ఎన్నికల శంఖారావం

Babu, Jagan
Babu, Jagan

చంద్రబాబు ఎన్నికల శంఖారావం 

4 నుండి జగన్‌ సమర శంఖారావం

కడప, జనవరి 26 ప్రభాతవార్త ప్రతినిధి: డ్వాక్రా మహిళల సదస్సుల నిర్వహణ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల శంఖారావం పూరించారు. పార్లమెంటు, శాసనసభ సాధారణ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీల నేతలు తమ కార్యకలాపాలను వేగవంతం చేశారు. శుక్రవారం అమరాతి, కడప, విశాఖపట్టణాల్లో స్వయం సహాయక సంఘాల ప్రాంతీయ సదస్సులను నిర్వహించారు. పసుపు కుంకుమ పేరుతో నిర్వహించిన ఈ సదస్సులకు పెద్ద ఎత్తున డ్వాక్రా మహిళలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి ముఖ్యమంత్రి వరాల వర్షం కురిపించి వచ్చే ఎన్నికల్లో మళ్లీ తనను ఆశీర్వదిస్తే అండగా ఉంటానని కోరారు. వచ్చే నెల 4 నుండి వైఎస్‌ఆర్‌పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమర సంఖారావం పేరుతో సమావేశాలు నిర్వహించనున్నారు. 4వ తేదీ తిరుపతి నుండి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఎలాగైనా మళ్లీ అధికారం దక్కించుకోవాలన్న లక్ష్యంతో సిఎం పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలను తనకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు డ్వాక్రా సదస్సులే నిదర్శనం. పసుపు కుంకుమకు గాను మరో 10 వేలు మూడు విడతల్లో డ్వాక్రా మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించారు. అంతేగాక ప్రతి మహిళకు ఒక స్మార్ట్‌ఫోను ఇస్తామని హామీ ఇచ్చారు. డ్వాక్రా తన మానసపుత్రిక అని తానే ఈ సంఘాలకు శ్రీకారం చుట్టానని మరోసారి ఆదరిస్తే అండగా ఉండడంతో పాటు ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాన్ని యధావిధిగా కొనసాగుతాయని హామీ ఇచ్చారు. ఈ సదస్సు ఆధ్యాంతం ఎన్నికల సభలను తలపించింది. ఆదివారం రాజమండ్రిలో జయహో పేరుతో బిసి సదస్సును నిర్వహించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడకముందే పలురకాల ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా మరిన్ని సభలను నిర్వహించనున్నారు. కొన్నిచోట్ల ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడంతో వారు ప్రచారంలో నిమగ్నమయ్యారు. త్వరలోనే రైతులకు వ్యవసాయానికిగాను పెట్టుబడి కింద డబ్బులిచ్చే కార్యక్రమాన్ని ప్రకటించనున్నట్లు తెలిసింది. ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యే లోపు మరిన్ని వరాలు ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోపక్క వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 1400 కిలోమీటర్లు పాదయాత్ర ఇటీవలే ముగించారు. పాదయాత్ర చేపట్టిని నియోజకవర్గాల్లో బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు తెలిసింది. పాదయాత్ర సందర్భంగా కొన్నిచోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులను జగన్‌ ప్రకటించడంతో వారు ప్రచారం చేసుకొంటున్నారు. జగన్‌ కడప జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిసింది. త్వరలో జిల్లాలో మఖాం పెట్టి అభ్యర్థుల ఎంపిక పూర్తి చేస్తారని సమాచారం. అన్ని స్థానాలను కైవసం చేసుకొనే దిశగా ప్రణాళిక రూపొం దిస్తున్నట్లు తెలుస్తోంది. జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ కోస్తాంధ్రలో సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలో ఒక్క అనంతపురంలో మాత్రమే పర్యటించగా మిగతా జిల్లాల్లో ఇంకా పర్యటన చేయలేదు. అన్నిపార్టీల నేతలు ప్రస్తుతం అభ్యర్థుల ఎంపికపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. సిఎం చంద్రబాబు మాత్రం ఒకపక్క సబలు నిర్వహిస్తూనే మరోపక్క అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.