ఎన్నిక‌ల ప్ర‌చారానికి ఆమ్ ఆద్మీకి ఆహ్వానం

KODANDARAM
KODANDARAM

హైదరాబాద్‌: వచ్చే ఎన్నికలలో ఆమ్‌ ఆద్మీ పార్టీని, యోగేంద్ర యాదవ్‌ను ప్రచారానికి వినియోగించుకుంటామని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరాం అన్నారు. ఈ నాలుగేళ్లలో ప్రజల నమ్మకాన్ని మేం కూడగట్టుకుంటే ప్రజల అపనమ్మకాన్ని కేసీఆర్‌ మూటగట్టుకున్నారని పేర్కొన్నారు. బుధవారం కోదండరాం జన్మదినం సందర్భంగా నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కేసీఆర్‌ సభలకు జనాన్ని తెస్తే తాము జనం దగ్గరకు పోయి పలకరిస్తామనీ, పది రోజుల్లో తెలంగాణ మొత్తం తిరిగే సత్తా తమ పార్టీకి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం టీజేఎస్‌ను రాజకీయ పార్టీగా గుర్తించిందనీ, సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిషన్‌ గుర్తించాలనీ, ఇది ముందస్తు ఎన్నికలకు ఏమాత్రం ఇబ్బంది కలిగించదని పేర్కొన్నారు. ఇంటింటికి జన సమితి కార్యక్రమాన్ని టీజేఎస్‌ 25 నియోజకవర్గాలలో చేపట్టిందనీ, ఈనెల 20లోపు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. ముందస్తు వల్ల మాకు ఎన్ని ఇబ్బందులు ఉంటాయో, అధికార పార్టీకి కూడా అన్నే ఇబ్బందులు ఉంటాయన్నారు. తమ పార్టీ బలపడ్డ తరువాతనే పొత్తుల విషయం మాట్లాడతామనీ, అనేక మంది సలహాదారులు తనకు సహకరిస్తున్నారని వ్యాఖ్యానించారు. నియోజకవర్గ స్థాయిలో 10 వేల మందితో మీటింగ్‌ పెట్టాలని ఆలోచిస్తున్నామనీ, వచ్చే ఎన్నికల్లో పైసలున్నోళ్లంత ఓ పక్క పైసల్లేనోళ్లంత మరోపక్క ఉంటరని వ్యాఖ్యానించారు. ప్రగతికి పది సూత్రాలు పేరుతో పార్టీ మేనిఫెస్టో తయారవుతోందనీ, పార్టీలో తనకు అందరూ సహకరిస్తున్నారు కాబట్టే ముందుకు వెళ్లగలుగుతున్నానని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలలో టీజేఎస్‌ పాత్ర ప్రముఖంగా ఉంటుందనీ, రుణమాఫీ వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతినదనీ, అది వ్యవసాయంలో పెట్టుబడి పెట్టడానికి దోహదం చేస్తుందన్నారు. గతంలో రైతు నాయకుడైతే రైతుల సమస్యలు పట్టించుకునే వారనీ, కానీ ఇప్పుడు రైతులు ఎవరూ నాయకులు కావట్లేదని వ్యాఖ్యానించారు. మాదక ద్రవ్యాలను ఆపడం, నిరుద్యోగ భృతి, మహిళా సంఘాలకు రుణాలు తదితర అంశాలు తమ పార్టీ మొదటి ప్రాధాన్యత అని పేర్కొన్నారు. ఒక పూట పిల్లకు అన్నం పెట్టలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతులు ఉన్న రాష్ట్రంలో మనం ఉన్నామనీ, ఈ నాలుగేళ్లలో మంచి పాలన జరిగిందని ఏ ఒక్కరితోనైనా అనిపించండని పేర్కొన్నారు. కేసీఆర్‌ మళ్లీ గజ్వేల్‌ నుంచి పోటీ చేస్తారో చేయరో తెలియదనీ, అసెంబ్లీని రద్దు చేయడానికి కూడా ఎవరైనా ముహూర్తం చూస్తారా అని కోదండరాం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.