ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు

SUPREME COURT
SUPREME COURT

న్యూఢిల్లీ: క్రిమినల్‌ కేసులు ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలపై సత్వర విచారణకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటుచేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు సుప్రీంకోర్టు గురువారం పచ్చజెండా ఊపింది. దేశంలో ఉన్న ఎంపి, ఎమ్మెల్యేలందరిపై 1,571 క్రిమినల్‌ కేసులు ఉండగా, వీటి కోసం 12 స్పెషల్‌ కోర్టులు ఏర్పాటుచేయాలని కేంద్రం సుప్రీంను కోరింది. ఈ కోర్టులు 2018 మార్చి 1 నుంచి కేసుల విచారణను ప్రారంభిస్తాయని కూడా సుప్రీంకోర్టు తెలిపింది. ఈ స్పెషల్‌ కోర్టుల కోసం రూ.7.8 కోట్ల నిధులను విడుదల చేయాలని సర్వోన్నత న్యాయస్థానం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అయితే ప్రభుత్వం ప్రతిపాదించిన స్పెషల్‌ కోర్టులు సరిపోవని సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ లూత్రా, దినేష్‌ ద్వివేదీలు తెలుపగా జస్టిస్‌ రంజన్‌ గొగో§్‌ు, జస్టిస్‌ నవీన్‌ సిన్హాలతో కూడిన ధర్మాసనం అవసరమైతే మరికొన్ని కోర్టులను కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్రాలను ఆదేశిస్తామని తెలిపింది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల కోర్టులో ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులను హైకోర్టులు గుర్తించి ఆ రాష్ట్రాల పరిధిలో ఉన్న స్పెషల్‌ కోర్టులకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు హైకోర్టులను ఆదేశించింది.