ఇస్త్రీపెట్టె, ట్రక్కు గుర్తులను రద్దు చేయండి

KCR
KCR

పార్లమెంట్‌ ఎన్నికల్లోగా తొలగించిన ఓట్ల సవరణ
ఢిల్లీలో సీఓసీ సనీల్‌ అరోరాతో సిఎం కెసిఆర్‌ భేటీ
ఢిల్లీ నుంచి నేడు కెసిఆర్‌ తిరిగి హైదరాబాద్‌ రాక
హైదరాబాద్‌: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ ఆరోరాతో టిఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురువారంనాడు భేటీ అయ్యారు. ఢిల్లీలోని నిర్వాచన్‌ భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలు చర్చించారు. అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కారు గుర్తును పోలిన గుర్తులు ఇతర పార్టీల అభ్యర్థులకు కేటాయించవద్దని సిఎం కెసిఆర్‌ సీఈసీని కోరారు. కారు గుర్తును పోలిన ట్రక్కు,ఇస్త్రీ పెట్టె తదితర గుర్తులను రద్తు చేయాలని విజ్ఞప్తి చేశారు. కారు గుర్తును పోలిన ట్రక్కు గుర్తు వల్ల తమ అభ్యర్థులకు చాలా చోట్ల మెజారిటీ తగ్గిందని, 7చోట్ల ఓడిపోయారని సిఎం కెసిఆర్‌ వివరించినట్లు సమాచారం. అయితే గత 2014 ఎన్నికల సమయంలో స్వతంత్ర అభ్యర్థులకు ఆటో గుర్తు కారణంగా టిఆర్‌ఎస్‌ అభ్యర్థులకు నష్టం జరిగిందని భావించిన ఆ పార్టీ ఎంపీ వినోద్‌ కుమార్‌ కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించి ఈసారి ఎన్నికల్లో ఇండిపెండ్లతో పాటు ఇతర పార్టీ అభ్యర్థులెవ్వరికీ ఆ గుర్తు రాకుండా చేయగలిగారు. కానీ ఈసారి ట్రక్కు గుర్తు టిఆర్‌ఎస్‌ను ఇబ్బంది పెట్టింది. కారుకు ట్రక్కు బ్రేకులు పెట్టింది.
ఇదిలా ఉండగా,తెలంగాణలో బీసీ జనాభా గణన, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను త్వరలో ప్రారంభించ బోతున్నందున వాటిపై కూడా ఆయన చర్చించినట్లు సమాచారం. అలాగే, అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో సుమారు 22 లక్షలకు పైగా ఓట్లు గల్లంతైనట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రజత్‌కుమార్‌ వెల్లడిస్తూ అందుకు క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో ఇప్పటి వరకు తొలగించిన ఓట్ల పరిస్థితిపైనా చర్చించారని తెలుస్తోంది. త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో తొలగించిన ఓట్ల అంశంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి? చనిపోయిన వారి పేర్లు,రెండు,మూడు సార్లు జాబి తాలో వచ్చిన పేర్ల తొలగింపునకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనే అంశాలతో పాటు రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి వీవీ ప్యాట్‌లలో తలెత్తిన ఇబ్బందులపైనా వీరి భేటీలో చర్చకు వచ్చినట్లు సమాచారం. తెలంగాణలో ఓట్ల తొలగింపు వల్ల టిఆర్‌ఎస్‌కు నష్టం జరిగిందని, తొలగించిన ఓట్లను పరిశీలించాలని లోక్‌సభ ఎన్నికలకు ముందే సవరణలు చేయాలని సునీల్‌ అరోరాని సిఎం కెసిఆర్‌ కోరారని తెలుస్తోంది. కాగా సునీల్‌ ఆరోరాను కలిసిన సమయంలో సిఎం కెసిఆర్‌ వెంట ఎంపీలు వినోద్‌కుమార్‌, బండ ప్రకాశ్‌లు ఉన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సిఎం కెసిఆర్‌ బుధవారం ప్రధాని మోడీని కలిసి పలు కీలక అంశాలపై చర్చించిన విషయం తెలిసిందే.
తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ట్రక్కు గుర్తుతో టిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులకు నష్టం జరిగిందని ఎంపీ వినోద్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. ‘ట్రక్కు,కెమెరా,ఇస్ట్రీ పెట్టె,హ్యాట్‌ గుర్తులపై సునీల్‌ ఆరోరాతో కెసిఆర్‌ చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో కారు గుర్తును పోలిన ట్రక్కుతో ఓటర్లు గందరగోళానికి గురయ్యారు. 15 మంది అభ్యర్థులకు వెయ్యి నుంచి 15 వేల ఓట్ల నష్టం జరిగింది. వెయ్యి ఓట్ల వరకు చాలా నియోజకవర్గాల్లో నష్టం జరిగింది. అందువల్ల ట్రక్కు సింబల్‌ ఇకపై ఇవ్వొద్దని, ఎవరికీ కేటాయించవద్దని కెసిఆర్‌ సునీల్‌ ఆరోరాను కోరారు.ప్రజాస్వామ్యంలో ఓటర్లకు అనువుగా గుర్తులు ఉండాలి. ఓటర్లను గందరగోళానికి గురి చేసేలా గుర్తులు ఉండకూడదని సిఎం కోరారు. ఎన్నికల ముందే ఈ అంశంపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఎంపీలందరం ఫిర్యాదు చేశాం. కానీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఏమి చేయలేమని అన్నారు. మరో మూడు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కారును పోలిన గుర్తులను కేటాయించవద్దని, కారు గుర్తు సైతం పలుచని రంగులో ఉన్నందున ఆ రంగును పెంచాలని సిఎం కెసిఆర్‌ కోరారు. త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘం భేటీ అయి నిర్ణయం తీసుకుంటామని సునిల్‌ ఆరోరా సిఎం కెసిఆర్‌కు తెలిపారు. తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా సాగినందుకు కెసిఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు అని ఎంపీ వినోద్‌ పేర్కొన్నారు.
కాగా, తెలంగాణలో ఎన్నికలను సజావుగా నిర్వహించడంతో మర్యాద పూర్వకంగానే ఆయనను సిఎం కలిశారని టిఆర్‌ఎస్‌ వర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణ ఎన్నికలు జరగడానికి కొద్దిరోజుల ముందే సునీల్‌ ఆరోరా కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. 23వ తేదీన ఫెడరల్‌ ఫ్రంట్‌ యాత్రకు బయలుదేరిన ఆయన మొదట విశాఖలో శారదా పీఠాన్ని దర్శించారు. తర్వాత అదే రోజు సాయంత్రం ఒడిశా చేరుకుని అక్కడ ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో భేటీ అయ్యారు. మరుసటి రోజు ఉదయం అక్కడ జగన్నాధ్‌ దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం పశ్చిమబెంగాల్‌ బయలు దేరారు. అక్కడ మమతా బెనర్జీతో భేటీ అయి కాంగ్రెస్‌,బిజెపియేతర పక్షాలతో కలిసి ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు ఆవశ్యకతపై చర్చించారు. అక్కడే కాళీమాత దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అదే రోజు రాత్రి ఢిల్లీకి పయనమయ్యారు. నాలుగు రోజుల పాటు ఢిల్లీలోనే ఉన్నారు. మొత్తంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ యాత్ర ముగించుకుని శుక్రవారం ఆయన తిరిగి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. ఆయన హైదరాబాద్‌కు రాగానే మినీ మంత్రివర్గ విస్తరణ, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ అంశాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది.