ఇడి పిటిషన్‌ను కొట్టివేసిన సిబిఐ కోర్టు

జగన్‌ కేసులో విచారణ సిబిఐ కోర్టులోనే జరుగాలని ఆదేశం
కోర్టు ప్రాంగణంలో నేతలతో చర్చలు జరిపిన జగన్‌
హైదరాబాద్‌ : వైఎస్సార్సీ నేత జగన్‌ మోహన్‌ రెడ్డి ఆస్తుల కేసులో కొన్ని అంశాలపై విచారణ జరుపుతామని ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి సిబిఐ కోర్టు కొట్టివేసింది. వారి పిటిషన్‌ను సిబిఐ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇప్పటి వరకు సిబిఐ అధికారులు దాఖలు చేసిన చార్జిషీట్‌ల మేరకు ఆస్తుల జప్తు చేస్తున్న ఈడీ అధికారులు ఆ కేసులో పీసీ యాక్ట్‌కు సంబంధిం చిన అభియోగాలపై ఈడీ కోర్టులో విచారణలు జరుపుతామని కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. ఆ విషయంపై సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం సిబిఐని వివరణ కోరింది. వారు కౌంటర్‌ దాఖలు చేశారు. పిసీ యాక్ట్‌ మేరకు నమోదు చేసిన అభియోగాలు విచారించే అధికారం ఈడీ కోర్టుకు లేదని సిబిఐ కౌంటర్‌లో వివరించింది. అయితే తమ కేసు మేరకు తాము ఈడీ కోర్టులో విచారణలు జరుతామని ఈడీ తరపు న్యాయవాది వాదించినప్పటికి కోర్టు సిబిఐ వాదనలతో ఏకీభవించింది. అయితే పిఎంఎల్‌ఏ చట్టం మేరకు విచారణలు చేసుకోవచ్చని కోర్టు సూచించింది. ఇప్పటికే  జగన్‌ ఆస్తుల కేసుకు సంబంధించిన విచారణ నిమిత్తం ఈడీ ప్రత్యేక న్యాయస్థానం (న్యాయప్రాధికార సంస్థ)లో హాజరు కావాలని జగన్‌ మోహన్‌ రెడ్డికి నోటీసులు జారీ అయ్యాయి. ఈడీ అధికారులు సమర్పించిన సదరు చార్జిషీట్‌ మేరకు మార్చి 28న విచారణ జరుగనుంది. ఆ విచారణకు హాజరు కావాలని జగన్‌కు అతని సహచరులకు కోర్టు నోటీసులు జారీ చేసింది.

జగన్‌ సహా 19 ఆ చార్జిషీట్‌లో ముద్దాయిలు ఉన్నారు. వారందరిని కోర్టు విచారణకు పిలిచింది. ఈడి ఆస్తుల సీజ్‌కు సంబంధించి జగన్‌ న్యాయప్రాదికార సంస్థ (ఈడి కోర్టు)లో ఇప్పటికే వాదనలు విన్పించారు. అయినప్పటికి సదరు కోర్టు ఈడీ అధికారులనే సమర్థించింది. సిబిఐ ఇచ్చిన ఆధారాలపై ఈడీ అధికారులు ప్రత్యేక విచారణలు చేయడంతో వారి వాదనలకు కోర్టులో బలం చేకూరింది. ఇప్పుడు పిసీ యాక్ట్‌ మేరకు కూడా ఈడీ కోర్టులోనే విచారణలు జరుపుతామని ఈడీ అధికారులు అడుగుతున్నారు. కాని సిబిఐ కోర్టు అనుమ తించలేదు. ఆ క్రమంలో ఈ నెల 28న ఈడీ కోర్టు విచారణలో ఈ విషయాలపై వాదనలు జరిగే అవకాశం లేకపోలేదు.

కోర్టు ప్రాంగణంలో జగన్‌ చర్చలు
ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపుల విషయంలో జగన్‌ ఆయన పార్టీ శాసన సభ్యులతో చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. అదే క్రమంలో ఆయన ఢిల్లీ పర్యటన జరిగింది. దీంతో ఆయన ఆయా ఎంఎల్‌ఏలతో చర్చలు జరిపే సమయం దొరకలేదు. కాగా శుక్రవారం ప్రకాశం, నెల్లూరు జిల్లాల వైకాపా శాసన సభ్యులను హైదరాబాద్‌ రావాలని ఆ పార్టీ ముందే ఆదేశించింది. ఆ మేరకు వారు హైదరాబాద్‌కు వచ్చారు. అయితే జగన్‌ కోర్టు విచారణ నిమిత్తం కోర్టు ప్రాంగణంలో వేచి ఉండాల్సి వచ్చింది. చివరకు ఏ సమయానికి విచారణ ముగుస్తుందన్న విషయంపై కూడా వారికి స్పష్టత లేకపోయింది. అయితే జగన్‌కు సాయింత్రం, రాత్రి ఇతరులతో సమావేశాలు ఉన్నందున సదరు ఎంఎల్‌ఏలను కోర్టు ప్రాంగణంకు పిలిపించుకుని మాట్లాడారు. ఆయా ప్రాంతాలలో పార్టీ పరిస్థితిపై సమీక్ష జరపారు. అదే విధంగా సదరు ఎంఎల్‌ఏలతో జగన్‌ కలుపుగోలుగా మాట్లాడారు.

ఏది ఏమైనా కోర్టు ప్రాంగణంలోనే పార్టీ మీటింగ్‌ పూర్తి చేశారన్న వాదన విన్పించింది. ఇదిలా ఉండగా ప్రకాశం జిల్లా వైకాపా శాసన సభ్యులలో సంతనూతల పాటు శాసన సభ్యుడు అదిములపు సురేష్‌ బాబు గైర్హాజరయ్యారు. ఆయన త్వరలో గోడ దూకుతాడన్న చర్చ జరిగింది.