ఉత్తరాఖండ్‌లో 32కు చేరిన మృతుల సంఖ్య

విద్యుత్ కేంద్రం సొరంగంలో చిక్కుకుపోయిన వారు బతికి ఉండే అవకాశం ఉందన్న అధికారులు

దేహ్రాదూన్‌: మంచు చరియాలు, నదీ ప్రవాహం సృష్టించిన విలయంలో ఉత్తరాఖండ్‌లో మృతి చెందినవారి సంఖ్య 32కు చేరింది. గల్లంలైన 171 మంది ఆచూకీ కోసం వెతుకుతున్న సహాయక బృందాలు నిన్న మరో ఆరు మృతదేహాలను గుర్తించి బయటకు తీసుకొచ్చాయి. దీంతో ఈ ప్రమాదంలో మృతి చెందినవారి సంఖ్య 32కు చేరింది.

రెండున్నర కిలోమీటర్ల పొడవు వుండే జలవిద్యుత్ కేంద్రంలో చిక్కుకుపోయిన వారి కోసం సహాయక చర్యలు ప్రారంభించిన ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ బృందాలు 120 మీటర్ల మేర బురద, ఇతర వ్యర్థాలను తొలగించారు. సొరంగంలో చిక్కుకున్న వారిని సంప్రదించడం ఇప్పటి వరకు సాధ్యం కాకపోయినా, వారు ప్రాణాలతోనే ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు, వంతెన కొట్టుకుపోయిన కారణంగా బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోయిన 13 గ్రామాల ప్రజలకు హెలికాప్టర్ల ద్వారా నిత్యావసర సరుకులను అందిస్తున్నారు.