ఇ-కామర్స్‌లోకి ముకేశ్‌ అంబానీ

MUKESH AMBANI
MUKESH AMBANI

చమురు, టెలికాం రంగాల్లో ప్రభంజనం సృష్టించిన ముకేశ్‌ అంబానీ చూపు ఇ-కామర్స్‌ రంగంపై పడింది. త్వరలోనే జియో, రిలయన్స్‌ రిటైల్‌ కలిసి సరికొత్త ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఏర్పాటు చేస్తాయని శుక్రవారమిక్కడ జరిగిన ఉజ్వల గుజరాత్‌ సదస్సులో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ ప్రకటించారు.ముందుగా గుజరాత్‌లోని 12 లక్షల మంది రిటైలర్లు, స్టోర్‌ యజమానుల కోసం ఈ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంను తీసుకు రానున్నట్లు ఆయన వివరించారు. తమ జియో స్టోర్లు, రిటైల్‌ నెట్‌వర్క్‌ను ఇందుకు ఉపయోగించుకుంటామని తెలిపారు. దేశీయ ఆన్‌లైన్‌ విపణిలో అమెరికా దిగ్గజం అమెజాన్‌ అనుబంధ అమెజాన్‌ ఇండియా, మరో దిగ్గజ సంస్థ వాల్‌మార్ట్‌ ఆధీనంలోని ఫ్లిప్‌కార్ట్‌కు దీటుగా దేశీయంగా మరో అగ్రశ్రేణి సంస్థ ప్రవేశించినట్లవుతుంది.