ఉద్యోగాల కోసం యువ‌కులు బ‌ల‌వుతున్నారుః ల‌క్ష్మ‌ణ్‌

bjp MLA , lakshman
bjp MLA , lakshman

హైద‌రాబాద్ః తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని భాజపా ఎమ్మెల్యే డా. లక్ష్మణ్‌ అన్నారు. నిరుద్యోగ సమస్యపై ఆయన శాసనసభలో మాట్లాడారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాల పేరిట తెలంగాణ ఏర్పడిందని గుర్తుచేశారు. జీవితాలు బాగుపడి, భవిష్యత్‌ బాగుంటుందని విద్యార్థులు విశ్వవిద్యాలయాల వేదికగా పోరాటాలు చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో మూడున్నరేళ్లలో దాదాపు 50 వేల మంది పదవీ విరమణ చేశారని.. అయితే అదే స్థాయిలో ఖాళీల భర్తీ మాత్రం చేపట్టడం లేదని విమర్శించారు. ప్రభుత్వ అనాలోచిత చర్య వల్ల 4372 పాఠశాలలు, 700 డిగ్రీ కళాశాలలు, 200 ఇంజినీరింగ్‌ కళాశాలలు మూతపడ్డాయని వివరించారు. దీంతో పాఠశాలలు, కళాశాలల్లో సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయారని చెప్పారు. తెలంగాణ వచ్చాక కూడా ఉద్యోగాల కోసం యువకులు బలిదానాలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.