ఇక‌పై ఒంటరిగా ఎవరెస్టు అధిరోహించడం నిషేధం!

Everest
Everest

ఖాట్మండు: ఎవరెస్టు ఎక్కేందుకు ప్రతి ఏడాది వేల సంఖ్యలో పర్వతారోహకులు నేపాల్‌ వెళ్తుంటారు. ఐతే ఇపుడు ఆ దేశ ప్రభుత్వం ఒంటరిగా పర్వతారోహణపై నిషేధం విధించాలని భావిస్తున్నది. మౌంట్‌ ఎవరెస్టుపై ప్రమాదాలను తగ్గించాలన్న ఉద్దేశ్యంతో నేపాల్‌ క్యాబినేట్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఒంటరిగా ఎవరుస్టును ఎక్కేవారికి పర్మిషన్‌ ఇవ్వరాదు అని క్యాబినెట్‌ నిర్ణయించింది. ఒకవేళ అదే నిజమైతే ఇక సోలో క్లయింబర్స్‌ ఎవరెస్టును ఎక్కే ఛాన్సును కోల్పోయినట్లే. ప్రపంచంలోనే ఎవరెస్టు అత్యంత ఎత్తైన శిఖరం . దాన్ని అధిరోహించేందుకు అక్కడికి వెళ్తుంటారు. ఐతే ఇటీవల ఎవరెస్టుతో పాటు ఇతర పర్వతాల్లోనూ ప్రమాదాలు ఎక్కువయ్యాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాలను తగ్గించాలన్న ఐడియాతో ఒంటరి పర్వతారోహకులను బ్యాన్‌ చేస్తున్నట్లు నేపాల్‌ ప్రభుత్వం తెలిపింది. గత ఏడాది సుమారు 450 మంది ఎవరెస్టును ఎక్కారు. అందులో 190 మంది విదేశీయులు, 260 మంది నేపాలీయులు ఉన్నారు.