ఇష్టమని లాగిస్తే ఊబకాయమే

Lady eat
మనసుకు నచ్చిన విధంగా ఆహారం తీసుకోవడం అనేది ఎంత హాయిగా ఉంటుందో కదా. కాని కొంత మంది ఏది ఎలా ఉన్నా సరే పార్టీలో కావాల్సింది లాగించేసి ఎంచక్కా నిద్రపోతే బాగుంటుందని అనుకునేవాళ్లు, ఇలా ఏదో సందర్భంలో ప్రతి ఒక్కరూ చేస్తూనే ఉన్నారు… కానీ కాస్త జాగ్రత్తగా గమనిస్తే. దీనివల్ల ఎంత నష్టపోతున్నామో తెలుసుకోవడానికి ఎక్కువ సమయం అవసరం లేదు.

అతిగా లాగించేసి… రాత్రి భోజనంలో ఎక్కువ ఆహారం తీసుకొని అలాగే నిద్రపోవడం వల్ల ఎక్కువగా తీసుకున్న కేలరీలు పొట్ట చుట్టూ చేరిపోతాయి. నిద్రపోయేప్పుడు ఎక్కువ కేలరీస్‌ ఖర్చు కూడా కావు. దీనివల్ల కూడా మరింతగా కొవ్వు పొట్ట భాగంలో పేరుకుపోతుంది. అలా క్రమంగా కొనసాగితే ఊబకాయం వచ్చే అవకాశం ఉంది అంటున్నారు ఆహార నిపుణులు.

అన్నీ నష్టాలే : దీనివల్ల తప్పకుండా సరైన శరీర ఆకృతి ఉండదు. ఇతర సమస్యలు కూడా చుట్టుముడతాయి. శరీరం దాని సహజ స్వభావాన్ని కోల్పోతుంది. బద్ధకంగా మారిపోతుంది.

సూర్యాస్తమయంతో ప్రారంభం
చాలా వరకు నగర జీవితం సూర్యాస్తమయం తరువాతే మొదలవుతుంది. అలసిపోయి ఇంటికి వెళ్లి వండుకునే ఓపిక ఉండదు. దీంతో ఏ రెస్టారెంట్‌లోనో లాగించేసి ఇంటికి చేరుకుంటారు. లేదా పార్సిల్స్‌ తీసుకెళ్లి తింటున్నారు. ఇవన్నీ కాదంటే ఏదో ఒక స్నాక్స్‌, డ్రింక్స్‌తో ముగిస్తారు. ఇందులో ఏమీ మంచి పద్ధతి కాదని నిపుణులు అంటున్నారు.

అన్నీ సమంగా ఉంటేనే… అనారోగ్యానికి కారణమయ్యే అన్నిటికీ గనుక దూరంగా ఉండాలంటే ముందుగా సూప్‌తో డిన్నర్‌ని మొదలు పెట్టడం మంచిది. కొన్ని పరిశోధనల్లో తేలిన విషయం ఏమిటంటే సూప్‌తో భోజనం మొదలు పెడితే తక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది. దీనితో పాటు ఎప్పటికప్పుడు బరువును కూడా చెక్‌ చేసుకోవాలి. డైట్‌ ప్లాన్‌ను తీసుకోవాలి. సూప్‌ తర్వాత సలాడ్‌ తీసుకోవాలి. వీటిలో పండ్లు, వెజిటేబుల్స్‌, వంటి వాటిలో డిఫరెంట్‌గా వాటిని తీసుకోవచ్చు. నిమ్మకాయ నీటిని చాట్‌మసాలా రాతి ఉప్పు, మిరియాల పొడి చేసిన సలాడ్స్‌ని కూడా ఎంచుకోవచ్చు.

అసలైన ప్లాన్‌
ముందుగా సంతృప్తి అనేది చాలా ముఖ్యం. ఇందుకోసం ఆహారాన్ని మూడు భాగాలుగా విభజించుకోవాలి. వీటిలో మొదటిది శరీరానికి శక్తినిచ్చేవి. రైస్‌, రోటీ, బ్రెడ్‌ వంటివి ఎక్కువగా ఉండేవి. అలాగే వ్యాధి నిరోధకశక్తిని పెంపొందించి, జీర్ణక్రియను మెరుగుపరిచేవి. ప్రొటీన్‌లు ఎక్కువగా ఉండే ఆహారం, శరీరంలో కొన్ని రకాల జీవక్రియలకు, రీ జనరేషన్‌కి ఉపయోగపడే పప్పు, పెరుగు, చేపలు వంటివి.

అన్నీ కలిసిన ఆహారం…
కూరగాయలతో చేసిన వంటతో కలిపి రోటీ, పప్పు తీసుకోవడం లేదా అన్నం, పెరుగు, కూరగాయలతో చేసిన కర్రీ మంచి కాంబినేషన్‌. బయటికి వెళ్లినా… లేదా ఇంట్లో ఆహారం తీసుకున్నా ఇవన్నీ ఉండేలా చూసుకోవాలి. అతిగా తీసుకోవడం మానుకోవాలి.

ఈ సమస్యలు దరిచేరవు
ఇలా కాకుండా నచ్చినట్లు ఆహారం తీసుకునే వారిని ఓసారి గమనిస్తే.. కళ్లకింద నల్లటి చారలు, పాలిన చర్మం, జుట్టు రాలడం, డల్‌గా ఉండటం, నీరసం, ఆయాసం వంటివెన్నో సమస్యలతో కనిపిస్తారు. కానీ సరైన ఆహారం తీసుకోవడం వల్ల ఇవేమీ దరిచేరవు అని నూట్రిషనిస్టులు చెబుతున్నారు. కనుక నచ్చింది కదా అని తినడం సరికాదు. పరిమిత ఆహారంతోనే ఆరోగ్యం.