ఎలక్ట్రానిక్‌ వాహనాలపై ఉబర్‌తో మహీంద్రా ఒప్పందం

uber
uber

ముంబై: దేశంలోని పలు నగరాల్లో ఉబర్‌ ప్లాట్‌ఫామ్‌పై ఎలక్ట్రానిక్‌ వాహనాలను అందజేయడానికి ఆ సంస్థతో మహీంద్రా అండ్‌ మహీంద్రా శుక్రవారం
ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ప్రారంభంలో ఉబర్‌ ఢిల్లీ, హైదరాబాద్‌లో కొన్ని వందల ఎలక్ట్రానిక్‌ వాహనాలను రంగంలోకి దించుతుంది. వచ్చే
ఫిబ్రవరి నాటికి ఈ మొదటి విడత వాహనాలు రోడ్లపైకి రానున్నాయి. మొదటి మూడు నెలలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ వాహనాలు రోడ్లపై
నడవడానికి వీలుగా అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవడానికి ఉపయోగించుకుంటారు. ఉబర్‌ ప్లాట్‌ఫామ్‌పై లభించే మహీంద్రా
ఎలక్ట్రానిక్‌ వాహనాలలో ఇ2ఓప్లస్‌ హ్య్చట్‌బ్యాక్‌ ఈ-వెంటో సెడాన్‌ ఉంటాయి. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో కూడా కంపెనీ దశలవారీగా ఈ వాహనాలను ప్రవేశపెడుతుంది. ఉబర్‌ ప్రత్యర్థి ఓలా ద్వారా ఢిల్లీలో ఎలక్ట్రానిక్‌ వాహనాలను ప్రవేశపెట్టడానికి టాటాగ్రూప్‌, జయెమ్‌ ఆటో మోటార్స్‌ మధ్య ఒప్పందం కుదిరిన రెండురోజుల్లోగానే మహీంద్రా అండ్‌ మహీంద్రాకు ఉబర్‌కు మధ్య అలాంటి ఒప్పందమే కుదరడమే గమనార్హం. దేశంలో ఎలక్ట్రానిక్‌ వాహనాలకు కంపెనీలు, వినియోగదారులు మారడం శరవేగంగా ఊపందుకుంటోందని ఈ సందర్భంగా ఎంఅండ్‌ఎం ఎండి పవన్‌ గోయంక చెప్పారు. వాహనాల తయారీ దారులతో సహా, ప్రభుత్వాలు కూడా మద్దతు అందించడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో పరిశ్రమ ఈ దిశగా మారాల్సిన అవసరం కనిపిస్తోందని ఆయన అన్నారు. మార్పులకు ఎప్పుడు ముందుండే మహీంద్రా ఈ దిశలో కూడా మొదటగానే స్పందిస్తోందని ఆయన అంటూ ఉబేర్‌తో తమ సహకారం ఈ దిశగా ఒక గొప్ప ముందడుగని అన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా ఉబేర్‌ యాప్‌పై డ్రైవర్‌ భాగస్వామ్యం మహీంద్రా ఎలక్ట్రానిక్‌ వాహనాలపై ఆకర్షణీయమైన ధరల ప్యాకేజీ సహా ఫైనాన్సింగ్‌, బీమా ప్రీమియంలతో పాటు సమగ్రమైన మెయింటనెన్స్‌ ప్యాకేజీని కూడా పొందగలుగుతారు. ఈ ఒప్పందం విజయవంతం కావడంకోసం రెండు సంస్థలు నగరాల్లో, వివిధ ప్రాంతాల్లో ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలతో కలిసి పనిచేస్తాయి. ప్రస్తుతం నెలకు 500ఎలక్ట్రానిక్‌ వాహనాలను ఉత్పత్తి చేస్తున్న మహీంద్రా సంస్థ తమ ఉత్పత్తి సామర్ధ్యాన్ని 5000కు పెంచబోతోంది. నాగ్‌పూర్‌లో ఇప్పటికే ఓలా భాగస్వామ్యంతో మహీంద్రా వందలాది ఎలక్ట్రానిక్‌ వాహనాలను క్యాబ్‌ సర్వీసులలో ప్రవేశపెట్టింది. అవి ఇప్పటికే దాదాపు 80లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగాయి కూడా. ఈ పథకం అద్భుతాల విజయం సాధించడంతో న్యూఢిల్లీ, హైదరాబాద్‌ నగరాలకు దీన్ని విస్తరిస్తున్నామని గోయంకా చెప్పారు.