ఆ నొప్పికి కారణాలనేకం

ఆ నొప్పికి కారణాలనేకం

PAIN
Ladies Pain

ప్రకృతి సిద్ధమైన శరీర భేదాల వలన పురుషులకు వచ్చే కడుపు నొప్పులతోపాటు, మరికొన్ని రకాల కడుపునొప్పులు మహిళలకు అదనంగా వస్తాయి. స్త్రీలలో వివిధ కారణాల వలన జన నేంద్రియ అవయవాలలో నొప్పి వచ్చే అవకాశం ఉంది. స్త్రీలు గర్భం ధరించి నప్పుడు కొన్నిసార్లు గర్భాశయంలో కాకుండా, ఇతర గర్భాశయేతర భాగాల్లో పిండం రూపుదాలుస్తుంది. కొన్ని వారాల తరువాత అక్కడ స్థలం సరిపోకపోవడంతో గర్భస్రావం జరుగుతుంది. దీని వలన ఆ పిండం తాలూకు పదార్థాలు బైటకు రాలేక, కడుపులోకే చేరి, రక్తస్రావం జరగడం సంభవిస్తుంది. దీనిని వైద్యపరిభాషలో రప్చర్డ్‌ ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ అని అంటారు. రోగికి అకస్మాత్తుగా పొత్తికడుపు భాగంలో విపరీతమైన నొప్పి వస్తుంది. దీనితోపాటు రక్తస్రావం కలిగి, దానిలో భాగంగా రక్తపోటు తగ్గిపోయి, రోగి శరీరం చల్లబడుతుంది. ఈ స్థితిలో రోగ నిర్ధారణ జరుగకపోతే, ప్రాణాపాయం సంభవించవచ్చు. రక్తపరీక్ష, స్కానింగ్‌ల ద్వారా వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. రక్త పరీక్ష చేసిన ప్పుడు హీమోగ్లోబిన్‌ శాతం తగ్గిపోయినట్లు వెల్లడవుతుంది. ఈ సమస్యకు ఆపరేషన్‌ ద్వారా లోపలి భాగలను శుభ్రం చేయాల్సి ఉంటుంది.

పగిలిన భాగాన్ని సరి చేయాల్సి ఉంటుంది. రోగికి కొన్ని సీసాల రక్తంకూడా ఎక్కించాల్సి రావచ్చు. పరిస్థితి తీవ్రం కాకముందే ఆపరేషన్‌ చేయడం ద్వారా ప్రాణాపాయ స్థితినుంచి రోగిని బైటికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అండాశయం మెలికపడటం మహిళలలో కడుపు నొప్పి కలిగించే కారణాల్లో అండాశయం మెలిక పడటం మరొక అంశం. అండాశయం లిగమెంట్ల ద్వారా గర్భాశయానికి కలిసి ఉంటుంది. కొన్ని కారణాల వలన ఈ లిగమెంట్లు మెలికలు తిరుగుతాయి. దీనితో విపరీతమైన కడుపునొప్పి వస్తుంది. ఒకటి రెండుసార్లు వాంతులు అవుతాయి. శరీరంలోని కుడివైపు అండాశయానికి ఈ సమస్య ఏర్పడి, కడుపు నొప్పి వస్తే దానిని అపెండిసైటిస్‌ అని భ్రమపడే అవకాశాలు ఉంటాయి.

స్కానింగ్‌ ద్వారా వ్యాధి నిర్ధారణ చేసి, ఆపరేషన్‌ ద్వారా సమస్యకు కారణమైన అండాశయాన్ని తొలగిస్తారు. ఇన్‌ఫెక్షన్స్‌ :స్త్రీలలో సంతానోత్పత్తి వయస్సులో వివిధ కారణాల వలన జననేంద్రియాలకు అనేక రకాల సూక్ష్మక్రిముల ద్వారా ఇన్‌ఫెక్షన్స్‌ సోకుతాయి. వీటిలో పొత్తికడుపులో నొప్పితోబాటు, వైట్‌ డిశ్చార్జ్‌ కూడా ఉంటుంది. కొద్దిగా జ్వరం కూడా వస్తుంది. యాంటి బయాటిక్స్‌ ఇవ్వడం ద్వారా ఈ ఇన్‌ఫెక్షన్లను నయం చేయవచ్చు. పురుషులతో పోలిస్తే, స్త్రీలలో మూత్రకోశం, మూత్ర నాళాల వ్యాధులు కూడా ఎక్కుగానే ఉంటాయి. వీటి వలన కూడా కడుపు నొప్పి వస్తుంది.