ఎన్నారైలా ఓటు హ‌క్కుపై పార్ల‌మెంట్‌లో బిల్లు!

Parliament
Parliament of india

ఢిల్లీ: పోస్టల్‌, ఈ-బ్యాలెట్ల ద్వారా ఎన్నారైలు ఓటు వేసేందుకు అనుమతించే ప్రజా ప్రాతినిథ్య చట్టం సవరణ బిల్లును పార్లమెంటు శీతకాల సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్నట్టు కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. అప్పటి వరకు ఎన్నారైలకు ఓటింగ్‌ కోరుతూ వచ్చిన పిటిషన్ల విచారణ వాయిదా వేయాలని కోరింది. ఇందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, న్యాయమూర్తులు ఏఎం ఖన్విల్కర్‌, డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం అంగీకరించింది. పీకే పాండే కేంద్రం తరఫున వాదనలు వినిపించారు. శీతకాల సమావేశాల్లో బిల్లు టేబుల్‌ మీదకు రానుందని ఆరునెల‌ల వరకు విచారణను వాయిదా వేయాలని పాండే కోరారు. అయితే కోర్టు 12 వారాల గడువు మాత్రమే ఇచ్చింది. ప్రజా ప్రాతినిథ్య చట్టంలో నియమాలను మార్చడం వల్ల ఎన్నారైలు ఓటు వేయడం కుదరదని, పార్లమెంటులో సవరణ బిల్లు ప్రవేశ పెట్టడమే సరైందని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ జులై 21న కోర్టుకు తెలిపారు. ఎన్నారైలకు అనుకూలంగా చట్టాన్ని సవరిస్తారా? లేదా నిర్ణయించాలని జులై 14న కేంద్రానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. దీంతో డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ వినోద్‌ నేతృత్వంలో 12 మంది సభ్యులతో కేంద్రం పోల్‌ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. వారిచ్చిన నివేదిక మేరకు మార్పులకు అంగీకరించింది.