ఈ సారి ఐసెట్ ప‌రీక్ష ఆన్‌లైన్‌లోనే..

online exam
online exam

వ‌రంగ‌ల్ః ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఐసెట్‌ – 2018ని మే 23, 24 తేదీల్లో ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ పాపిరెడ్డి తెలిపారు. బుధవారం కాకతీయ యూనివర్సిటీ కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ సెమినార్‌ హాల్‌లో ఐసెట్‌ కన్వీనర్‌ నిర్వహణ కమిటీ సమావేశంలో జరిగింది. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈనెల 22న ఐసెట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని, మార్చి 6 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఏప్రిల్‌ 30 వరకు అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మే 5 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని, మే 23, 24 తేదీల్లో మూడు సెషన్స్‌లో ఆన్‌లైన్‌లో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉర్దూ మీడియంలోనూ ఐసెట్‌ నిర్వహించనున్నటు వివరించారు. ఈసారి పరీక్షలకు సుమారు 80 వేల మంది హాజరయ్యే ఆస్కారం ఉందని ఆయన తెలిపారు.