ఆసియాక‌ప్ ఫైన‌ల్ కి భార‌త్‌

Team India women
Team India women

కౌలాలంపూర్ః భారత మహిళల జట్టు ఆసియా కప్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. టోర్నీలో భాగంగా ఈ రోజు భారత్‌ తన చిరకాల ప్రత్యర్థి పాక్‌పై ఘన విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు తమ సత్తా చాటారు. దీంతో పాక్‌పై భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్‌ గెలిచిన పాక్‌ జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. భారత బౌలర్ల ధాటికి పాక్‌ ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. ఓపెనర్‌ నైన్‌ అబిది పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ బాటపట్టింది. ఆ తర్వాత మైదానంలోకి వచ్చిన ఆటగాళ్లు ఎవరూ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు.
73 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు కూడా శుభారంభం దక్కలేదు. ఓపెనర్‌ మిథాలీ రాజ్‌ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్‌ బాటపట్టింది. అనంతరం క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ కూడా డకౌట్‌గా వెనుదిరిగింది. అప్పుడు క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మరో ఓపెనర్‌ స్మృతి మంధానతో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దింది. వీరిద్దరూ కలిసి మ్యాచ్‌ను విజయం దిశగా తీసుకెళ్లారు. చివర్లో స్మృతి(38) ఔటైనా హర్మన్‌ బౌండరీతో భారత్‌కు విజయాన్ని అందించింది. ఈ మ్యాచ్‌లో భారత్‌… 7 వికెట్ల తేడాతో పాక్‌పై ఘన విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది.