ఇంటర్‌ ఫలితాల్లో.. బాలికల హవా

Inter Results
రంగారెడ్డి జిల్లా ఫస్టు.. నల్గొండ, మెదక్‌ లాస్టు
మే 24 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ
హైదరాబాద్‌ : తెలంగాణలో ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ జనరల్‌, వృత్తి విద్య ఫలితాలు శుక్రవారం ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్‌ విద్యా మండలి కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేశారు. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో 53.32% మంది, సెకండియర్‌లో 62.01% మంది విద్యార్థులు ఉత్తీ ర్ణత సాధించారు. మొత్తంగా ఇంటర్‌ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 4,56,675 మంది పరీక్షలు రాయగా..2,43,503 మంది పాసయ్యారు. వీరిలో బాలికలు 59% మంది బాలురు 48% మంది ఉత్తీర్ణులైనారు. అలాగే ద్వీతీయ సంవత్స రంలో 4.18,231 మంది పరీక్షలు రాయగా.. 2,62,245 మంది పాసయ్యారు. వీరిలో బాలికలు 67.64% మంది, బాలురు 58% మంది ఉత్తీర్ణులయ్యారు. ఏపి మాదిరిగానే తెలంగాణలో కూడా ఒకేసారి ప్రథమ, ద్వితీయ సంవత్సర ఇంటర్‌ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఫస్టియర్‌ ఫలితాల్లో 69%, సెకండర్‌ ఇయర్‌ ఫలితాల్లో 75%తో ఈ జిల్లా మొదటి స్థానాన్ని పొందింది. ఇక ఫస్టియర్‌ ఫలితాల్లో హైదరాబాద్‌ 56%తో రెండో స్థానంలో నిలవగా..సెకండ్‌ ఇయర్‌ ఫలితాల్లో ఖమ్మం 66%తో రెండో స్థానాన్ని కైవసం చేసుకొంది. మరోవైపు నల్లగొండ 41%తో ఇంటర్‌ ఫస్టియర్‌లో చివరిస్థానంలోనూ, సెకండియర్‌లో మెదక్‌, నల్లగొండలు చివరి స్థానంలో నిలిచాయి. ఈ ఫలితాలను విడుదల చేసిన అనంతరం డిప్యూటీ సిఎం శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో మౌలిక సదుపాయాలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యనిచ్చి నిధుల కేటాయించిందని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ఉత్తీర్ణత 2% తగ్గగా…రెండవ సంవత్సరంలో ఉత్తీర్ణత 1.5 శాతం పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడు ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన ఫలితాలు వచ్చాయని కడియం తెలిపారు. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 62 శాతం, ప్రైవేటు కాలేజీల్లో 63 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన తెలిపారు.  మొత్తం 36 వెబ్‌సైట్లలో ఇంటర్‌ ఫలితాలను పొందుపర్చామని ఆయన పేర్కొన్నారు.

మే 24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు..ఈనెల 30 వరకు ఫీజుకు గడువు..
ఇంటర్‌ పరీక్షల్లో తప్పిన విద్యార్థులకు మే24 నుంచి 31వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లి మెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.ఈ సప్లిమెంటరీపరీక్షలకు, రీకౌంటింగ్‌కు  ఫీజు చెల్లించేందుకు ఏప్రిల్‌ 30 చివరి తేదీగా ప్రకటించారు. ఎలాంటి ఆలస్య రుసుముతో గడువుపెంపులేదు. ఫస్టుఇయర్‌ పాసైన విద్యార్థులు ఇంప్రూవ్‌ మెంట్‌ కోసం సాధారణ పరీక్ష ఫీజుతోపాటు..ఒక్కొ సబ్జెక్టుకు రూ.100 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుందని బోర్డు తెలిపింది. ఈ పరీక్ష ఫలితాలను ఆయా వెబ్‌సైట్లతోపాటు కాల్‌ సెంటర్‌ ద్వారా కూడా పొందవచ్చు. ఈ సేవా, మీ సేవ, టిఎస్‌, ఏపి ఆన్‌లైన్‌ కేంద్రాల్లోనూ ఫలితాలు పొందవచ్చు.