ఇచ్చిన సోనియా..తెచ్చిన కెసిఆర్‌

sonia gandhi
sonia gandhi

తెలంగాణ ఎన్నికల సంకుల సమరం
ప్రత్యేక రాష్ట్రంలో తొలిసారి అడుగిడుతున్న సోనియా
హైదరాబాద్‌: దేశంలో29 వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ జిల్లాతోపాటు జాతీయ స్థాయిలో జరిగిన హడావుడి తక్కువేమి కాదు. పైగా పార్లమెంట్‌లో రాష్ట్ర విభజన బిల్లు ప్రతిపాదించి, అమోదించే సమయంలో చట్టసభలోనే జరిగిన పెప్పర్‌ స్ప్రే, ఆయా పార్టీల అనుకూల,వ్యతిరేక వాదనలు, బిల్లు ఆమోదం సమయంలో జరిగిన గందరగోళం, చివరికి పార్లమెంట్‌ తలుపులు మూసి తీర్మానం ఆమోదించిన తీరు ఇప్పటికీ చర్చనీయాంశమవుతున్నది. ఎఐసిసి అధ్యక్షురాలుగా, యుపిఎ ఛైర్‌పర్సన్‌గా ఆనాడు సోనియా గాంధీ దృఢ సంకల్పంతో తీసుకున్న కీలక నిర్ణయం వల్లనే తెలంగాణ సాధ్యమైందని కూడా ఆ సమయంలో పార్లమెంట్‌ సమావేశాల ప్రత్యక్షంగా వీక్షించిన ప్రతి తెలంగాణ వాది విశ్వసించారు. అందుకేనేమో ముఖ్యమంత్రిగా కె.చంద్రశేఖర రావు కూడా తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో సోనియా నిర్ణయాన్ని శ్లాఘించారు. అయితే శుక్రవారం నాడు సోనియా గాంధీ తెలంగాణ పర్యటన-ఎన్నికల ప్రచార సభ నేపథ్యంలో మరోసారి ఈ విషయం చర్చకు వస్తున్నది.పైగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రప్రథమంగా సోనియా గాంధీ తెలంగాణలోఅడుగిడుతున్నారు. రాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న మలివిడత ఎన్నికలల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రజా ఫ్రంట్‌ను విజయ పథంలో నడిపించేందుకు సోనియా చేసే ప్రచారం ఎలా ఉండబోతున్నప్పటికీ, ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన సోనియాకు, ఒకవైపు తెలంగాణ తెచ్చిన కెసిఆర్‌ ఇప్పటికే రాష్ట్రంలో సుడిగాలి పర్యటనతో టిఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపుకు అహర్నిషలు కృషి చేస్తున్న కెసిఆర్‌కు మధ్య సంకుల సమరంగా ఈ ఎన్నికలు నిలుస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత సోనియా గాంధీ ఇప్పటివరకు రాష్ట్రంలో పర్యటించలేదు. 2014 లో జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ తెలంగాణ ఇచ్చినందున తమ పార్టీ విజయావకాశాలు అధికంగా ఉంటాయని జాతీయ నాయకత్వం భావించింది. ఇందులోభాగంగానే సోనియా రాష్ట్రంలో పర్యటించలేదు. పైగా తెలంగాణ కాంగ్రెస్‌ నేతల మధ్య సమన్వయం లోపించి, డజన్‌ మంది నాయకులు తామంటే తాము ముఖ్యమంత్రి అభ్యర్థిగా చెప్పుకుంటూ పార్టీ ఓటమికి కారకులైన విషయం ఫలితాలు వెల్లడైన తర్వాత మాత్రమే వెల్లడి అయింది. పార్టీ తర్వాతి విశ్లేషణల్లో విజయావకాశాలు దెబ్బతినడానికి కారణాలు తెలిసినప్పటికీ చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా కాంగ్రెస్‌ పరిస్థితి మారింది.దీంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీగా ప్రజల విశ్వాసం పొంది, 2018 ఎన్నికల్లో తెలంగాణలో పార్టీని ఎలాగైనా అధికారంలోకి రావాలనే పట్టుదల పార్టీ అధిష్ఠానంలో పెరిగింది. అందుకే గతంలో జరిగిన లోటుపాట్లను పరిశీలించి, వాటిని సరిదిద్దుకునేలా అన్ని స్థాయిల్లో చర్చలు కొనసాగించారు. పైగా టిఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ఒంటరిపోరుకుంటే ఇతర పక్షాలను కలుపుకొని వెళ్లి, విజయం సాధించాలనే ఆలోచనకు కూడా పార్టీ అధిష్ఠానం సుముఖత వ్యక్తం చేయడంతో నాలుగుపార్టీల ఫ్రంట్‌ ముందుస్తు ఎన్నికల్లో తమ సత్తా చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నది. ఈ ఫ్రంట్‌ తరపున రాష్ట్రంలో ప్రచారం చేయడానికి శుక్రవారం నాడు సోనియా గాంధీ వస్తుండటంలో పరిస్థితి ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటానికి ఇప్పటివరకు టిఆర్‌ఎస్‌తోపాటు కాంగ్రెస్‌ కూడా తామంటే తామని పోటాపోటీ ప్రజలకు వివరిస్తూ వస్తున్నాయి. అయితే 2014 ఎన్నికల్లో మాత్రం టిఆర్‌ఎస్‌కు పట్టం కట్టి, రాష్ట్ర సాధనలో తమ కృషిని తెలంగాణ ప్రజలు గుర్తించారని ఆ పార్టీ ప్రచారం పెంచుకుంది. అయితే 119 అసెంబ్లీ సీట్లలో అత్తెసరు సీట్లు అంటే సాధారణమెజారిటీకి కొద్ది ఎక్కువ సీట్లు 63 కే పరిమితం చేసి టిఆర్‌ఎస్‌కు సంపూర్ణ విజయం ఇవ్వలేదని కాంగ్రెస్‌ ఆరోపిస్తూ వస్తున్నది. పైగా జంటనగరాల ఓటర్లు టిఆర్‌ఎస్‌ను తీవ్రస్థాయిలో వ్యతిరేకించారనేది ప్రధానప్రతిపక్షంగా మిగిలిన కాంగ్రెస్‌ విమర్శ. అయితే తర్వాతి పరిణామాలతో జంటనగరాల ప్రజల ఆదరణ లభించినందున గ్రేటర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు అఖండ మెజారిటీ సాధ్యమైందని తమ ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ పథకాల అమలు వల్ల మళ్లీ తెలంగాణప్రజలు టిఆర్‌ఎస్‌ను ఆదరిస్తారనే విశ్వాసంతో ముందస్తు ఎన్నికలకు సిద్ధమై ప్రస్తుతం ఎన్నికల్లో ప్రచారంలోనూఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. టిఆర్‌ఎస్‌కు దీటుగా ఫ్రంట్‌ను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకే అన్నట్లుగా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని కూడా కాంగ్రెస్‌ నేతలు ప్రచారానికి తీసుకువస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర కాల సాకారం కావడానికి సోనియా గాంధీ తీసుకున్న చొరవను గుర్తు చేసి, శుక్రవారం నాడు మేడ్చెల్‌లో జరిగే మహా కూటమి లేదా పీపుల్స్‌ ఫ్రంట్‌ బహిరంగ సభలో ఆమెతో మాట్లడించే అంశాలపై ప్రధానంగా ఫ్రంట్‌ నేతలు ఆశలు పెంచుకున్నారు. సోనియా ప్రత్యేకంగా తీసుకున్న శ్రద్ధవల్లనే తెలంగాణ సాధ్యమైందని కేవలం ఇద్దరు ఎంపీలున్న టిఆర్‌ఎస్‌ చేసింది ఏమీలేదని ఆమెతోనే ప్రజలకు చెప్పడం ద్వారా అది మరింతగా ప్రజల్లోకి వెళ్తుందని దీంతోపాటు టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను, అవినీతి ఈ సభ ద్వారా ఎండగట్టాలని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. ఆమెప్రసంగం పార్టీ క్యాడర్‌లోమరింత ఉత్సాహం పెంచి ఊపునిస్తుందని అంటున్నారు. సోనియా వల్ల రాష్ట్రం ఏర్పడితే ఆ క్రెడిట్‌ అంతా టిఆర్‌ఎస్‌ పార్టీ వాడుకుంటుందని, కేవలం కెసిఆర్‌ ప్రయత్నాల వల్లనే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించలేదని తెలంగాణ జనం అర్థం చేసుకునేలా సోనియా సభను ఫ్రంట్‌ నేతలు తీర్చిదిద్దుతున్నారు. ఈ మేరకు ప్రత్యేకంగా ప్రసంగాన్ని కూడా రూపొందించినట్లు సమాచారం.
తెలంగాణలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి కాంగ్రెస్‌తోపాటు టిడిపి, టిజెఎస్‌, సిపిఐ మహా కూటమిగా ఏర్పాటు అయిన దానికి పీపుల్స్‌ ఫ్రంట్‌గా నామకరణం చేసుకొని,ఎన్నికల బరిలోకి దిగారు. అయితే కాంగ్రెస్‌ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి టిఆర్‌ఎస్‌ నేతలు కూగా ముందస్తు కసరత్తుతో సిద్దంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడంలో జరిగిన తీవ్ర జాప్యం వల్లనే యువకులు విద్దార్ధులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ముందుగా తెలంగాణ రాష్ట్రం ప్రకటించి ఉంటే ఈ ప్రాణ నష్టం తప్పేదని ఇప్పటికే టిఆర్‌ఎస్‌ పలు సందర్భాల్లో ప్రతిదాడికి దిగుతున్నది. పైగా కెసిఆర్‌ రెండు దశాబ్దాల పాటు సాగించిన ఉద్యమమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాకారం కావడానికి కీలకమైందని టిఆర్‌ఎస్‌ వాదిస్తున్నది. అయితే ఈ విషయాలన్నీ సోనియా తన ప్రసంగంలో ఏ మేరకు తిప్పికొడుతారు? ఆమె ఈ పర్యటన వల్ల ఫ్రంట్‌కు జరిగే ప్రయోజనం ఎంతవరకుంటుంది? తెలంగాణ ప్రధాతగా సోనియాను గుర్తించుకొని రాష్ట్ర ప్రజలు ఈ దఫా ఎన్నికల్లో ఫ్రంట్‌కు పట్టం కడతారా? అనేది డిసెంబర్‌ 7 నజరగనున్న పోలింగ్‌లో ప్రజలు తీర్పు ఇవ్వనున్నారు.