ఎన్నిలకు ముందస్తు వేడి

TS ELE

ఎన్నిలకు ముందస్తు వేడి

టిఆర్‌ఎస్‌పై కాకపెంచిన కాంగ్రెస్‌
ఎదురుదాడితో అధికార పక్షం

హైదరాబాద్‌: తెలంగాణలో రాజకీయ వేడి ముందస్తుగా కనిపిస్తున్నది. సాధారణ ఎన్నికలకు ఇంకా 18 నెలల సమయం ఉన్నప్పటికీ ప్రతిపక్ష, అధికార పక్షాల మధ్యమాటల యుద్ధం జరుగుతున్నది. తాజాగా మరింత ఉత్సాహంతో కాంగ్రెస్‌ నేతలు జడ్జర్ల వేధికగా అధికార టిఆర్‌స్‌ను టార్గెట్‌ చేసి తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించారు. దశలవారీగా పలు కార్యక్రమాలు చేపట్టి తెలంగాణలో తామే ప్రత్యామ్నాయమని నిరూ పించేలా కాంగ్రెస్‌ నడుంకడుతున్నది. ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని తెలంగాణకు ఆహ్వా నించి పలు బహిరంగ సభలు నిర్వహించాలని, రాష్ట్రంలోని టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలను ఎండగట్టి, ప్రజాబలాన్ని కూడగట్టాలని ప్రతిపాదిస్తున్నారు. టిఆర్‌ఎస్‌ ఎన్నికల మ్యాని ఫెస్టో అమలులో విఫలమవుతున్న అంశాలనే కీలక ఎజెండాగా తీసుకొని ప్రజల్లో ప్రచారం పెంచాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్‌ నేతలు జడ్జర్ల బహిరంగ సభలో ప్రభుత్వ వైపల్యాలను ప్రస్తావించి ప్రభుత్వంపై పెద్దయెత్తున దాడిని ప్రారంభించారు.కాగా ఈ సభలో కాంగ్రెస్‌ నేతలు చేసిన ఆరోపణలు లేదా విమర్శలే వచ్చే ఎన్నికల వరకు కొనసాగనున్నాయి.

దీనికి అదనంగా రెండో మూడో అంశాలను చేర్చగలరు కానీ కీలకంగా ఇవే విషయాలు ఎన్నికల ప్రచారంలోనూ ప్రస్తావించే అవకాశాలున్నాయి. అయితే ఎన్నికల వాగ్దానాల్లోని కీలక అంశాలను ఇంకా ప్రభుత్వం నెరవేర్చలేకపోయినందున సహజంగానే ప్రతిపక్షాలు వాటిని ఎత్తిచూపే ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్‌కు తోడు భారతీయ జనతాపార్టీ కూడా కార్యాచరణతో సిద్ధమవుతున్నది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, ఈ మేరకు ఎన్ని కల్లో విజయంకోసం వ్యూహరచన సాగిస్తున్నారని ఆ పార్టీ నేతలు నమ్మకంగా చెబుతున్నారు. గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం తర్వాత అత్యధిక రాష్ట్రాల్లో బిజెపి పాగావేసి నేపథ్యంలో ఇక ఇతర రాష్ట్రా ల్లోనూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ అగ్రనాయకత్వం చర్యలు ప్రారంభించిందని అంటున్నారు.

కాగా మరో పక్క టిజెఎసి ఛైర్మన్‌ కోదండరాం ఏదోఒక సమస్యతో ప్రజల్లో మమేకం అవుతూ అధికార టిఆర్‌ఎస్‌ పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇతర పార్టీల కంటే టిఆర్‌ఎస్‌కు కోదండనే అధిక సమస్యగా మారి, కొరకరాని కొయ్యగా మారారని భావస్తున్నారు. వామపక్షాల్లో చీలక అనివా ర్యంగా కనిపిస్తున్నందున వచ్చే ఎన్నికల్లో సిపిఐ, సిపిఎం విడివిడిగానే బరిలో దిగే అవకాశాలు న్నాయి. సిపిఎం తమతో కలిసివచ్చే పార్టీలతో పోటీకి సిద్ధమవుతుండగా, సిపిఐ మాత్రం కాంగ్రెస్‌, ఇతర పార్టీల సయోధ్యతో రంగంలో ఉంటుందని అంటున్నారు. అయితే ఈ పార్టీలేవీ తమకు పోటీ కాదని వారి ఆరోపణలకు విలువ లేదనే విధంగా అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ ఎదురు దాడికి దిగుతున్నది. అధికార, విపక్ష నేతల వాడివేడి విమర్శల పర్వంలో శీతాకాలంలో తెలంగాణ రాజకీయం గరంగరంగా మారింది.

పెరిగిన రాహుల్‌ గ్రాప్‌ అదనపు ఆకర్షణ గుజరాత్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించకపోయినప్పటికీ తమ నేత రాహుల్‌ గాంధీ గ్రాఫ్‌ పెరగడానికి ఈ ఎన్నిక ఉపకరించిందని కాంగ్రెస్‌ నేతలు హర్షం వ్యక్తం చేస్తూ, ఇదే పెట్టుబడిగా వచ్చే ఎన్నికల్లో రాహుల్‌ నాయకత్వాన్ని దేశ ప్రజలందరూ కోరుకుంటారని వారు భావిస్తున్నారు. రాహుల్‌ గాంధీని తెలంగాణకు ఆహ్వానించి పలు కార్యక్రమాలు నిర్వహించి, ప్రజలను ఆకట్టు కోవడానికి ప్రయత్నించాలని తెలంగాణ కాంగ్రెస్‌ ప్రయత్నిస్తున్నది. పైగా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీని వచ్చేఎన్నికల్లో ప్రజలు ఆదరించడానికి సహేతుక కారణాలను వివరించేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తున్నది.

వరుసగా ఎన్నికల వాగ్దానాల అమలులో టిఆర్‌ఎస్‌ విఫలమైందని వెల్లడించేందుకే కాంగ్రెస్‌ అధికంగా కసరత్తుచేస్తున్నది. ఇందులో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీ మొదటి ప్రయత్నంగా బుధవారం జడ్జర్లలో బహిరంగ సమావేశం నిర్వహించి, భారీ విమర్శల దాడితో టిఆర్‌ఎస్‌కు సవాల్‌ విసిరింది. పనిలో పనిగా జడ్జర్ల అసెంబ్లీ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వైద్యఆరోగ్య శాఖా మంత్రి లక్ష్మారెడ్డిని లక్ష్యంగా చేసి, కాంగ్రెస్‌ నేతలు విసిరిన సవాళ్ల లాంటి ఆరోపణలతో మంత్రి ఢిపెన్స్‌లో పడిపోయినట్లయింది. నేరుగా వ్యక్తిగత విమర్శలతో కాంగ్రెస్‌ నేతలు మంత్రిని దుయ్యబట్టారు. బుధవారం జరిగిన జడ్జర్ల జనగర్జన బహిరంగ సభ కాంగ్రెస్‌ పోరాటానికి తొలిమెట్టుగా ఆ పార్టీ నేతలు అభివర్ణించారు. ఇక నుంచి వరుసదాడులతో అధికారపార్టీని ఇరకా టంలో పెట్టేందుకు ప్రయత్నిస్తామని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడ తామని పార్టీ సీనియర్‌ నేత ఒకరుతెలిపారు. కాంగ్రెస్‌ చేస్తున్న విమర్శలలో అతికీలకమైనదిగా వారు చెబుతున్న కుటుంబపాలన. ఆ నలుగురే ప్రధాన భూమిక నిర్వహిస్తున్నట్లుగా కాంగ్రెస్‌ ద్వజమెత్తుతున్నది. అయితే కుటుంబ పాలనపై కాంగ్రెస్‌ మాట్లాడటాన్ని టిఆర్‌ఎస్‌ అతి తేలికగా కొట్టిపారేస్తున్నది. కాంగ్రెస్‌ జాతీర నాయకత్వమై వారసత్వంతో కూడినదని, రాహుల్‌ ఎలా అధ్యక్షుడయ్యారని ఎదురుదాడితో టిఆర్‌ఎస్‌ కూడా ప్రతివిమర్శలు చేస్తు న్నది. ఒక అవినీతి విషయంలో ఎవరికి ఎవరు తీసిపోనట్లుగా ఆరోపణలు చేసుకుంటున్నారు.

కాగా డబుల్‌ బెడ్‌ రూం పథకం, దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణీ, కెజి టు పిజి ఉచిత విద్య, అందరికీ నాణ్యమైన వైద్యం వంటి కీలక విషయాల్లో వచ్చే విమర్శలదాడికి మాత్రం టిఆర్‌ఎస్‌ డిఫెన్స్‌లో పడిపోయే అవకాశాలున్నా, ఉన్నంతలో అధికంగా ఆ పనులు చేస్తున్నట్లుగా పాలకపక్షం తన వాదనను కొనసాగిస్తున్నది. ఆత్మరక్షణలో లక్ష్మారెడ్డి జడ్జర్ల బహిరంగ సభలో కాంగ్రెస్‌ మంత్రి లక్ష్మారెడ్డిపై అనేక విమర్శలు చేయగా మంత్రి వాటికి సమాధానం ఇచ్చేందుకు గురువారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి డాక్టర్‌ కాదని రేవంత్‌చేసిన విమర్శకు తగిన సమాధానం చెప్పలేకపోయారు.కనీసం 100 పడకల ఆస్పత్రిని తీసుకురాలేకపోయిన మంత్రి ఉండి ఏమిలాభం అని రేవంత్‌ దుయ్యబట్టినా ఇదిసాధిస్తామని గట్టిగా మంత్రి చెప్పలేదు. అవినీతి విషయంలో షరా మామూలే.

రియల్‌ఎస్టేట్‌ రంగంలో అధికంగా గడిస్తున్న మంత్రి అంటూ రేవంత్‌ ఆరోపణలను అవునంటూ వ్యాపారం చేస్తున్నానని మంత్రి వివరిం చారు. వ్యక్తిగత విమర్శలు చేయరాదని అంటూనే మంత్రి కూడా రేవంత్‌పై వ్యక్తిగతంగానే తీవ్ర విమర్శలు చేయగం గమనార్హం. టిఆర్‌ఎస్‌కు కొత్త ఓటు బ్యాంకు తెలంగాణ రాష్ట్ర సమితికి గత ఎన్నికల్లో లేని కొత్త ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల్లో అదనపు బలాన్ని చేకూర్చనుంది. అందుకే ఆ పార్టీలో మరింత ధీమా కనిపిస్తున్నది. 2014 సాధారణ ఎన్నికల్లో ఈ ఓటు బ్యాంకు లేనందు వల్ల అతి తక్కువ సీట్లు వచ్చి, బొటాబొటి మెజారిటీతో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జంటనగరాల్లో టిఆర్‌ఎస్‌ ఆనాడు తీవ్రంగా దెబ్బతింది. ఈ లోటును ముందస్తుగానే గ్రహించిన పార్టీనాయకత్వం గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల నాటికే వ్యూహరచన చేసి విజయం సాధించింది.

సెటిలర్స్‌ ఓట్లు కీలకంగా భావించి ఆ వర్గాలను ఆకట్టుకునేందుకు టిఆర్‌ఎస్‌ అన్నివిధాలుగా ప్రయత్నించి, ఆ ఓటు బ్యాంకును కొల్లగొట్టినట్లుగా గ్రేటర్‌ ఎన్నికలు రుజువు చేసినందున ఈ వర్గాలను ఇక దూరం చేసుకోకుండా ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.జంట నగరాలకుతోడు పాత నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం జిల్లాలకుతోడు నల్లగొండ జిల్లాలోనూ కొంతమేరకు సెటిలర్ల ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికలకు కలిసి వస్తుందని టిఆర్‌ఎస్‌ గట్టి విశ్వాసంతో ఉంది.

కాగా ముస్లిం మైనారిటీల అండదండలు కూడా టిఆర్‌ఎస్‌కు కొనసాగుతున్నాయి. ఈ రెండు కూటములకుతోడు బిసిల కూడా టిఆర్‌ఎస్‌ వైపు తిప్పుకోవడానికి అనేక పథకాలను ప్రత్యేకంగా రూపొందించి అమలు చేస్తున్నారు. ఎస్టీల రిజర్వేషన్‌ పెంపుదల అంశం కొంత వెనుకబడినప్పటికీ వారి సమస్యపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. కేంద్రం ఆధీనంలోని రిజర్వేషన్ల విధానం వల్ల టిఆర్‌ఎస్‌ ప్రతిపాదించిన ముస్లింల,గిరిజనలు రిజర్వేషన్‌ పెంపుదల ప్రక్రియ వెనుకబడిపోతున్నది.

పైగా గుజరాత్‌ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడి రిజర్వేషన్‌ పెంపుదలపై గట్టి నిర్ణయమే ప్రకటించారు. 50శాతానికి మించి రిజర్వేషన్‌ ఇవ్వడం సాధ్యం కాదని ప్రధాని ఈ సదర్భంగా ఘంటాపథంగా వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే రిజర్వేషన్ల పెంపుదల సమస్య తెలిసినందున ముస్లిం వైనారిటీలు పెద్దగా టిఆర్‌ఎస్‌నుతప్పుపట్టే అవకాశాలుండవని,ఇది ఎన్నికల్లో ఇబ్బంది కాదనే టిఆర్‌ఎస్‌ నేతలు భావిస్తున్నారు. అయితే విపక్షాలు మాత్రం అమలు కానీ హామీల పద్దుకింద వాటిని చేర్చి పాలకపక్షంపై విమర్శలు పెంచే అవకాశాలున్నాయి. 2014 ఎన్నికలకు బిన్నంగా వచ్చే ఎన్నికలుంటాయని ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపి ప్రజలను ఆకట్టుకుంటామని ప్రతిపక్షాలు ఆశాభావంతో ఉన్నాయి.

పైగా 2014లో ఉద్యమ వాతావరణం ఉన్న సమయంలోనే టిఆర్‌ఎస్‌కు కేవలం 63 అసెంబ్లీ సీట్లు వచ్చాయని, ప్రజాస్వామ్య సంప్రదాయాలకు తిలోదకాలిచ్చి, పిరాయింపులను ప్రోత్సహించి టిఆర్‌ఎస్‌ అసెంబ్లీలో బలం పెంచుకున్నదని, ఈ దుష్ట సంప్రదాయాన్ని కూడా ఎన్నికల పచారంలో తాము వివరిస్తామని కాంగ్రెస్‌ నేత ఒకరు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు తోడు బిజెపి,ఇతర కూటములతో పాటు టిడిపి, ఎన్నికల బరిలో ఉంటే జరిగే బహుముఖ పోటీలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల చీలిక తప్పనిసరిగా టిఆర్‌ఎస్‌కు ఉపకరిస్తుందనే విశ్లేషణలు ముందుకు వస్తున్నాయి. కాగా ఎన్నికల నాటికి ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో, ఏఏ పార్టీల మధ్య సయోద్య కుదురుతుందో అంచనా వేయడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదని అంటున్నారు. టిడిపితో టిఆర్‌ఎస్‌ పొత్తు ఉంటుందనే ఆగ్రహంతో రేవంత్‌ రెడ్డి ఇప్పటికే ఈ విషయం స్పష్టం చేసి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఒక తెలంగాణ ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తున్న బిజెపితో కూడా తర్వాతి దశలో స్నేహంఉంటుందా అనేది చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఉన్న అన్ని అడ్డంకులను కేంద్రం తొలగించి,

టిఆర్‌ఎస్‌కు అనుకూల నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి కెసిఆర్‌ కూడా కేంద్రం తీసుకున్న అన్ని కీలక నిర్ణయాలకు మద్దతు తెలపడంతో వారి మధ్య సయోధ్య పరోక్షంగా ఉండే అవకాశాలను పరిశీలకులు కొట్టివేయడం లేదు. కానీ ఒకేసారి బిజెపి, ఎంఐఎంతో పొత్తు ఎలా ఉంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ దఫా ఎలాగైనా తెలంగాణలో తమదే అధికారం అంటున్న కాంగ్రెస్‌ ఒక వైపు అనేక ఎత్తులు, జిత్తులతో టిఆర్‌ఎస్‌ ఎన్నికల బరిలో దిగుతున్నందున పరిస్థితి ఆసక్తికరంగా మారింది,