ఉమ్టా సమావేశంలో పాల్గొన్న సిఎస్‌

traffic
traffic

ట్రాఫిక్‌కు అనుగుణంగా ప్రణాళికలను రూపొందించండి
ప్రభుత్వ ప్రధాన కార్యాదర్శి డా.ఎస్‌.కె.జోషి
ఉమ్టా 12వ సమావేశంలో పలు అంశాలపై సమీక్ష
హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ పరిధిలో పాదచారులకు ఉపయోగపడేలా పెడాస్ట్రియన్‌ ఫ్రెండ్లీ గ్రేడ్‌-1 రహదారులను నిర్మించాలని ప్రభుత్వ ప్రధాన కార్యాదర్శి డా.ఎస్‌.కె.జోషి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం యునిఫైడ్‌ మెట్రో పాలిటన్‌ ట్రాన్స్‌పోర్టు అథారిటీ(ఉమ్టా) 12వ సమావేశం సచివాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రజారవాణాకు సంబంధించి ఉమ్టా ద్వారా చేపడుతున్న పనులను సిఎస్‌ సమీక్షించారు. ఎంఎంటిఎస్‌, ఆర్‌టిసిలకు సంబంధించిన కామన్‌ టికెటింగ్‌, ఇంటర్‌ సిటీ బస్‌ టర్మినల్‌ల ఏర్పాటు, ఎంఎంటిఎస్‌ రెండో దశ, ఇంటలిజెన్స్‌ ట్రాన్స్‌ పోర్టు మాస్టర్‌ ప్లాన్‌, ఓఆర్‌ఆర్‌పై ప్రమాదాల నివారణ, ప్రభుత్వ ప్రైవేటు వాహనాలకు పార్కింగ్‌ ప్రాంతాల గుర్తింపు, లాజిస్టిక్‌ పార్కుల ఏర్పాటు తదితర అంశాలపై సమీక్షించారు. పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించాలన్నారు. నగరంలో పాదచారులకు ఉపయోగంగా ఉండేలా పుట్‌పాత్‌లను నిర్మించాలన్నారు. ఓఆర్‌ఆర్‌కు సంబంధించి ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. డిసెంబర్‌ చివరి నాటికి ఓఆర్‌ఆర్‌ మొత్తం ఎల్‌ఇడి లైటింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు. వేగ నియంత్రణపై దృష్టిసారించాలని సూచించారు. ప్రభుత్వ ప్రైవేటు రంగంలో మల్టీ లెవల్‌ పార్కింగ్‌ నిర్మాణాల కోసం స్థలాల ఎంపికను వేగవంతం చేయాలన్నారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాలను మ్యాపింగ్‌ చేసి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు.
105 జంక్షన్‌లలో ఫెలికాన్‌ సిగ్నల్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రాఫిక్‌ సంబంధించి సమగ్ర ప్రణాళికల్లో భాగంగా వ్యూహాన్ని రూపొందించడానికి ఉమ్టా ట్రక్‌ అసోసియేషన్లు, ప్రైవేటు బస్‌ మేనేజ్‌మెంట్‌ల నుంచి ఒక్కోక్కరిని ప్రతినిధులుగా చేర్చాలని సిఎస్‌ ఆదేశించారు. ప్రమాదాలకు కారణాలపై విశ్లేషణ చేయాలని, ఇంటర్‌ సిటీ బస్‌ టర్మినల్స్‌ నిర్మాణంపై ఇంటిగ్రేటెడ్‌ ప్లాన్‌ రూపొందించాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ, మెట్రోరైల్‌ ఎండి ఎన్‌.వి.ఎస్‌.రెడ్డి, హెచ్‌ఎండిఎ కమిషనర్‌ టి.చిరంజీవులు, జిహెచ్‌ఎంసి అదనపు కమిషనర్‌ భారతిహోళికేరి, రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌భగవత్‌, అదనపు ట్రాఫిక్‌ పోలీసు కమిషనర్‌ అనీల్‌కుమార్‌లు పాల్గొన్నారు.