ని సీట్లు కైవసం చేసుకునేలా ప్రణాళిక రచన సాగిస్తున్నారు. కార్పొరేటర్ల బలంతోపాటు, ఎంఎలఎలు, ఎంఎల్‌సిలు, ఒక ఎంపీ బలం కూడా మజ్లిస్‌కు ఉంది. దీంతో గ్రేటర్‌లో ఏ ఒక్క రాజకీయ పార్టీకి మెజారిటీ సీట్లు రాకపోతే మజ్లిస్‌ మద్దతు లేకుండా మేయర్‌ సీటును కైవసం చేసుకోవడం సాధ్యం కాదు. దాదాపుగా తమకు మూడో వంతు సీట్లు గ్రేటర్‌లో ఉంటాయని దీంతో ఏ పార్టీ తమను నిర్లక్ష్యం చేయలేదనే ధీమా ఈ పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నది.

కాంగ్రెస్‌లో కదన కుతూహలం
వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్‌ పార్టీశాసనమండళి ఎన్నికల్లో కొంత ఊపిరిపోసుకొని, గ్రేటర్‌ ఎన్నికలకు కదన కుతూహలతో కదులుతున్నది. ఈ మేరకు తెలంగాణకు చెందిన పార్టీ నేతలందరూ ఏకతాటిపై నిలబడ్డారు.

ఇక్కడ విఫలమైతే కాంగ్రెస్‌ ఉనికికే ప్రమాదమని వారికి అర్థం కావడంతో కలిసికట్టుగా ఉండి గ్రేటర్‌ ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. పరోక్ష పొత్తులు ఎంఎల్‌సి ఎన్నికల్లో కొంత ఉపకరించడంతో ఇదే విధమైన వ్యూహంతో కదలాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. స్వంతంగా బలం ఉన్న ప్రాంతాల్లో కలిసి వచ్చే ఇతర పార్టీల మద్దతు తీసుకోవాలని, ఇతర పార్టీలకు అవసరమైన చోట్ల సహకరించుకోవాలని లేనట్లయితే అధికార పార్టీని దెబ్బతీయలేమనే భావం ప్రస్తుతం కాంగ్రెస్‌లో కనిపిస్తున్నది. పిసిసి అధ్యక్షుడు ఉత్తం, ప్రతిపక్ష నాయకుడు కె.జానారెడ్డితో సహా పలువురు కాంగ్రెస్‌ నేతలు గ్రేటర్‌ ఎన్నికల కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని తగిన ప్రణాళిక రచన చేశారు. గెలిచే వారికే టికెట్లు ఇవ్వాలని, నగర నేతలే అభ్యర్థులను ఎంపిక చేసుకొని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఇక తెలుగుదేశం-బిజెపి కూటమి నేతలు సమన్వయం చేసుకుంటే గ్రేటర్‌ బరిలోకి దిగుతున్నారు. ఈ ఎన్నికల్లో తమ సత్తా చూపాలని, పైగా గ్రేటర్‌లో తమ బలం అధికమని, టిడిపి భావిస్తున్నది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ టిఆర్‌ఎస్‌ కంటే టిడిపికే ఎక్కు సీట్లు వచ్చాయని ప్రజల్లో పార్టీకి అధిక ఆధరణ ఉన్నందున గ్రేటర్‌ ఎన్నికల్లో అది ఎంతగానో ఉపకరిస్తుందని టిడిపి నాయకులు చెబుతున్నారు.పైగా కేంద్రప్రభుతంలో భాగస్వామిగా ఉన్న టిడిపితో పాటు బిజెపి కలిసి పనిచేస్తున్నందున ఎన్నికల్లో ఇది ఇరు పార్టీలకు మేలు జరుగుతుందని వారు అంచనా వేస్తున్నారు. సీమాంద్ర ఓటర్లు కూడా అధికంగా ఉన్న ఈ గ్రేటర్‌లో తమ కూటమికి విజయం ఖాయమని, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయని వారు అంచనా వేస్తున్నారు.

కొత్త పొత్తులకు అవకాశం
అధికార టిఆర్‌ఎస్‌ దూకుడుకును అడ్డుకునేందుకు కాంగ్రెస్‌, టిడిపి-బిజెపి కూటమిలు ప్రత్యేక చర్యలకు పాల్పడే అవకాశాలను పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పరోక్ష మద్దతు ఇచ్చుకునేలా లోపాయికారి ప్రయత్నం చేసేందుకు చర్యలు తీసుకోనున్నాయి. ఈ విషయాన్ని ఆయా పార్టీలువెంటనే అంగీకరించకపోయినా, ఎంఎల్‌సి ఎన్నికల సందర్భంగా అవిఅవలభించిన విధానాలే నేడు గ్రేటర్‌ ఎన్నికల్లోనూ కొనసాగించుకుంటాయని భావిస్తున్నారు. ఏ పార్టీ అభ్యర్థి బలంగా ఉంటే ఇతర పార్టీల వారు ఆయనకు మద్దతు ఇచ్చి అధికార పార్టీ ఓటమికి ఎలా ఏకోన్ముఖులు కావాలో బడా నేతలు తర్జనభర్జన పడుతున్నారు. టిఆర్‌ఎస్‌ అవలంభిస్తున్న పద్దతిని ఈ పార్టీల నేతలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలను బతకనీయకుండా ఆకర్ష్‌్‌ మంత్రం ఉపయోగించడం వీరికి రుచించడం లేదు. దీంతో గ్రేటర్‌ ఎన్నికల ద్వారా ఒక ప్రయోగం చేయాలనేది వారి ప్రయత్నంగా చెబుతున్నారు.ఇది ఈ మూడు పార్టీలకు ఎంతవరకు ఉపకరిస్తుందో వేచి చూడాల్సిందే. అయితే ఈ మూడు పార్టీలకు పోటీగా అన్నట్లుగా టిఆర్‌ఎస్‌, ఎంఐఎం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లు కూడా పరోక్ష మద్దతులు ఇచ్చుకునే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు. వరంగల్‌ ఉప ఎన్నికల్లో భారీ ఆధిక్యత సాధించిన టిఆర్‌ఎస్‌ గతంలో అవలంభించిన విధానాలను తిరిగి పాటించే అవకాశాలున్నాయి.