ఎన్నారైల సేవ మ‌రువ‌లేనిదిః గంటా

digital class room inaugaration
digital class room inaugaration

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ తరగతుల ఏర్పాటుకు ఎన్నారైలు ముందుకు రావడం సంతోషకరమైన విషయమని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ కూడా పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటుకు కృషి చేస్తోందని ఆయన చెప్పారు. కృష్ణాజిల్లా చల్లపల్లి మండలంలోని పురిటిగడ్డ, మంగళాపురం గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్‌ క్లాస్‌ రూములను ప్రారంభించి ఆయన ప్రసంగించారు.
డిజిటల్‌ తరగతులను కీర్తి శేషులు చండ్ర రామయ్య జ్ఞాపకార్దం వారి మనమడు చంద్ర దిలీప్‌ కుమార్‌ ఆర్థిక సాయంతో ఏర్పాటు చేసిన డిజిటల్‌ తరగతులను ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌తో కలిసి పరిశీలించారు. ఉద్యోగ రీత్యా అమెరికాలో స్థిరపడి మొదటి జీతంతో దిలీప్‌ కుమార్‌ ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించటం అభినందనీయమని ఆయన తెలిపారు. నేటి ఆధునిక యుగంలో విద్యకు ఉన్న ప్రాధాన్యత దేనికి లేదని, అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్‌ కోమటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశిస్తున్నట్లుగా రాష్ట్రంలో 5వేల తరగతులను డిజిటల్‌ తరగతులుగా మార్చటానికి కృషిచేస్తున్నారని చెప్పారు.
జయరాం కోమటి మాట్లాడుతూ అమెరికాలోని ఎన్‌ఆర్‌ఐలను శరీరం అక్కడ ఉన్న మనసు అంతా తాము పుట్టి పెరిగిన గ్రామాలలోనే ఉంటుందని, చిన్నవయస్సులోనే చంద్ర దిలీప్‌ కుమార్‌ డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లు ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం చాలా మొచ్చుకోదగిన విషయం అని, ఇప్పటికి 2600 పైగా ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లు ఏర్పాటు చేశామని, రాబోయే సంవత్సరంలో మరిన్ని చేస్తామని తెలిపారు.
కృష్ణ జిల్లా కలెక్టర్‌ శ్రీ లక్ష్మీ రాజ్యం ఐఎఎస్‌ మాట్లాడుతూ విద్య గొప్పదనాన్ని వివరించారు. డిప్యూటి స్పీకర్‌ శ్రీ మండలి బుద్ధ ప్రసాద్‌ మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో అవనిగడ్డకు అన్ని సదుపాయాలు కలిగిస్తున్న మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావును అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడు సతీష్‌ వేమన ఎపీ జన్మభూమి తరుపున జయరాం కోమటి చేస్తున్న సేవలలో తానా కూడా తన వంతు సహయం చేయడానికి ముందువరుసలో ఉంటుందని తెలిపారు. కార్యక్రమనంతరం ఈ పాఠశాలకు విరాళం ఇచ్చిన దిలీప్‌ తల్లిదండ్రులు చండ్ర ప్రసాద్‌ అమృతలీల లను ఉపసభాపతి ఘనంగా సత్కరించారు.