ఇస్రో నూత‌న ఛైర్మ‌న్ శివ‌న్ నియామ‌కం

Shivan
Shivan

న్యూఢిల్లీ: ఇస్రో కొత్త చైర్మన్‌గా కే శివన్ ఎంపికయ్యారు. ఆయన విక్రమ్ సారాబాయి అంతరిక్ష సంస్థకు డైరెక్టర్‌గా ఉన్నారు. మూడేండ్ల పాటు ఆయన ఇస్రో చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. దానితో పాటు స్పేస్ డిపార్ట్‌మెంట్‌కు సెక్రటరీగా ఆయన వ్యవహరిస్తారు. ఇదివరకు ఇస్రో చైర్మన్‌గా ఏఎస్ కిరణ్ కుమార్ ఉన్నారు. ఆయన జనవరి 12, 2015 నుంచి ఇస్రో చైర్మన్‌గా ఉన్నారు. మరో రెండు రోజుల్లో శ్రీహరికోట నుంచి ఇస్రో 100వ శాటిలైట్‌ను లాంచ్ చేయనున్న తరుణంలో ఇస్రో చైర్మన్‌గా శివన్‌ను నియమించటం ప్రాధాన్యం సంతరించుకున్నది.

శివన్ ప్రస్థానం
1982లో కే శివన్ ఇస్రోలో జాయిన్ అయ్యారు. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (పీఎస్‌ఎల్‌వీ) ప్రాజెక్ట్‌తో తన ప్రస్థానాన్ని ఆయన ప్రారంభించారు. మద్రాస్ ఐఐటీ నుంచి 1980లో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చేసిన శివన్, 1982 లో ఐఐఎస్‌సీ బెంగళూరు నుంచి మాస్టర్ ఆఫ్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. తర్వాత 2006లో బాంబే ఐఐటీ నుంచి ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. పీఎస్‌ఎల్‌వీ ప్రాజెక్ట్ మిషన్ ప్లానింగ్, మిషన్ డిజైన్, మిషన్ ఇంటిగ్రేషన్ అండ్ అనాలిసిస్‌లో శివన్ ముఖ్య పాత్ర పోషించారు. తన కెరీర్‌లో శివన్ ఎన్నో అవార్డులను అందుకున్నారు. 2014లో సత్యబామ యూనివర్సిటీ, చెన్నై నుంచి డాక్టర్ ఆఫ్ సైన్స్ అవార్డు, 1999 లో విక్రమ్ సారాబాయ్ రీసెర్చ్ అవార్డును ఆయన అందుకున్నారు.