ఉగ్ర‌వాదుల‌కు అడ్డా హైద‌రాబాద్ః ల‌క్ష్మ‌ణ్‌

K. Laxman
K. Laxman

హైదరాబాద్‌: హైదరాబాద్ నగరం ఉగ్రవాద రహస్య స్థావరంగా మారిందని బిజెపి తెలంగాణ‌ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. దేశంలో ఎక్కడ దాడులు జరిగినా హైదరాబాద్‌లోనే మూలాలు ఉంటున్నాయని చెప్పారు. నగరంలో ఎన్ఐఏ నిన్న జరిపిన దాడుల్లో పెద్దఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకోవడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. పాతబస్తీలో మజ్లిస్ ప్రాబల్యమున్న ప్రాంతాల్లో చొరబాటు దారులు యథేచ్ఛగా నివసిస్తున్నారని లక్ష్మణ్ ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నప్పటికీ మజ్లిస్‌తో రాజకీయ స్నేహం కారణంగా తెరాస ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదని లక్ష్మణ్‌ ఆరోపించారు. పట్టుబడిన వారిని కూడా కేవలం మందలించి వదిలిపెట్టడం ప్రభుత్వ అలసత్వానికి అద్దం పడుతోందని మండిపడ్డారు. కట్టడి చేయాల్సిన పాలకులే మద్దతు దారులతో చేతులు కలపడం సరికాదని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌తో పాటు నల్గొండ, నిజామాబాద్ లోనూ గతంలో ఉగ్రవాద కదలికలు కనిపించాయని లక్ష్మణ్ గుర్తుచేశారు. ప్రభుత్వం ఇకనైనా మెతక వైఖరి వీడి అసోం తరహాలో కట్టడి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.