ఊహల ఊయలలో…!

img
nature

ఊహల ఊయలలో…!

చల్లని సాయంకాలం వేడి వేడి కాఫీ తాగుతూ… ఎప్పుడో చిన్నతనంలో వెళ్లిన ఊటీ, కొడైకెనాల్‌ అందాలు మనసులో ఒక్కసారి స్మరించుకుంటే మనసుకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. ఎలాంటి ఖర్చూ, శ్రమ లేకుండానే పది నిముషాల్లో అలా…అలా ఇష్టమైన ప్రదేశం చూసి వచ్చేసి, పని ఒత్తిడి మర్చిపోయి మళ్లీ ఉల్లాస ఉత్తేజాలు పొందవచ్చునంటున్నారు మానసిక నిపుణులు. ఇది విన్నపుడు సరదాగానే అనిపించినా ఫలితాలు సరిపడా ఉంటాయని వారు చెబుతున్నారు. ‘అబ్బా జీవితం చాలా బోర్‌గా ఉంది, ఒక పదిరోజులు సెలవు పెట్టేసి ఎక్కడికన్నా వెళ్లి రావాలి అనే మాట చాలామంది నోటివెంట మనం తరచుగా వింటూ ఉంటాం.

అయితే మీ మనసు ప్రశాంతతను కోరుకున్న ప్రతిసారీ కాశ్మీరు, కన్యాకుమారి, ఊటీ, కొడైకెనాల్‌ వెళ్లిపోలేరు కదా. లేదా ఒక్కసారిగా విసుగు పుట్టిన గందరగోళం నుంచి దూరం కావటానికి ఏ పచ్చని పంట పొలాలు, కొండలు ఉన్న పల్లెటూరుకో బయలుదేరలేం. ధనం లేకపోవటం ఒక్కటే దీనికి అడ్డు కాదు సుమా! ఒక్కోసారి సమయం, పరిస్థితులు కూడా అందుకు సహకరించవు. అందుకని అలాగే… ఆ చికాకులోనే…అదే మానసిక ఒత్తిడితో ఉంటే బుర్ర దిమ్మెక్కిపోతుంది. మనసుకంటే వేగంగా ప్రయాణించగలది

ఈ ప్రపంచంలో మరేదీ లేదు. అందుకే అది కోరుకున్న ప్రదేశానికి, ఆ వాతావరణానికి దానితో పాటు మీరూ స్వేచ్ఛగా ప్రయాణించండి. దానికేం ఖర్చు కాదు. ఆ ఊహల్లో అందాలను, మీరు కోరుకున్న వాతావరణాన్ని ఆస్వాదించండి. లేదా ఇంతకు ముందెప్పుడైనా మీరు చూసిన, మీ మనసు దోచిన ప్రదేశాలు, సందర్భాలను గుర్తుకుతెచ్చుకోండి. కేవలం పదినిమిషాలు మీ మనసుకు స్వేచ్ఛగా విహరించే స్వేచ్ఛనిస్తే చాలు ఒత్తిడిని, చికాకును తరిమికొట్టి మీరు కోరుకుంటున్న ఉత్తేజం, ఉల్లాసం, మళ్లీ మీ చెంతకు చేరేలా చేస్తుంది.