ఉత్తరాఖండ్లో తిరిగి ప్రారంభమైన సహాయక చర్యలు
14 మృతదేహాల వెలికితీత
SDRF begins rescue operation at the tunnel near Taopovan dam
దేహుద్రూన్: ఉత్తరాఖండ్లో నేటి ఉదయం నుండి సహాయక చర్యలు తిరిగి ప్రారంభమయ్యాయి. జల ప్రళయంలో చిక్కుకున్న 16 మంది కార్మికులను రక్షించిన సహాయక బృందాలు ఇప్పటి వరకు 14 మృతదేహాలను వెలికి తీశాయి. కాగా, తపోవన్ సొరంగంలో చిక్కుకుపోయిన వారిని గుర్తించేందుకు ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. భారీ యంత్రాలతో సొరంగంలో పూడుకుపోయిన బురదను తొలగించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ సొరంగం మొత్తం పొడవు 250 మీటర్లు కాగా, నిన్న జవాన్లు 150 మీటర్ల లోపలి వరకు వెళ్లగలిగారు. ప్రళయానికి కారణమైన ధౌలీ గంగ నీటిమట్టం నిన్న రాత్రి నుంచి మళ్లీ పెరుగుతుండడంతో సహాయక చర్యలను నిలిపివేసిన అధికారులు నేటి ఉదయం మళ్లీ ప్రారంభించారు.
సొరంగాల్లో మరో 30 మంది వరకు చిక్కుకుని ఉండొచ్చని, వారిని రక్షించేందుకు 300 మంది జవాన్లు శ్రమిస్తున్నారని ఐటీబీపీ అధికార ప్రతినిధి వివేక్ పాండే తెలిపారు. కాగా, ప్రమాదంలో 170 మంది వరకు గల్లంతు అయినట్టు స్థానిక అధికారులు తెలిపారని, తొలుత సొరంగంలో చిక్కుకుపోయిన వారిని కాపాడడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. కాగా, నిన్నటి జల ప్రళయంలో 170 మంది గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. గల్లంతైన వారంతా ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.