ఉద్ధవ్, కోష్యారీ మధ్య విభేదాలు

మహారాష్ట్ర గవర్నర్ కు అవమానం… ప్రభుత్వ విమానంలో వెళ్లేందుకు అనుమతి నిరాకరణ!

ముంబయి: మహారాష్ట్రలో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ, ఉద్ధవ్ థాకరే ప్రభుత్వానికి మధ్య అంతరం మరింత పెరుగుతోంది. గత అక్టోబరులో మహారాష్ట్రలో ప్రార్థనాలయాలకు అనుమతి నిచ్చిన నేపథ్యంలో గవర్నర్ విమర్శలు చేశారు. హిందుత్వ ఓట్ల కోసం చూసే ఉద్ధవ్ ఇప్పుడు లౌకికవాదిగా మారినట్టుందని వ్యాఖ్యానించారు. అప్పటి నుంచి మహారాష్ట్ర సిఎంకు, గవర్నర్ కోష్యారీకి మధ్య సంబంధాలు క్షీణించాయి. తాజాగా, గవర్నర్ కు అవమానకర పరిస్థితులు ఎదురయ్యాయి.

కోష్యారీ డెహ్రాడూన్ వెళ్లేందుకు ముంబయి ఎయిర్ పోర్టుకు చేరుకోగా, ప్రభుత్వ విమానంలో ప్రయాణించేందుకు ఆయనకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఎయిర్ పోర్టుకు వచ్చిన గవర్నర్ విమానంలో ఎక్కేందుకే రెండు గంటల పాటు వేచి చూడాల్సి వచ్చింది. విమానం ఎక్కిన తర్వాత కూడా పావుగంట సేపు కూర్చున్నారు. అయితే తనకు టేకాఫ్ కు అనుమతి రాలేదంటూ ఫ్లయిట్ కెప్టెన్ చెప్పడంతో గవర్నర్ కోష్యారీ చేసేది లేక ఆ విమానం నుంచి దిగి, మరో విమానంలో టికెట్ బుక్ చేసుకుని డెహ్రాడూన్ పయనం అయ్యారు.

దీనిపై గవర్నర్ కార్యాలయం అసంతృప్తి వ్యక్తం చేసింది. గవర్నర్ డెహ్రాడూన్ పర్యటనపై వారం కిందటే ప్రభుత్వానికి సమాచారం అందించామని, అయినప్పటికీ అనుమతి ఇవ్వలేదని పేర్కొంది. ఈ వ్యవహారంపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్పందించారు. గవర్నర్ విమాన ప్రయాణం అంశంపై తన కార్యాలయం ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకుంటానని వెల్లడించారు.