ఉత్త‌ర ఐర్లాండ్ చ‌ర్చ‌లు విఫ‌లం..

Theressa May
Theressa May

లండన్‌ : ఉత్తర ఐర్లాండ్‌ ప్రభుత్వ అధికారాల పంపిణీని పునరుద్ధరించేందుకు  జరుగుతున్న చర్చలు బుధవారం మళ్ళీ విఫలమయ్యాయని ప్రధాన పార్టీలు తెలిపాయి. చర్చల వైఫల్యానికి కారణమంటూ పరస్పరం నిందించుకున్నాయి. అయితే ఇంకా పరిష్కారం కుదిరే అవకాశాలు వున్నాయంటూ బ్రిటన్‌ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. బ్రిటీష్‌ ప్రావిన్స్‌ అయిన ఉత్తర ఐర్లాండ్‌లో గత ఏడాది కాలంగా సరైన ప్రభుత్వం లేదు. ఏ బిల్లును ఆమోదించాలన్నా డెమోక్రటిక్‌ యూనియనిస్ట్‌ పార్టీ (డియుపి) ఇచ్చే మద్దతుపై ప్రధాని థెరిస్సా మే మైనారిటీ ప్రభుత్వం ఆధారపడి వున్నందున దీర్ఘకాలం నుండి సాగుతున్న చర్చలు మరింత సంక్లిష్టంగా మారాయి. ప్రధానంగా కేథలిక్కులకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ, ప్రొటెస్టంట్లకు ప్రాతినిధ్యం వహించే పార్టీలు ఇప్పటివరకు విధించిన అనేక గడువులను ఉల్లంఘించాయి. ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇంకా ఒకే ఒక్క అవకాశం వుందని గత నెల్లో బ్రిటీష్‌, ఐరిష్‌ ప్రభుత్వాలు ఆ పార్టీలకు స్పష్టం చేశాయి. ఈసారి చర్చల్లో పురోగతి కనిపిస్తుండడంతో చర్చలు జయప్రదమవుతాయని భావించామని బ్రిటన్‌లోని ఉత్తర ఐర్లాండ్‌ మంత్రి కరేన్‌ బ్రాడ్లే విలేకర్లకు తెలిపారు. ప్రజా ప్రయోజనాల రీత్యా అధికార వికేంద్రీకరణ ప్రభుత్వం మంచిదని బ్రిటన్‌ ప్రభుత్వం భావిస్తోంది. చర్చలకు, అవి ఫలప్రదం కావడానికి ఇంకా అవకాశం వుందని తాము భావిస్తున్నట్లు థెరిస్సా మే తెలిపారు. ఈ చర్చలతో ప్రతిష్టంభన పరిష్కారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని రెండు రోజుల క్రితమే ఇరువురు ప్రధానులు పేర్కొన్నారు. అయితే ఒప్పందం కుదిరే పరిస్థితి కనిపించడం లేదని డియుపి నేత అర్లీన్‌ ఫోస్టర్‌ బుధవారం ఒక ప్రకటన జారీ చేయడంతో మొత్తంగా చర్చలు విఫలమయ్యాయి.