ఈ పాపంలో పాలకుల భాగం లేదా?

ఒక్కమాట

(ప్రతి శనివారం)

Boat Dead Bodies
Boat Dead Bodies

ఈ పాపంలో పాలకుల భాగం లేదా?

ఎంతగా ఓదార్చినా మరెన్ని మాటలు చెప్పినా, ఇంకెన్ని లక్షలు ఇచ్చినా పోయిన ప్రాణాలు తిరిగిరావ్ఞ. భార్యను కోల్పోయినభర్త, భర్తను కోల్పోయిన భార్య, బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రుల గర్భశోకాన్ని ఏమిచ్చినా తీరేవి కావ్ఞ. ఈ ప్రమాదంలో తన ఇరవైనాలుగేళ్ల కుమార్తె మరణించిందని తెలిసి ఇంటివద్ద ఉన్న తల్లి గుండె ఆగి మరణించింది.ఈ సంఘటన బండరాయి గుండెను కూడా కరిగిస్తున్నది. ఇలాంటి సంఘటనలు పునరావృతంకాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని పాలకులు పదేపదే ప్రకటిస్తున్నారు. ఇప్పుడేకాదు గతంలో కూడా ఎన్నోసార్లు ఇలాంటి ప్రకటనలు గుప్పించారు. కానీ పాలకుల చేతకాని తనాన్ని అధికారుల అవినీతి, అసమర్థతను ఆశ్రితపక్షపాతాన్ని చాటుకుంటూ ఏదో ఒక రూపంలో ఇలాంటి దురదృష్టపు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అందుకు ముందుగా నిందించాల్సింది, తప్పుపట్టాల్సింది పాలకులనే.

చట్టాలకు సామాన్యులు లోకువ. సమర్థులకు చట్టాలు లోకువంటారు.ఏ సందర్భంలో ఎవరిని ఉద్దేశించి అన్నారో కానీ మారిన కాలమాన పరిస్థితుల్లో అది అక్షరాలా నిజమనిపిస్తున్నది.ఆర్థిక,అంగ,అధికార, రాజకీయ బలం ఉన్నవారు తప్పు చేస్తే చర్యల సంగతి అటుంచి వేలెత్తి చూపడానికి కూడా జంకే దురదృష్టపు పరిస్థితులు దాపురించాయి.అదే ఏ బలం లేనివారు తప్పు చేస్తే చట్టం మాత్రం అన్ని కోణాల్లో తనపని తాను చేసుకుంటుంది. శిక్షపడే వరకు వదిలిపెట్టదు.చిన్నచిన్న పొరపాట్లు, తప్పులేకాదు పెద్దస్థాయిలో తప్పులు జరిగి పదుల సంఖ్యలో అమా యకుల ప్రాణాలు పోయినప్పుడు, బాధ్యులైన వారిని వదిలిపెట్టం, ఎంతటివారైనా తప్పించుకోలేరు అంటూ హుంకరింపులు, ప్రకటనలు పదేపదే విన పడుతుంటాయి. ఆ తర్వాత విచారణలకు కమిషన్‌లు వేయడం, కాలయాపనచేసి నివేదికలను అటకెక్కించడం మామూలుగా మారిపోయింది.

అందుకే ఈ విచారణలు అన్నా, దర్యాప్తు కమిటీలన్నా, వారు ఇచ్చే నివేదికలన్నా ప్రజల్లో నమ్మకాలు సన్నగి ల్లాయి.తాజాగా ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజ ధానిఅమరావతికి సమీపంలో కృష్ణానదిలో ఫెర్రిఘాట్‌వద్ద జరిగిన ఘోరపడవ ప్రమా దంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. యధావిధిగా పాలకులను ఇరుకున పెట్టేందుకు విపక్షం తనవంతు ప్రయత్నం చేస్తున్నది.ఇందులో తమ తప్పుఏమీ లేదని, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని,పాలకులు చెప్తున్నారు. అనుమతి లేని బోటు యజమాన్యాన్ని,ఆ పడవ నడిపేందుకు కనీసం డ్రైవింగ్‌ లైసెన్సులేని డ్రైవర్‌తోసహా ఏడుగురిని అరెస్టుచేసినట్లు విజయవాడ పోలీసు కమిషనర్‌ ప్రకటించారు.వారే ఈ సంఘటనకు కారకులని, వారిపై చట్టరీత్యా కఠినచర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్‌ విలేక రుల సమావేశంపెట్టి మరీ ప్రకటించారు. మరొకపక్క టూరిజం శాఖామంత్రి సంబంధిత అధికారులను సస్పెండ్‌ చేసినట్లు వెల్లడిం చారు.

దర్యాప్తు కొనసాగుతుందని ప్రకటించారు.ఇరవైఒక్క మందిని పొట్టనపెట్టుకున్న ఈఘోరదుర్ఘటనకు వీరిదేనా బాధ్యతా? ఇంకెవ రికి ఇందులో పాత్రలేదా?తదితరప్రశ్నలు సహజంగానే తలెత్తుతు న్నాయి. ఈ సంఘటన ఎక్కడో అధికార యంత్రాంగానికి దూరంగా మారుమూలప్రాంతంలో జరగలేదు.

ముఖ్యమంత్రి, మంత్రులు ఉన్న తాధికారులు అందరూఉండే నవ్యాంధ్రరాజధాని అమరావతికి కూత వేటుదూరంలో జరిగింది. చేపలనుపట్టడానికి ఉపయోగించే పాత పడవకు రంగులేసి టూత్‌పాలిష్‌చేసి తీసుకువచ్చి అక్కడపెట్టారు. పార్కింగ్‌ ఏర్పాటుచేశారు.స్థానిక అధికారులు అక్కడి నుంచి పంపిం చినట్లు చెప్తున్నారు.

మళ్లీ ఆ పడవ అక్కడికి ఎలావచ్చి చేరుకుంది? టూరిజం శాఖకు చెందిన పడవలు పార్కు చేసే ఆవ రణలోకి ఎలా అనుమతించారు?ఇందులో ఒక ప్రముఖనేత హస్తం ఉందనే ఆరోప ణలు వినిపిస్తున్నాయి.ఇక సంఘటనకు సంబంధించి చూస్తే ఒకటి రెండుకాదు అన్నీతప్పులే. డ్రైవర్‌కు లైసెన్సులేదు. నదిలో ఏ మార్గంలో పయనించాలో నావిగేషన్‌ రూట్‌ తెలియదు.

సిబ్బందితో సహా ఇరవైఐదు మంది సామర్థ్యం ఉండే ఈపడవలో దాదాపు 43 మందిని ఎక్కించారు. డబ్బులకు కక్కుర్తిపడి పడవలో ప్లాస్టిక్‌ కుర్చీలువేసి రెట్టింపుస్థాయిలో పర్యాటకులను అందులో కుక్కు తుంటే అక్కడున్న అధికారులు ఏమిచేశారు? లైఫ్‌ జాకెట్లులేవ్ఞ. అనుమతిలేదు.అన్నీ నిబంధనలకు విరుద్ధంగానే జరిగాయి. తప్పుల మీద తప్పులుజరుగుతుంటే అధికార యంత్రాంగం కళ్లు ఎందుకు మూసుకున్నది? ఏదిఏమైనా విహారయాత్రకు వచ్చిన అమాయకులు బలైపోయారు.

ఇక సానుభూతివర్షం కురిపిస్తున్నారు. మృతుల కు టుంబాలకు పదిలక్షలరూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రక టించారు.ఓదార్పులు పలుకుతున్నారు.ఎంతగా ఓదార్చినా మరెన్ని మాటలు చెప్పినా,ఇంకెన్ని లక్షలుఇచ్చినా పోయినప్రాణాలు తిరిగి రావ్ఞ.భార్యను కోల్పోయినభర్త, భర్తనుకోల్పోయిన భార్య,బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులగర్భశోకాన్ని ఏమిచ్చినా తీరేవికావ్ఞ. ఈ ప్రమాదంలో తన ఇరవైనాలుగేళ్ల కుమార్తె మరణించిందని తెలిసి ఇంటివద్ద ఉన్న తల్లి గుండె ఆగి మరణించింది.ఈ సంఘటన బండరాయి గుండెను కూడా కరిగిస్తున్నది. ఇలాంటి సంఘటనలు పునరావృతంకాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని పాలకు లు పదేపదే ప్రకటిస్తున్నారు. ఇప్పుడేకాదు గతంలో కూడా ఎన్నో సార్లు ఇలాంటి ప్రకటనలు గుప్పించారు.

కానీ పాలకుల చేతకాని తనాన్నిఅధికారుల అవినీతి, అసమర్థతను ఆశ్రితపక్షపాతాన్ని చాటు కుంటూ ఏదో ఒక రూపంలో ఇలాంటి దురదృష్టపు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అందుకు ముందుగా నిందించాల్సింది, తప్పు పట్టాల్సింది పాలకులనే. ఇలాంటి సంఘటనలు జరిగి ప్రాణ నష్టం జరిగినప్పుడల్లా లోతుగా దర్యాప్తు జరగడం లేదు. పైకి కన్పించే కొందరిపై చర్యలు తీసుకోవడంతో సరిపెడుతున్నారు. అస లు ఈ సంఘటనలకు వెనుక ఉన్న పాత్రధారులు ఎవరు? సూత్ర ధారులు ఎవరు? తదితర విషయాలవైపు దర్యాప్తు అధికారులు దృష్టిపెట్టడం లేదు.

అందుకు వారికున్న కారణాలు, పరిమితులు, భయాలు వారికున్నాయి.2015 జూన్‌లో గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి ఘాట్‌లో జరిగిన దురదృష్టపుకర సంఘట నలకు సంబంధించి ఇప్పటికి ఎవరిపై చర్యలు తీసుకున్నారు? బాధ్యులెవరు? ఆ సంఘటన ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? తదితర ప్రశ్నలకు ఇప్పటికీ జవాబు లేదు. ఈ సంఘటన పుర్వాప రాలు పరిశీలించి విచారణజరిపి బాధ్యులను గుర్తించేందుకు హై కోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ సి.వై సోమయాజులతో నియమిం చిన ఏకసభ్యకమిషన్‌ నివేదిక ఇప్పటికీ ఎందుకు బయటకి రాలేదు? ఎంతో పుణ్యప్రదమని కోట్లాది మంది ప్రజలు భావించి గోదావరి తల్లి ఆశీస్సులు అందుకుందామని భక్తివిశ్వాసంతో గంపెడంత ఆశ తో ఆత్రుతతో వచ్చినవారికి ఎంతటి చేదు అనుభవాలు మిగిలాయో ప్రత్యేకంగా చర్చించాల్సిన అక్కర్లేదు.

31మందికిపైగా మృత్యువాత పడ్డారు. నివేదిక రాకపోయినా ప్రభుత్వం వెల్లడించకపోయినా ఆ దుర్ఘటనకు కారణమేమిటి? కారకులు ఎవరనేది అక్కడ ఏమి జరి గిందో ప్రజలకు తెలియదనుకుంటే పొరపాటు.రాజమండ్రివద్ద అదొ క్కటే ఘాట్‌కాదు. ఎన్నో ఘాట్‌లున్నాయి.తండోపతండాలుగా వచ్చి న జనాన్ని ఇతర ఘాట్‌ల సమాచారం ఇచ్చి పంపడంలో సంబంధి త అధికారులు విఫలంకావడం ఈ సంఘటనకు నాంది పలికిందని చెప్పొచ్చు. విఐపి ఘాట్‌లో పుష్కర స్నానం చేయాల్సిన ముఖ్య మంత్రిని ఈ ఘాట్‌లోకి తీసుకురావడంతో తొక్కిసలాటకు ఆస్కా రం ఏర్పడింది.

ముఖ్యమంత్రివెళ్లిన తర్వాత ఒక్కసారిగా రెండు వైపుల నుంచి జనంతోసు కురావడంతో తొక్కిసలాట జరిగింది. ముఖ్యమంత్రిని ఈఘాట్‌ వద్దకు ఎందుకు ఎవరు తీసుకువచ్చారో? ఎవరు సలహా ఇచ్చారో? తది తర అంశాలు పరిశీలిస్తే కారకుల గురించి తెలుసుకోవడం పెద్దపని కాకపోవచ్చు.పోని రద్దీపెరిగిన సమయంలోనైనా అక్కడ ఉన్నగోడను కూల్చివేసినా ఎన్నో ప్రాణాలు దక్కేవి. ఇకప్లాస్టిక్‌ వాడకూడదని,వాడటం లేద నిప్రచారం చేసేందుకు తెచ్చినమంచి నీటి ప్లాస్టిక్‌ ప్యాకేట్లనుఅందుబాటులో ఉంచలేదు.అందుకే తొక్కిస లాటకంటే దాహం దాహం అంటూ గుక్కెడునీళ్లు దొరకక ప్రాణాలు వదిలన వారు అధిక సంఖ్యలో ఉన్నారనేవిమర్శలు వెల్లు బుకాయి. గోదావరి ఒడ్డున దాహంతో జనం మరణించారంటే ఈ దౌర్భాగ్య పరిస్థితికి ఎవరు కారకులో పాలకుల కు తెలియందికాదు.

ప్రధానంగా ముఖ్యమంత్రి తమవారే అనే ధీమాతో కొందరు అధికారులు మితిమీరి ప్రవర్తించినట్లు కూడా ఆరో పణల్లో వాస్తవం లేకపోలేదు..అక్కడ పరిస్థితులను పర్యవేక్షిం చేందుకు ఐదుగురుమంత్రులను నియమించారు. వీరంతా ఏమి చేసినట్లు? సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కన్పడుతుంది. మొత్తం ఈ సంఘటనలో పోలీసుల వైఫల్యం ప్రత్యేకంగా చెప్ప క్కర్లేదు. 31మందిని పొట్టనపెట్టుకోడానికి తిలాపాపం తలాపిడికెడు అన్నట్లు చెప్పకతప్పదు.రెండేళ్లుదాటినా జస్టిస్‌ సోమయాజుల నివేదిక నేటికీ వెలుగుచూడలేదు. ఎందుకు జాప్యం చేస్తున్నారు?ఆ సంగతి అలా ఉంచితే ఈ తప్పిదాలకు ఎవరుకారకులో, కారణాలు ఏమిటో? వాస్తవాలు ఏమిటో? ముఖ్యమంత్రికి తెలియదనుకోలేం. తెలుసుకో లేనంత అసమర్థులుకాదాయన.

కడుపుచించుకుంటే కాళ్లమీద పడు తుందనే విషయం కూడా ఆయనకు తెలుసు. ఎందుకో ఏమోకానీ చంద్రబాబునాయుడులో గతంలో ఉన్నసామర్థ్యం, సమర్థత కీలెరిగి వాతపెట్టే నైపుణ్యత తగ్గిపోతున్నదేమోననిపిస్తున్నది. అందుకు పెరుగుతున్న వయస్సు, మారిన కాలమాన పరిస్థితులు కావచ్చు. అందుకే సర్దుకుపోవడం సౌఖ్యంఅన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఏదిఏమైనా అమరావతిలో జరిగిన పడవ ప్రమాదం కానీ, ఆనాడు గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట కానీ మనిషికి మనిషి చేసిన ద్రోహమే. ఇందులో తప్పుచేసిన వారినిరక్షించే ప్రయత్నం చేసినా అది తాత్కాలికమే.

రాజకీయబలంతో తప్పించుకున్నా మన కందని కోర్టు ఒకటి ఉంటుందనేవిషయాన్ని విస్మరించకూడదు. ఇది వేదాంతమేకావచ్చు. అది వచ్చే జన్మలో అనుభవించాల్సి వస్తుంద నేదికూడా పొరపాటే. చేసిన పాపం ఈ జన్మలోనే అనుభవించి జీవి తాన్ని బ్యాలెన్స్‌ చేసుకొనిపోవాల్సి ఉంటుంది.ఈ విషయం మహా భారతంలో వ్యాసమహర్షి భీష్మపర్వంలో చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పటికే కొందరి పెద్ద లకు ఇది అనుభవంలోకి కూడా వస్తున్నది. ఏదిఏమైనా అవినీతి అసమర్ధత అహంకారం అనుభవరాహిత్యం మూర్తీభవించి న కొందరు అధికారులకు కొందరు నేతలకు పెద్ద పీటవేస్తే ఇలాంటి సంఘ టనలు పదేపదే జరుగుతూనే ఉంటాయి. అన్నెపున్నెం ఎరుగని అమాయకులు బలవుతూనే ఉంటారు.

– దామెర్ల సాయిబాబ