ఇస్రో గ’ఘన’విహారం!

             ఇస్రో గ’ఘన’విహారం!

ISRO
ISRO

భారత అంతరిక్ష పరిశోధనలో విజయాలు కొత్తకాకపోయినప్పటికీ వరుస ఉపగ్రహ ప్రయోగాలు శాస్త్రవేత్తల పరిశోధనలకు మరింత ప్రోత్సాహాన్నిస్తున్నాయి. ఇప్పటివరకూ దేశీయంగానే ఉన్న సాంకేతికపరిజ్ఞానంతో రూపొందించిన లాంచ్‌ప్యాడ్‌లపై స్వదేశీ, విదేశీ ప్రయోగాలు చేపడుతున్న శాస్త్రవేత్తలు విదేశాలతోసైతం ఒప్పందాలుచేసుకుని నేరుగా ఆయా దేశాలనుంచే ఉపగ్రహ ప్రయోగాలు చేపడుతున్నారు. ఏకమొత్తంలో 100కుపైగా ఉపగ్రహాలుప్రయోగించిన ఘనత మన ఇస్త్రో శాస్త్రవేత్తలదేనని చెప్పవచ్చు.

విద్యార్ధులురూపొందించిన ఉపగ్రహాలనుసైతం ఇస్రో శాస్త్రవేత్తలు మరింతప్రోత్సహించి అంతరిక్షంలోనికి ప్రయోగం చేసిన సందర్భాలున్నాయి. తమ విస్తృత పరిశోధనల్లో భాగంగానే ఇపుడు ఫ్రెంచిగయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి కూడా మన ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలోకి చేరుస్తున్నారు. బుధవారం తెల్లవారుఝామున 2.21 గంటలకు ఫ్రెంచిగయానాలోని ఏరియన్‌ అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన ఏరియన్‌ 5 (విఎ 247) రాకెట్‌ ద్వారా మన దేశీయ ఉపగ్రహం జిశాట్‌ 31ని విజయవంతంగా ప్రయోగించి భారత అంతరిక్ష పరిశోధనలను విశ్వవ్యాప్తంచేయగలిగారు.

ఫ్రెంచి శాస్త్రవేత్తలతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అనుబంధం ఈనాటిది కాదని ఈ ప్రయోగాన్ని పర్యవేక్షించిన అధికారులు సైతం ఏకీభవించారంటే విదేశీ పరిజ్ఞానాన్ని సైతం అందిపుచ్చుకుని భారత అంతరిక్ష పరిశోధనల్లో మరింత ముందుకు పోతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి గతంలో కూడా ఫ్రెంచ్‌లోని గయానా కేంద్రంనుంచి అంతరిక్షంలోనికి భారత ఉపగ్రహాలను పంపించిన సందర్భాలున్నాయి. 1981లోనే భారత శాస్త్రవేత్తలో ప్రయోగాత్మకంగా రూపొందించిన ఆపిల్‌ ఉపగ్రహాన్ని ఏరియన్‌ రాకెట్ల ద్వారానే ప్రయోగించారు.

అప్పట్లో ఏరియన్‌ ఫ్లైట్‌ ఎల్‌03 రాకెట్‌ ద్వారా మన ఆపిల్‌ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది. ఆతర్వాత ఏరియన్‌ అంతరిక్ష పరిశోధన సంస్థతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 21 ఉపగ్రహాల ప్రయోగానికి ఒప్పందంచేసుకుంది. వీటిలోభాగంగానే బుధవారం తెల్లవారుఝామున ప్రయోగించిన జిశాట్‌ 31 భారత్‌పరంగా 23వ ఉపగ్రహంగా రికార్డులకెక్కింది. మరో ఉపగ్రహం జిశాట్‌ 30ని ఏరియన్‌ 5 రాకెట్‌ ద్వారా ఈ ఏడాది జూన్‌, జూలై నెలల్లో ప్రయోగించేందుకు అధికారులు కసరత్తులుచేస్తున్నారు. ఇస్రో ఉపగ్రహం జిశాట్‌ 31తో పాటు ఏరియన్‌ 5 రాకెట్‌ ద్వారా సౌదీ అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన 6495 కిలోల బరువు ఉన్న హెల్లాస్‌ శాట్‌ 4 ఉపగ్రహాన్ని కూడా వెనువెంటనే ప్రయోగించారు.

తాజాగాప్రయోగించిన ఉపగ్రహంతో సమాచారరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని అంచనా. రోదశిలోనికి వదిలిన ఈ ఉపగ్రహంతో విస్తృతప్రయోజనాలున్నాయనే చెప్పాలి. గత నెలలో శ్రీహరికోట నుంచి పిఎస్‌ఎల్‌వి సి-44 రాకెట్‌ ప్రయోగ విజయం తర్వాత ఈ ఏడాది ఇది రెండవ గగనవిజయంగా జిశాట్‌-31నే పేర్కొనవచ్చు. 42 నిమిషాల 27 సెకన్లలో భారత శాస్త్రవేత్తలు నిర్దేశించిన భూమికి దగ్గర దూరం 250 కిలోమీటర్లు పెరిజి, భూమికి ఎక్కువదూరం 35,850 కిలోమీటర్లు అపోజి భూస్థిరకక్ష్యలో ఈ ఉపగ్రహాన్ని ఏరియన్‌ రాకెట్‌ విడిచిపెట్టింది.

భారతీయ అధునాతన సమాచార ఉపగ్రహం జిశాట్‌ 31 నిర్ణీత కక్ష్యకు చేరడం కాకుండా అది క్షేమంగా పనిచేస్తున్నట్లు భూకేంద్రాలకు సమాచారం అందిందని ఇస్రోఛైర్మన్‌ నేరుగా ఫ్రెంచ్‌ గయానా కేంద్రంనుంచే ప్రకటించారు. ఈ ఉపగ్రహం సోలార్‌ ప్యానళ్లు సరిగ్గా విచ్చుకుని అంతరిక్షం నుంచి తన క్షేమ సమాచారాన్ని బెంగళూరు వద్దనున్న హసన్‌ మాస్టర్‌ కంట్రోల్‌కేంద్రానికిి సమాచారం అందించింది.హసన్‌ నుంచే ఈ ఉపగ్రహాన్ని నియంత్రించి భూమికి 36 వేల కిలోమీటర్ల అసలైన స్థితికి చేరుస్తారు.
2536 కిలోల బరువు ఉన్న జిశాట్‌ 31 ఉపగ్రహం ద్వారా భారత శాస్త్రవేత్తలు విస్తృతమైన సమాచార సేవలు పొందవచ్చని ఇస్రో శాస్త్రవేత్తలు చెపుతున్నారు.

ఇంతకుముందే ప్రయోగించిన ఇన్‌శాట్‌, జిశాట్‌ ఉపగ్రహాల శ్రేణిలోనే ఇపుడు ప్రయోగించిన జిశాట్‌ 31 పనిచేస్తుంది. ఇన్‌శాట్‌ 4సిఆర్‌, ఇన్‌శాట్‌ 4ఏ ఉపగ్రహ సేవలు ముగిసిన తర్వాత వాటి స్థానాన్ని ఈ ఒక్క ఉపగ్రహమే భర్తీ చేస్తుందని ఘంటాపథంగా వెల్లడించారు. భారత సమాచార ఉపగ్రహాల్లో ఇది 40వదిగా శాస్త్రవేత్తలు చెపుతున్న ఈఉపహ్రం పనితీరులో కొన్ని ప్రత్యేకతలను సైతం సంతరించుకుంది. ఎటిఎం సేవలు విస్తృతం చేయడానికి జిశాట్‌ 31 ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. ఒకేసారి అనేక ప్రాంతాలకు కమ్యూనికేషన్‌ సౌకర్యాలు చురుగ్గా అందుబాటులోకి రావడానికి జిశాట్‌ 31 ఉపయోగపడుతుందని ఇస్రో పరిశోధనల్లో తేలింది.

భారత భూభాగంతో పాటు మారుమూల దీవులను సైతం ఈ ఉపగ్రహంలోని అత్యాధునిక కెమెరాలు జల్లెడ పట్టి ఛాయాచిత్రాలు భూమికి పంపిస్తాయి. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలపై పరిశోధనలకు సాయపడుతుంది. ముఖ్యంగా ప్రకృతి వైపరిత్యాలు పసిగట్టడానికి ఈ-గవర్నెన్స్‌క ు, డిటిహెచ్‌ ప్రసారాల ఆధునీకరణకు జిశాట్‌ 31లోని శక్తివంతమైన కెయు బ్యాండ్‌ ట్రాన్స్‌పాండర్లు సహాయపడతాయి. విశాట్‌ సర్వీసులు, బ్రాడ్‌కాస్టింగ్‌ సౌకర్యాలు, స్టాక్‌ ఎక్స్జేంజి వంటివాటిలోను జిశాట్‌ 31 మెరుగైన సేవలు అందించగలదని చెప్తున్నారు.

ఇంత బహుళ ప్రయోజనకారి అయిన ఈ ఉపగ్రహ ప్రయోగ విజయంతో అంతరిక్షపరిశోధనల్లో అగ్రరాజ్యాలకు తీసిపోని విదంగా భారత్‌ పరిశోధనలు ఉన్నాయని ప్రపంచానికి చాటిచెప్పినట్లయింది. అందులోనూ బాద్యతలు స్వీకరించిన ఏడాదికాలంలోనే తొమ్మిదిప్రయోగాలను నిర్వహించి విజయవంతం అయిన ఛైర్మన్‌ డా.కె.శివన్‌కు ట్రిపుల్‌ హ్యాట్రిక్‌ అనే చెప్పాలి. గత ఏడాదిలో కూడా డిసెంబరు 5న ఫ్రెంచి గయానానుంచిజిశాట్‌ 11 మహాబలి ఉపగ్రహప్రయోగాన్ని శివన్‌ ఆధ్వర్యంలోనే నిర్వహించారు. తిరిగి తాజాగా జిశాట్‌ 31 ఉపగ్రహాన్ని అదే కేంద్రంనుంచి అంతరిక్ష కక్ష్యలోనికి ప్రవేశపెట్టారు.

శివన్‌ ఆధ్వర్యంలో జిశాట్‌ ఉపగ్రహాలతోపాటు రెండు జిఎస్‌ఎల్‌వి రాకెట్లు, నాలుగు పిఎస్‌ఎల్‌వి రాకెట్లు శ్రీహరికోత కేంద్రంనుంచే విజయవంతంగా ప్రయోగించారు.అద్భుతప్రయోగాలతో కీలకమైన ప్రాజెక్టులకు, ప్రతిష్టాత్మక ప్రయోగాలకు ఈ ఏడాది వేదిక అవుతుందని గతంలోనే ప్రకటించారు. కేవలం 28 రోజుల్లోనే జిశాట్‌31 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సర్వంసిద్ధంచేసారంటే శివన్‌నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం కృషి అనిర్వచనీయం అని చెప్పకతప్పదు. ఇక్కడితో ఆగకుండా రానున్న రోజుల్లో జిశాట్‌-30 ఉపగ్రహాన్నిసైతం ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు సన్నద్ధం అవుతున్నారంటే అంతరిక్ష పరిశోధనల్లో భారతశాస్త్రవేత్తల ప్రయోగాలు గగనవిహారం చేస్తున్నాయనే చెప్పవచ్చు.

– దామెర్ల సాయిబాబా, ఎడిటర్‌, హైదరాబాద్‌