ఎంపీలు, ఎమ్మెల్యేల‌పై ఉన్న కేసుల విచార‌ణ‌కు ప్ర‌త్యేక కోర్టులు..

supreem court
supreem court

ఢిల్లీః దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులను విచారించేందుకు ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేస్తామని కేంద్రం తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్‌ను దాఖలు చేసింది. వారిపై ఉన్న కేసుల విచారణకు 12 ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం సుముఖంగా ఉందనే విషయాన్ని ప్రభుత్వం తరఫు న్యాయవాది.. జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనానికి తెలియజేశారు. 2014 ఎన్నికల నామినేషన్‌ పత్రాల ప్రకారం రాజకీయ నాయకులపై మొత్తం 1581 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు ఏడీఆర్‌ నివేదిక వెల్లడించింది. అయితే వాటిలో పది కేసుల్లోని నేతలు చనిపోవడంతో ఆ కేసులు కొట్టివేశారు. ప్రస్తుత తేదీ వరకు ఎంతమంది రాజకీయనేతలపై కేసులు పెండింగ్‌లో ఉన్నాయనే సమాచారం తెలుసుకునేందుకు కొంత సమయం ఇవ్వాల్సిందిగా కేంద్రం న్యాయస్థానాన్ని కోరింది. నేరం రుజువైన నేతలు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేలా నిషేధం విధించాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం గత నెల సుప్రీంకోర్టును కోరింది. రాజకీయాల్లో నేరస్థులకు చోటు కల్పించకూడదనే ఉద్దేశంతోనే ఈసీ ఈ ప్రతిపాదన తీసుకువ‌చ్చింది.