ఉచిత‌విద్య‌కు సునీల్ మిట్ట‌ల్ రూ.7000 కోట్లు

sunil mitttal
sunil mitttal

న్యూఢిల్లీ: టెలికాం దిగ్గజ సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌ సునీల్‌ మిట్ట‌ల్‌ కుటుంబం దాతృత్వ కార్యక్రమాలకు రూ.7,000 కోట్లు కేటాయించింది. సంస్థ తరఫున దాతృత్వ కార్యక్రమాలు నిర్వహించే భారతీ ఫౌండేషన్‌కు ఈ మొత్తం అందచేస్తారు. భారతీ కుటుంబం తమ సంపదలో 10 శాతాన్ని దాతృత్వానికి కేటాయించిందని సంస్థ తెలిపింది. భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ వ్యవస్థాపకులు, ఛైర్మన్‌ అయిన సునీల్ మిట్ట‌ల్‌ కుటుంబానికి భారతీ ఎయిర్‌టెల్‌లో ఉన్న 3 శాతం వాటా కూడా ఇందులో భాగమే. పేద కుటుంబాలకు చెందిన యువత, ఉచితంగా ఆధునిక నైపుణ్యాలు అభ్యసించేందుకు వీలుగా సత్యభారతి విశ్వవిద్యాలయాన్ని భారతీ కుటుంబం నెలకొల్పనుంది. సైన్స్‌, టెక్నాలజీ కోర్సులపై దృష్టి సారించే ఈ భవిష్యతరం విశ్వవిద్యాలయం ప్రధానంగా కృత్రిమ మేధ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ), రోబోటిక్స్‌తో పాటు మరిన్ని కోర్సులను ఇక్కడ అభ్యసించే వీలుంటుంది. ఉత్తరభారతంలో నెలకొల్పే ఈ విశ్వవిద్యాలయం, తొలి విద్యాసంవత్సరం 2021లో ప్రారంభమవుతుంది.
అధికమొత్తం విశ్వవిద్యాలయానికే
భారతీ కుటుంబం దాతృత్వానికి విరాళంగా ప్రకటించిన రూ.7,000 కోట్లలో అధికభాగం ఈ విశ్వవిద్యాలయానికే కేటాయిస్తామని సునీల్ మిట్ట‌ల్‌ ఇక్కడ తెలిపారు. దీనిస్థాపనకు అవసరమైన భూమి కోసం సంప్రదింపులు పూర్తికావచ్చాయని వెల్లడించారు.
హోల్డింగ్‌ కంపెనీ అయిన భారతీ టెలికాం లిమిటెడ్‌కు భారతీ ఎయిర్‌టెల్‌లో 45.5 శాతం వాటా ఉంటే, ఇతర ప్రమోటర్లకు 21.66 శాతం వాటాలున్నాయి.
విద్య, పారిశుద్ధ్య కార్యక్రమాలపై భారతీ ఫౌండేషన్‌ ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తోంది. తమిళనాడు, పశ్చిమబంగా, పంజాబ్‌, రాజస్థాన్‌, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లలో 249 సత్యభారతీ పాఠశాలలు ఈ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి.