ఇ-కామర్స్‌కు పోటీగా ‘రిలయన్స్‌ రిటైల్‌’

Mukesh Ambani
Mukesh Ambani

కోల్‌కతా: రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్‌, అంతర్జాతీయ ఇ-కామర్స్‌ కంపెనీ అమెజాన్‌లకు పోటీగా రిలయన్స్‌ రిటైల్‌, స్మార్ట్‌ఫోన్లు, టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ కండీషనర్లను ఆన్‌లైన్‌లో అమ్మకాలు ప్రారంభించేందుకు సంసిద్ధమై ఒక వెంచర్‌ ఏర్పాటు చేసినట్లు ఇద్దరు సీనియర్‌ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌లు చెప్పారు. స్మార్ట్‌ఫోన్లను, ఎలక్ట్రానిక్స్‌ను ఆన్‌లైన్‌గా విక్రయించడానికి రిలయన్స్‌ రిటైల్‌ ఆన్‌లైన్‌ షాపును లాంచ్‌చేసిందని తెలిసింది. అయితే ప్రస్తుతం ఇ-కామర్స్‌ దిగ్గజాలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లకు స్మార్ట్‌ఫోన్లు, టివిలు, ఎలక్రానిక్స్‌ ఉత్పత్తులు సుమారు 55 శాతం నుంచి 60 శాతం వ్యాపారాన్ని కలిగిస్తున్నాయి. అయితే అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ ఏ విధంగా ఆఫర్లు ఇస్తుందో అదేవిధంగా వచ్చే పండగ సీజన్‌లో రిలయన్స్‌ రిటైల్‌ కూడా ఆఫర్లు ఇవ్వనుంది. ఇతర ఆన్‌లైన్‌ మార్కెట్‌ప్లేస్‌ల లాగానే పాత మోడల్స్‌పై, ఎక్స్‌క్లూజివ్‌ మోడల్స్‌పై ఎప్పడికప్పుడూ భారీ డిస్కౌంట్లను రిలయన్స్‌ రిటైల్‌ ఆఫర్‌ చేయనుందని ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌ చెప్పారు. ఇతర ప్రొడక్ట్‌లు కూడా రిలయన్స్‌ డిజిటల్‌ ఆఫ్‌లైన్‌ స్టోర్‌ ధరలకు సమానంగా ఉండనున్నాయని తెలిపారు. ఇప్పటికే రిలయన్స్‌ డిజిటల్‌లో ఎల్‌జి, శాంసంగ్‌,సోని, షావొమి, పానాసోనిక్‌ వంటి పెద్ద కంపెనీల స్మార్ట్‌ఫోన్లను తక్కువ ధరలకే వినియోగదారులకు అందిస్తోంది. రిలయన్స్‌ డిజిటల్‌ను విస్తరించడానికి ఇదొక ఓమ్నిఛానల్‌. ఇది ఆన్‌లైన్‌ కార్యకలాపాలను విజయవంతం చేయడానికి ఎక్కువగా దృష్టి సారిస్తోంది అని మరో ఎగ్జిక్యూటివ్‌ తెలిపారు.