ఇక రాష్ట్రంలో నియామకాల జాతర

AP CM BABU
AP CM BABU

+ 20,010 ప్రభుత్వోద్యాగాల భర్తీకి ముఖ్యమంత్రి ఆమోదం
+ త్వరితగతిన ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశం
+ త్వరలో ఏపిపిఏస్సీ, డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదల
అమరావతి: ఎన్నో ఏళ్ళుగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరాల జల్లు కురిపించారు. 20వేలకు పైగా పోస్టుల భర్తీకి మంగళవారం ఆయన ఆమోదం తెలిపారు. గ్రూప్‌1, 2, 3, డిఎస్‌సి, పోలీస్‌ శాఖలతో సహా వివిద శాఖల్లోని 20,010 ఖాళీల భర్తీని ఏపిపిఎస్‌సి, డిఎస్‌సి ద్వారా ప్రత్యక్ష పద్దతిలో చేపట్టాలని నిర్ణయించారు. వివిధ శాఖల్లో ప్రస్తుతమున్న ఖాళీలు, అవసరాల దృష్ట్యా మెగా రిక్రూట్‌మెంట్‌ జరపాలని ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 150 గ్రూప్‌1 ఖాళీలు, 250 గ్రూప్‌2 ఖాళీలు, 1670 గ్రూప్‌-3 ఖాళీలతో పాటు పోలీస్‌ ఎగ్జిక్యూటివ్‌, ఏపిఎస్‌ఎల్‌పీఆర్‌బి ఖాళీలు 3వేలు, వైద్యశాఖలో 1604 ఖాళీలు, ఇతర ఖాళీలు 1636, పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పోస్టులు 310, జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులు 200, ఏపిఆర్‌ఈఐ సొసైటీ పోస్టులు 10, ఏపిఆర్‌ఈఐ సొసైటీ డిగ్రీ కాలేజ్‌ లెక్చరర్‌ పోస్టులు 5, డిగ్రీ కళాశాలల లెక్చరర్‌ పోస్టులు 200 భర్తీ చేయాల్సిన వాటిలో వున్నాయి. డిఎస్‌సి ద్వారా మొత్తం 9,275 ఖాళీలు భర్తీ చేయనున్నారు. వాటిలో జడ్‌పి, ఎంపిపి పాఠశాలల్లో 5వేలు, మున్సిపల్‌ పాఠశాలల్లో 1100, గురుకుల పాఠశాలల్లో 1100, సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 750, షెడ్యూల్‌ ఏరియాలోని ఆశ్రమ పాఠశాలల్లో 500 ఖాళీలు, నాన్‌ షెడూయల్‌ ఏరియాలో ఆశ్రమ పాఠశాలల్లో 300, బిసి సంక్షేమ రెసిడెన్సియల్‌ పాఠశాలల్లో 350, ఏపిఆర్‌ఈఐ సొసైటీలో 165 వున్నాయి. అలాగే సమాచార పౌర సంబంధాల శాఖలో 21 ఖాళీల భర్తీకి కూడా సిఎం అనుమతించచారు. ఇందులో డిపిఆర్‌ఓ పోస్టులు 4, ఏపిఆర్‌ఓ పోస్టులు 12, డిఈటిఇ పోస్టులు 5 భర్తీ చేయనున్నారు. ప్రకటించిన మొత్తం ఖాళీల సత్వర భర్తీకి, వీలైనంత త్వరగా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని సిఎం ఆదేశించారు. ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికెషన్లు విడుదల చేస్తామని ఏపిపిఎస్‌సి, డిఎస్‌సి వర్గాలు ప్రకటించాయి.