ఎత్తులు, పై ఎత్తులు

నిఘా

Political Game
Political Game

స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఎన్నికల వేడి మరింత రాజుకుంది. జిల్లాలో ప్రధాన పార్టీలైన తెదేపా,వైకాపా అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్‌ దాఖలు చేయగా,రెండు పార్టీలు తమ బల,బలాలను అంచన వేయడంలో పడ్డాయి.ప్రజా స్వామ్య బద్దంగా జిల్లాలో స్థానిక సంస్థల్లో తమకే మెజార్టీ ఉందని వైకాపా వర్గాలు బావిస్తుండగా,ఇక గత మూడేళ్లలో తెలుగుదేశం చేసిన అభివృద్ది మూలంగా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు తమ వెంట ఉన్నారని తెదేపా వర్గాలు వెల్లడిస్తున్నాయి.ఈ క్రమంలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను మచ్చిక చేసుకునేందుకు ఇరు రాజకీయ పార్టీలు క్యాంపు రాజకీయాలకు సన్నద్దమవుతున్నాయి.ఇప్పటికే వైఎస్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి డివిజన్‌ల వారిగా క్యాంపులకు సిద్దమవుతుండగా,ఇక తెదేపా అభ్యర్థి నియోజక వర్గ స్థాయిలో ఎంఎల్‌ఏలతో కలిసి క్యాంపు రాజకీయాలు నిర్వాహాణకు సన్నద్దులయ్యారు

.మొత్తంగా రెండు పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోగా, జిల్లాలో జడ్‌పిటిసి,ఎంపిటిసి,మున్సిఫల్‌ ఓట్లకు భలే గిరాకి పెరగనుంది. ఎన్నికల మూలంగా తమ సమస్యలు,అర్థిక ఇబ్బందులను అదిగమించేందుకు ఇదే మంచి తరుణమని కొంతమంది స్థానిక సంస్థల ప్రతినిధులు బావిస్తున్నారు.ఈ క్రమంలో ప్రధానపార్టీకి చెందిన ఇరువులు అభ్యర్థులు జెడ్‌పిటిసిలు, ఎంపిటిసిలు,కౌన్సలర్లను సంతృప్తి పరిచేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.జిల్లాలో ప్రస్తుతం 1084 మంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు ఓటు హక్కు ఉంది. వీరిలో 804 ఎంపిటిసిలు,53 జడ్‌పిటిసిలు, 216 మంది కౌన్సలర్లు, 11 మంది ఎక్స్‌ అఫిషియో సభ్యులు ఉన్నారు.వీరితో పాటు నంద్యాల,అదోని,డోన్‌,ఎమ్మిగన్నూరు,నందికొట్కూరు, శ్రీశైలం,అళ్లగడ్డ,కొడుమూరు ఎంఎల్‌ఏలకు,నంద్యాల ఎంపి ఓటు హక్కు కలిగి ఉన్నారు.కర్నూలు నగరపాలక సంస్థలో పాలక వర్గం లేకపోవడంతో కర్నూలు ఎంపి,ఎంఎల్‌ఏలకు ఓటు హక్కులేకపోవడం గమనార్హం

.ప్రస్తుతం ఉన్న స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల్లో పురుష ఓటర్లు 460, స్త్రీ ఓటర్లు 624 మంది ఉన్నారు.వీటిలో అదోని డివిజన్‌లో 391 ,కర్నూలు డివిజన్‌ 386,నంద్యాల డివిజన్‌ పరిధిలో 307 మంది ఓటర్లున్నారు. పార్టీల వారిగా బలబలాలు ః స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఎన్నికల్లో పార్టీల వారిగా బలబలాను బేరిజు వేస్తే జిల్లాలో మొత్తం 53 మంది జడ్‌పిటిసిలుండగా,ఇందులో ప్రజా స్వామ్య బద్దంగా ఎన్నికైన వాటిని పరిగణలోకి తీసుకుంటే తెదేపా 20,వైకాపా తరుపున 30 మంది,ఇద్దరు కాంగ్రెస్‌,స్వతంత్రులు ఒకరున్నారు.అయితే గతంలో జడ్‌పి చైర్మన్‌ ఎంపిక సందర్బంగా వైకాపాకు చెందిన ఏడుగురు జడ్‌పిటిసిలు,కాంగ్రెస్‌,స్వతంత్య్ర అభ్యర్థి తెదేపా తీర్థం పుచ్చుకోగా,టిడిపి బలం 30కు చేరుకుంది.ఇక వైకాపా బలం 22కు పడిపోయింది.ఓ కాంగ్రెస్‌ జడ్‌పిటిసి మిగిలారు.

ఇక ఎంపిటిసిల విషయంకు వస్తే జిల్లాలో మొత్తం 815 ఎంపిటిసి స్థానాలకు గాను,ప్రస్తుతం 804 ఎంపిటిసిలు ఉన్నారు.వీరిలో కొంతమంది మృతి చెందగా,వీటిలో పార్టీల వారిగా పరిశీలిస్తే తెదేపా 329,వైకాపాకు 392,కాంగ్రెస్‌కు 42,వామపక్షాలు 8,ఇతరులు 36 మంది వరకు ఉన్నారు.అయితే గత మూడేళ్లలో పలువురు పార్టీలు మారడంతో వీటి సంఖ్య కొంత అటు ఇటు అయింది.ఇక మున్సిపాలిటీల పరిశీలిస్తే అళ్లగడ్డ పరిదిలో వైకాపాకు 9,టిడిపికి 2 కౌన్సిలర్లున్నారు.అయితే స్థానిక ఎంఎల్‌ఏ అఃల ప్రియ,భూమా నాగిరెడ్డిలు పార్టీ మారడంతో ఇక్కడి అంకెలు పూర్తిగా తెదేపాకు అనుకూలంగా ఉన్నాయి.అత్మకూరు పరిధిలో మొత్తం 20 కౌన్సిలర్లకు గాను వైకాపాకు 10,తెదేపాకు 9 మంది కౌన్సలర్లున్నారు.

స్వతంత్రులు ఒకరు ఉండగా,ఇందులో వైకాపాకు చెందిన ఐదుగురు,స్వతంత్య్రలు అ తర్వాత తెదేపా తీర్థం పుచ్చుకున్నారు.దీంతో టిడిపి బలం 15కు చేరుకోగా,వైకాపా బలం 5కు పడిపోయింది.నందికొట్కూరు మున్సిఫల్‌ పరిధిలో మొత్తం 23 మంది కౌన్సిలర్లకు గాను వైకాపాకు 16,టిడిపి 4,స్వతంత్రులు ముగ్గురున్నారు.కాగా గత జడ్‌పి చైర్మన్‌ ఎంపిక సందర్బంగా ఇక్కడ తెదేపా నేత మాండ్ర చక్రం తిప్పడంతో వైకాపాకు చెందిన కౌన్సిలర్లు కొందరు తెదేపాలో చేరడంతో అంకెల్లో టిడిపికి మెజార్టీగా ఉంది.గూడురు మున్సిఫల్‌లో 20 కౌన్సిలర్లకు గాను వైకాపాకు 11,తెదేపాకు అరుగురు,ఒకరు స్వతంత్య్రలున్నారు.అయితే వైకాపాకు చెందిన 8మంది,స్వతంత్య్ర అభ్యర్థి తెదేపా తీర్థం పుచ్చుకోవడంతో, అపార్టీ కౌన్సిలర్ల సంఖ్య 15కు చేరుకుంది.డోన్‌ పురపాలక సంఘంలో మొత్తం 20 మందికి గాను తెదేపాకు 12 మంది సభ్యులు,వైకాపాకు ఏడుగురున్నారు.వైకాపాకు చెందిన మరోకరు తెదేపాలో చేరడంతో అ పార్టీ బలం 13గా ఉంది.అదోనిలో తెదేపాకు 13,వైకాపాకు 23,ఎంఐఎంకు 5 మంది సభ్యులున్నారు.

నంద్యాల పురపాలక సంఘంలో మొత్తం 42 మందికి గాను తెదేపాకు 29 మంది కౌన్సిలర్లు,వైకాపాకు 13 మంది సభ్యులున్నారు. స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఎన్నికల్లో మొత్తంగా 1087 ప్రజా ప్రతినిధుల ఓట్లను పరిగణలోకి తీసుకుంటే తెదేపాకు 450,వైకాపాకు 501 ఓట్ల సంఖ్య బలం ఉంది.ఇక కాంగ్రెస్‌,సిపిఐ,సిపిఎం,సమాఖ్య తెలుగు రాజ్యంలకు సంబందించి వందకుపైగా ఉన్నారు.మొత్తంగా అంకెలపరంగా చూస్తే గతంలో వైకాపాకే మెజార్టీ ఉంది.అయితే 2014లో నిర్వహించిన ఎంఎల్‌సి ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి ఊహించని విధంగా వైకాపా మెజార్టీని కాదని 147 ఓట్లతో విజయం సాదించారు.అయన పదవి కాలం ముగియడంతో తిరిగి ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయి.ప్రస్తుతం అంకెల పరంగా తీసుకుంటే అధికార పార్టీయైన తెలుగుదేశం 50 నుంచి 100 ఓట్ల వరకు మెజార్టీలో ఉన్నా మారిన రాజకీయాలు,సమీకరణల నేపథ్యంలో ఓటింగ్‌ రోజుకు ఈ సంఖ్య తారుమరయ్యే అవకాశం లేకపోలేదు.కారణం ఎన్నికల బరిలో దిగిన తెదేపాకు చెందిన చక్రపాణిరెడ్డి,వైకాపాకు చెందిన గౌరు వెంకట్‌రెడ్డిలు ఇరువురు రాజకీయ నేపథ్యం ఉన్నవారే.కాగా వైకాపాకు చెందిన స్థానిక ప్రజా ప్రతినిధుల్లో చాల మంది తెదేపా తీర్థం పుచ్చుకోవడం,పైగా అ పార్టీకి చెందిన ఐదుగురు ఎంఎల్‌ఏలు తమ పార్టీలో చేరడంతో అంకెల పరంగా తమకు మెజార్టీ ఉన్నా,వైకాపా అభ్యర్థిని ఇక్కడి నుంచి పోటీలో ఎలా నింపారన్నది ప్రస్తుతం తెదేపా నేతల మెదల్లో మొదలవుతున్న ప్రశ్న.

అయితే తెదేపాలో ఉన్న అంతర్గత కలహాలు తమకు కలిసి వచ్చే అవకాశం ఉందని వైకాపా బావిస్తుంది.ఇక ఎంఎల్‌సిగా శిల్పాను గతంలో గెలిపించిన తమకు అందుబాటులో లేరని,గెలిచిన తర్వాత స్థానిక సంస్థలకు చెందిన ఏ ఒక్క ప్రజా ప్రతినిధిలను కనీసం పలుకరించిన దాఖలాలు కూడ లేవని విమర్శలు ఉండగా, వీటన్నింటిని తమకు అనుకూలంగా మలుచుకోవాలనే భావనలో వైకాపా ఉంది.

అంతేకాదు అళ్లగడ్డకు చెందిన తెదేపా నేత గంగుల ప్రభాకర్‌ రెడ్డి అ పార్టీని వీడి తనకు మద్దతుగా ఉన్న స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి వైకాపాలో చేరడం కూడ తమకు కలిసి వచ్చే అంశంగా వైకాపా వర్గాలు బావిస్తున్నాయి. వీటికి తోడు నందికొట్కూరు పరిధిలో మాండ్ర,గౌరు వర్గాలకు బందువు వర్గం ఉండటం కలిసి వచ్చే అంశంగా బావిస్తున్నారు.మొత్తంగా ఎంఎల్‌సి ఎన్నికల బరిలో ఇరువురు అభ్యర్థులు రాజకీయంగా, అర్థికంగా పరిపుష్టి కలిగి ఉన్నవారే.ప్రస్తుతం బరిలో ఉన్న శిల్పా జిల్లా తెదేపా అధ్యక్షులుగా పనిచేస్తుండగా,ఇక వైకాపా నుంచి బరిలో ఉన్న గౌరు అ పార్టీ జిల్లా కన్వీనర్‌గా వ్యవహారిస్తున్నారు.దీంతో ఈ ఎన్నికల్లో ధన ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలున్నాయి.ఓటు హక్కు కలిగి ఉన్నా ప్రజా ప్రతినిధులను తమవైపు తిప్పుకునే క్రమంలో వారిని సంతృప్తి పరిచే ప్రయత్నాలు తీవ్రస్థాయిలో ఉంటాయి.ప్రస్తుతం ఎంఎల్‌సి పదవి కాలాన్ని పొడిగించడం కూడ ఓ విధంగా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు కలిసివచ్చే అవకాశం.ఏది ఏమైన టిడిపి,వైకాపా రెండు పార్టీల మద్య ఓట్ల తేడా పెద్దగా లేకపోవడంతో క్యాంపు రాజకీయాలపై ఇరువురు దృష్టి సారించే అవకాశం అదికంగా ఉంది.