ఎక్కడ కష్టాలుంటాయో అక్కడే పరిష్కారాలుంటాయిః పవన్

కదిరిః ఒక సమస్యను పరిష్కరించాలంటే.. ప్రెస్ మీట్ పెట్టో, లేక రెండు మూడు ముక్కలు మాట్లాడితే సమస్యకు పరిష్కారం దొరకదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆదివారం కదిరి పర్యటనకు వచ్చిన ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఒక సమస్యకు పరిష్కారం వెతకాలంటే చాలా సహనం కావాలని, చాలా మందిని ఒప్పించాలని, చాలా మందిని భాగస్వామ్యం చేయాలని అన్నారు. అనంతపురం వెనకబడడానికి అనేక కారణాలు ఉన్నాయన్నారు. పకృతిపరంగా వర్షాధార వ్యవసాయం ఉండడం, దాన్ని పరిష్కరించడానికి బలమైన చిత్తశుద్ది కావాలని, త్రికరణ శుద్ధిగా చేస్తే సాధించవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. ఎవరికైనా ఎక్కడైతే బలం ఉంటుందో అక్కడ నిలబడి సమస్యలు పరిష్కరించాలని అనుకుంటారని, కానీ తాను అనంతపురం జిల్లానే ఎందుకు ఎంచుకున్నానంటే.. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయని, కష్టాలు ఎక్కడ ఉంటాయో, పరిష్కారం కూడా అక్కడే ఉంటుందని తాను బాలంగా నమ్ముతానని అన్నారు. అక్షరాస్యత కూడా చాలా తక్కువ స్థాయిలో ఉందని అన్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అనంతపురాన్ని ఎంచుకోవాల్సి వచ్చిందని పవన్ వ్యాఖ్యానించారు.