ఎవరినీ కించపరచని గాంధీ సేవాతత్పరత

GANDHI11
MahatMa Gandhi

ఎవరినీ కించపరచని గాంధీ సేవాతత్పరత

మాన్యంగా పరిచారకులు చేసే రకరకాల పనులను గాంధీజీ తమ ఆశ్రమంలో తామే స్వయంగా చేసే వారు. తాను వకీలుగా వేలాది రూపాయలు సంపా దిస్తున్న రోజులలో కూడా ఆయన ప్రతి ఉదయం గోధుమలు తిరగలి పట్టేవారు. కస్తూరి బా పిల్లలు కూడా తిరగలి పనిలో పాల్గొనేవారు. దానిమూలంగా వారి కుటుంబానికి నిత్యం చపాతీలు చేయడానికి కావలసిన ముతక, మెత్తని గోధుమ పిండి లభించేది. ఇదే ఆలవాటును గాంధీజీ సబర్మతి ఆశ్రమంలో కూడా కొనసాగించారు. తిరగలిని బాగు చేయడానికి ఆయన గంటల తరబడి పనిచేసేవారు.తిరగలి పట్టేముందు గోధుమలలోని రాళ్లను ఏరివేయాలని చెప్పేవారు.ఆవిషయంలో చాలా శ్రద్ధ వహించేవారు.
ఆశ్రమానికి బయటి వారు వచ్చినప్పుడు కూడా గాంధీజీ కాయ కష్టం చేయడానికి సిగ్గుపడేవారు కాదు. ఒకసారి ఒక కార్యకర్త ఆశ్రమంలో పిండి అయిపోయిందని అనగానే వెంటానే గాంధీజీ గోధుమలను తిరగలి పట్టడానికి తయారయ్యారు. తన ఇంగ్లీషు భాష పరిజ్ఞానం యెడల గర్వంగల ఒక కళాశాల విద్యార్థి గాంధీ గారి వద్దకు వచ్చాడు. సంభాషణలు ముగిసిన తర్వాత ఆ విద్యార్థి బాపూజీతో బాపూజీ నేను మీకు చేయగల సేవ ఏదైనా వ్ఞంటే సెలవివ్వండి అనిఅన్నాడు.తనకు సాహిత్యపరమైన పని అప్పగిస్తా రని అనుకున్నాడా విద్యార్థి. ఈవిషయాన్ని గ్రహించిన గాంధీజీ సరే అయితే ఈ పళ్లెంలో ఉన్న గోధుమలలోని రాళ్లను ఏరండి అని అన్నారు. ఆ విద్యార్థి కంగారుపడ్డాడు. ఒక గంట సేపాపని చేసి అలసిపోయి ఆ పనిని వదులుకున్నాడా విద్యార్థి. గాంధీజీ ఉద్దేశం అతనిని కించపరచాలని కాదు. ప్రతి ఒక్కరూ అన్ని పనులు చేయడానికి సిద్ధపడాలనే సత్యాన్ని గాంధీజీ బోధించదలి చారు. కొన్ని సంవత్సరాలు గాంధీజీ గిడ్డంగి పనులలో సహాయకు ని గా పనిచేశారు. ఉదయం ప్రార్థనలు ముగించుకున్న తర్వాత ఆయన వంటశాలలో కూరగాయలు తరిగే పని నిర్వహించేవారు. వంటశాలలో గానీ, గిడ్డంగిలోగానీ ఎక్కడన్నా కొంచెం చెత్త లేక బూజు ఆయన కంటబడితే ఆయన తన సహచరులను గట్టిగా మందలించేవారు.పప్పులు,పండ్లు,ధాన్యాలు, కూరగాయల పోషక విలువలు గురించి గాంధీజీకి క్షుణ్ణంగా తెలిసివ్ఞండేది.
ఒకసారి ఒక ఆశ్రమవాసి బంగాళా దుంపలను కడగకుండా తరిగాడు. అప్పుడు గాంధీజీ అతనికి నిమ్మకాయలను, బంగాళాదుంపలను తరగక మునుపు ఎందుకు కడగాలో వివరంగా తెలియచేశారు. మరొకసారి ఒక ఆశ్రమవాసికి తోలుమీద నల్లచుక్కలున్న అరటిపండునిస్తే ఆ వ్యక్తి చిన్నబుచ్చుకోవడాన్ని గాంధీజీ గ్రహించారు.ఆ అరటిపండు జీర్ణకోశానికి లాభదాయకం కనుక ఇచ్చానన్నారు. గాంధీజీ స్వయా నా ఆశ్రమవాసులకు భోజన పదార్థాలు వడ్డించేవారు. కనుక వారికి ఆ చప్పిడి భోజనంగురించి మొరపెట్టుకునే అవకాశముండే దికాదు. దక్షిణాఫ్రికా జైళ్లలో ఉంటున్నప్పుడాయన ప్రతిరోజూ రెండుసార్లు వందలాది ఖైదీలకు భోజనాలు పంచిపెట్టేవారు. ఎవరి గిన్నెలు, పళ్ళాలను వాళ్లే కడుగుకోవాలని ఆశ్రమ నియ మం,వంటశాల అంట్లనువంతులవారీగా ఆశ్రమవాసులు కడిగేవా రు. మసిబారిన ఇక పెద్ద బరువైన మూకుడును గాంధీజీ ఒకసారి తానే తోమసాగారు. బూడిదతో దాన్ని బాగా రుద్దతున్నారు. కస్తూరి బా దృష్టికి అనుకోకుండా ఆ పని కనిపించింది. ఆమె వెంటనే ఆ మూకుడును లాక్కుని ఇది మీ పని కాదు. ఇది చేయ డానికి ఇతరులు చాలా మంది ఉన్నారు అన్నారు. ఊరకుండడమే మంచిదని గ్రహించి గాంధీజీ ఆ పనిని కస్తూరిబాకు అప్పచెప్పారు. ఇత్తడి వస్తువ్ఞలు చక్కగా మెరుస్తూ ఉండకపోతే గాంధీజీకి తృప్తి ఉండేదికాదు. జైలులో ఉంటున్నప్పుడు ఒక సహాయకుడు చేసిన పని గాంధీజీకి నచ్చలేదు.

అప్పుడాయన ఇనుప పాత్రలను కూడా వెండిలాగా మెరిసేటట్టు ఏ విధంగా తోమవచ్చునో అతనికి తెలియచెప్పారు. ఆశ్రమ భవనాన్ని నిర్మిస్తున్నప్పుడు కొంత మంది అతిధులు గుడారాలలో నిద్రించవలసివచ్చింది. కొత్తగా వచ్చిన ఒకతను తానెక్కడ నిద్రించాలో తెలియక తన పరుపును చుట్టి, ఒకపక్కన పడేసి తనకు పక్క చూపమని అడగడానికి వెళ్లాడు. అతను తిరిగి వచ్చేటప్పటికి గాంధీజీ ఆ పరుపు చుట్టను భుజాన మోస్తూ ఆశ్రమ ఆవరణలో కనిపించాడు. ఆ అతిథి సిగ్గుపడి వారించినా గాంధీజీ ఫర్వాలేదన్నారు. సేవ చేయడమే గాంధీజీ పరమావధి. దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు బోయర్‌ యుద్ధం జరుగుతున్న రోజులలో ఆయన గాయపడిన సైనికులను స్ట్రెచర్‌పై మోస్తూ రోజుకు 25 మైళ్లు నడిచేవారు. టాల్‌స్టా§్‌ు ఆశ్రమంలో వ్ఞంటున్న రోజులలో ఆయన అనేకసార్లు రోజుకు 42 మైళ్లు నడిచేవారు. ఇంట్లో వండిన తినుబండారాలను తీసుకుని రాత్రి రెండు గంటలకు బయలుదేరి వెళ్లి బజార్లో సామాన్లు కొనుగోలు చేసి సాయంత్రానికి తిరిగి వచ్చేవారు. ఆయన మిత్రులు, యువ ఆశ్రమవాసులు ఆయనను సంతోషంగా అనుసరించేవారు. దక్షిణాఫ్రికాలోని భారతీయుల సుప్రసిద్ధ నాయకునిగా ప్రవాస భారతీయుల సమస్య గురించి బ్రిటిష్‌ ప్రభుత్వంతో సంప్రదించ డానికి గాంధీజీ ఒకసారి లండన్‌ వెళ్లారు. తామే స్వయంగా శాకా హారభోజనం తయారు చేసి గాంధీగారిని విందుకు ఆహ్వానించాలని అక్కడివారు నిశ్చయించుకున్నారు. అప్పటికి వారు గాంధీజీని చూసి ఎరుగరు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఒక బక్కపలచని వ్యక్తి వారికి పాత్రలు కడగడంలో కూరగాయలు తరగడంలో సహాయం చేశాడు. ఆ తర్వాత విద్యార్థి నాయకుడు అక్కడకు వచ్చాక తమకు సహాయం చేసిన ఆ బక్కమనిషి మరెవరో కాదు తమ అతిధి దేవ్ఞడే అని తెలిసింది. దాంతో వాళ్లు చాలా సిగ్గుపడ్డారు.

గాంధీజీకి పట్టుదల ఎక్కువేకానీ ఇతరులు తన కోసం కష్టించడం ఆయనకు నచ్చేదికాదు. ఒక రాజకీయ సమా వేశానంతరం రాత్రి పది గంటలకు పడుకోబోయేముందు గాంధీజీ తన గది వూడ్చుకోవడం కొంతమంది చూశారు. ఆయన అనుయా యి ఒకతను సహాయం చేయడానికి వెళ్లగా గాంధీజీ వద్దన్నారు. గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు దీపంలో నూనె అయిపోతే ఉత్త రాలు వెన్నెల కాంతిలో రాసేవారు. అంతేగానీ అలసి నిద్రిస్తున్న తన సహచరులను లేపేవారుకాదు. తన నౌఖాలీ యాత్రలో ఆయన కేవలం ఇద్దరు వ్యక్తుల్నే తనతో వ్ఞండనిచ్చేవారు. వారికి ఖక్రా (గుజరాతీ వంటకం) ఏ విధంగా చేయాలో తెలియదు. అప్పుడు గాంధీజీ వంటశాలలో ఒక నిపుణుడిగా కూర్చుని ఖక్రా చేసి చూపారు. అప్పుడాయన వయసు 78 సంవత్సరాలు. పెద్దల పట్ల గాంధీజీకి అపరిమిత గౌరవం ఉండేది. గోఖలేగారు ఆయనకు అతిథిగా ఉన్నప్పుడు గాంధీజీ ఆయన కండువాలను ఇస్త్రీచేసి పెట్టేవారు. ఆయన పడక సవరించి పెట్టేవారు. భోజనం వడ్డించేవారు.ఆయన కాళ్ళు పిసికేవారు. గోఖలేగారు వద్దని వారిం చినా గాంధీజీ పట్టించుకునేవారు కాదు. మహాత్మునిగా అవతరిం చక మునుపు కాంగ్రెస్‌ సదస్సులో పాల్గొనడానికి ఆయన ఒకసారి దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి వచ్చారు. మరుగుదొడ్లను బాగు చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ నాయకుడిని తనకేమన్నా పని ఉందా అని అడిగారు. అందుకానాయకుడు ఉత్తరాల దొంతరలు పడివ్ఞన్నాయి. అప్పచెప్ప డానికి గుమస్తాలు ఎవ్వరూ లేరు. మీరా పనిచేస్తారా? అని అడిగారు. తప్పకుండా నాశక్తికి మించినది కానిది ఏపనినైనా చేయ డానికి సిద్ధమేనని అన్నారు గాంధీజీ. అనతికాలంలోనే ఆ పనిని నిర్వర్తించారు.

పైగా ఆ నాయకుని చొక్కా బొత్తాములు సరిచేయ డం లాంటి పనులు కూడా చేశారు. అస్పృశ్యతను నిర్మూలించాలనే ఉద్దేశంతో ఆశ్రమంలో నౌకరు కావలసి వచ్చినప్పుడు హరి జనుడినే నియమించాలని గాంధీజీ శాసించేవారు. మనం మన సేవకులను కూలీవారుగా కాక సోదరులుగా భావించాలనేవారా యన. దీనిలో కొంత ఇబ్బంది కలగవచ్చును. కొన్ని దొంగతనాలు జరగవచ్చును. ఎక్కువ ఖర్చులు రావచ్చును. అయినప్పటికీ మన కృషి నిష్ఫలితంకాదు. తనకు బంటుగా ఎవరినన్నా వ్ఞంచుకొనడం గాంధీజీకి తెలియదు. కాని జైలులో ఆయన వద్దంటున్నా తోటి ఖైదీ లెంతమందో ఆయనకు సేవలు చేసేవారు. ఒకడు తినడానికి పండ్లు శుభ్రం చేసి ఇచ్చేవాడు. మరొకరు మేక పాలు పితికేవాడు. ఇంకొకరు ఆయనకు బంటుగా ఉండేవారు. మరొకరు మరుగుదొడ్డి బాగు చేసేవాడు. ఒక బ్రాహ్మణ ఖైదీ ఆయన పాత్రలు తోమేవారు. ఇద్దరు యూరోపియన్‌ ఖైదీలు ఆయన మంచం బయటకు తెచ్చి పెట్టేవారు. తన పనులు తాను చేసుకోగలనని గాంధీజీ వారించే వారు. అయితే వారి అభిమానం ముందు గాంధీజీ విన్నపాలు చెల్లేవికావ్ఞ. ఇంగ్లాండులో గొప్ప వారిళ్లలో యజమానులు సేవకుల నడుమ ఒక కుటుంబ వాతావరణాన్ని చూసి గాంధీజీ చాలా సంతోషించేవారు. తానొకసారి అతిథిగా వ్ఞంటున్న గృహస్థు తన నౌకర్లను తనకుటుంబ సభ్యులుగా తనకు పరిచయం చేసినప్పుడు అమితానందం పొందారు. ఒకసారి ఒక భారతీయ గృహస్తుని ఇంటిలో అతిథిగా ఉండి వెళ్లిపోతున్నప్పుడు గాంధీజీ ఆ ఇంటి నౌకర్లకు ధన్యవాదాలు తెలుపుతూ నేను నా జీవితంలో ఎన్నడూ ఎవరినీ నా నౌకరుగా భావించలేదు. వారిని నా తోడబుట్టినవారు గానే భావించాను. మీరంతా కూడా నాకు సోదరులే. మీ సేవలకు నేరుగా ప్రతిసేవ అందించలేను. కానీ భగవంతుడు మిమ్ములను తగు రీతిని దీవిస్తాడు అని ఆశీర్వదించారు.

మణిభూషణ్‌